విదేశీ గడ్డపై భారత ప్రధాని నరేంద్ర మోదీని, తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది. ప్రధాని మోదీ నార్వే పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని జోనాస్ గార్ స్టోరేతో కలిసి నిర్వహించిన ఉమ్మడి మీడియా ప్రకటనల అనంతరం జరిగిన పరిణామమే ఇందుకు నిదర్శనం. ప్రెస్ మీట్ ముగిసి ఇరు దేశాల అధినేతలు వేదిక దిగి వెళ్తున్న సమయంలో హెల్లే లింగ్ అనే ఒక నార్వేజియన్ జర్నలిస్ట్ నిబంధనలకు విరుద్ధంగా గట్టిగా అరుస్తూ ప్రధాని మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. ఒక దౌత్యపరమైన అధికారిక పర్యటనలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ ఆమె ప్రదర్శించిన అత్యుత్సాహం వెనుక భారత వ్యతిరేక శక్తుల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రూల్స్ బ్రేక్ చేసి డ్రామా.. సోషల్ మీడియాలో మైలేజ్!
ఈ ఉమ్మడి ప్రెస్ మీట్లో కేవలం ఇరు దేశాల ప్రధానులు తమ అధికారిక ప్రకటనలను చదివి వినిపించేలా ముందే ప్రోటోకాల్ ఖరారైంది. ఇందులో ఎలాంటి ప్రశ్నోత్తరాల సమయం లేదు. నార్వే ప్రధాని స్టోరే కూడా ఎలాంటి ప్రశ్నలు తీసుకోలేదు. అయితే, సమావేశం ముగిసి ఇద్దరు నేతలూ నడుచుకుంటూ వెళ్తున్న తరుణంలో, సదరు జర్నలిస్ట్ కావాలనే కెమెరా ఆన్ చేసుకుని ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన ప్రెస్ నుంచి ప్రశ్నలు ఎందుకు తీసుకోరు అంటూ వెనక నుంచి కేకలు వేసింది. అంతటితో ఆగకుండా, ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, భారతదేశంలో ప్రెస్ ఫ్రీడమ్ లేదంటూ అంతర్జాతీయ సూచీలను ప్రస్తావిస్తూ బురదజల్లే ప్రయత్నం చేసింది. దౌత్యపరమైన నిబంధనలను బేఖాతరు చేస్తూ ఒక దేశ ప్రధానిని అవమానించేలా డ్రామా ఆడటమే లక్ష్యంగా ఈమె వ్యవహరించిందని స్పష్టమవుతోంది.
విదేశీ గడ్డపై అవమానిస్తే.. ఇక్కడ విపక్షాల సంబరాలా?
ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే.. దేశ వెలుపల భారత ప్రధానిని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఒక విదేశీయురాలు అభాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తుంటే, మన దేశంలోని కొందరు విపక్ష నేతలు, సోషల్ మీడియాలో మోదీ వ్యతిరేకులు దాన్ని చూసి సంబరపడిపోవడం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా పలువురు విపక్ష నాయకులు ఆ జర్నలిస్ట్ వేసిన కేకల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ప్రధాని మోదీ భయపడిపోయారంటూ వింత భాష్యాలు చెప్పడం వారి సంకుచిత రాజకీయ తీరుకు అద్దం పడుతోంది. విమర్శలు, రాజకీయ వైషమ్యాలు దేశ సరిహద్దుల వరకే పరిమితం కావాలి. కానీ, విదేశీయులు మన దేశాన్ని, మన ప్రధానిని వేలెత్తి చూపుతుంటే.. దానికి మద్దతుగా నిలుస్తూ ఆనందించడం అంటే దేశ సార్వభౌమత్వాన్ని, స్వయంప్రతిపత్తిని అవమానించడమే అవుతుంది.
నార్వే ప్రధాని స్టోరే, భారత విదేశాంగ శాఖ గట్టి కౌంటర్!
ఈ ప్రచారాన్ని నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోరే స్వయంగా తిప్పికొట్టారు. ఆ తర్వాత జరిగిన అంతర్గత సమావేశంలో సదరు జర్నలిస్ట్‌కు గట్టిగా సమాధానమిస్తూ.. భారతదేశం తనదైన సుదీర్ఘ చరిత్ర, అనుభవాలు కలిగిన ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశమని, దాన్ని నార్డిక్ దేశాల కోణంతో పోల్చలేమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి ప్రెస్‌తో మాట్లాడే స్వంత శైలి ఉందని హితవు పలికారు. అటు భారత విదేశాంగ శాఖ సెక్రటరీ సిబి జార్జ్ కూడా విదేశీ మీడియా ప్రతినిధుల అసంబద్ధ ప్రశ్నలపై తీవ్రంగా స్పందించారు. భారతదేశం ఒక బలమైన రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ పౌరుల హక్కులకు పూర్తి రక్షణ ఉందని, కొన్ని స్వార్థపూరిత స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే తప్పుడు నివేదికలను పట్టుకుని విమర్శలు చేయడం మానుకోవాలని గట్టి కౌంటర్ ఇచ్చారు. ముంచుకొస్తున్న అంతర్జాతీయ సమీకరణాల వేళ, బలీయమైన శక్తిగా ఎదుగుతున్న భారత్‌ను డీఫేమ్ చేయడానికి జరుగుతున్న ఇలాంటి విదేశీ కుట్రలను దేశప్రజలందరూ ఒక్కతాటిపైకి వచ్చి తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం బయట దేశ ప్రధానిని కించ పరిస్తే అది దేశాన్ని కించ పరిచినట్లే అవుతుంది.


