ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ రాజకీయం చేస్తున్నారు. సర్వీసులో ఉండి చేసిన తప్పులకు సస్పెన్షన్ కు గురై నిబంధనలకు అనుగుణగా వ్యవహరించాల్సిన ఆయన .. పూర్తి స్థాయిలో గీత దాటి రాజకీయాలు చేస్తున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పై పరిధి దాటి ఆరోపణలు చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ నాయకుడు మాట్లాడి ఉంటే అది రాజకీయం అనుకుని ఉండేవారు. కానీ ఆయన ఐపీఎస్‌గా ఉన్నారు. ఇంకా రిటైర్ కాలేదు లేదా స్వచ్చంద పదవీ విరమణ చేయలేదు. అందుకే ఆయన ఇలా వ్యవహరించడంతో ఇతరులు ఇదే దారిలో వెళ్తే వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
సివిల్స్ సర్వీస్ అధికారులకు కఠిన సర్వీస్ రూల్స్
ఆలిండియా సివిల్స్ సర్వీస్ అధికారులకు కఠినమైన సర్వీస్ రూల్స్ ఉంటాయి. వారు రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదు. సర్వీసులో ఉన్నంత కాలం వారికి స్పష్టమైన సర్వీస్ రూల్స్ ఉంటాయి. వ్యక్తిగతంగా రాజకీయం చేసుకుంటా.. సర్వీస్ ప్రకారం ఉద్యోగం చేసుకుంటానంటే కుదరదు. రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం.. స్వచ్చంద మత సంస్థలు నడపడం అనేది తీవ్రమైన సర్వీస్ రూల్స్ ఉల్లంఘన. పీస్ సునీల్ కుమార్ వీటన్నింటినీ అలవోకగా ఉల్లంఘించారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో గీతదాటిపోయి రాజకీయాలు చేస్తున్నారు.
గతంలో దేశానికి వ్యతిరేకంగా సునీల్ కుమార్ వ్యాఖ్యలు
సునీల్ కుమార్ ఐపీఎస్ గా ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నారు. కానీ ఆయన సర్వీసులో ఉన్నప్పుడే దేశం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ పాలకుల్ని పొగిడారు. క్రిస్టియన్ మత ప్రచారం చేశారు. మత మార్పిళ్ల కోసం సంస్థను పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై గతంలో కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం నుంచి ప్రభుత్వానికి లేఖలు వచ్చాయి. అయితే వైసీపీ హయాంలో వాటిని తొక్కి పెట్టారు. ఇంతకా ఐపీఎస్ సర్వీస్‌ను దుర్వినియోగం చేస్తున్న అధికారిని ఇప్పటి వరకూ ఉండి ఉండరు.
వైసీపీలో రాజకీయ భవిష్యత్‌కు ఇప్పటికే కర్చీఫ్
పీవీ సునీల్ కుమార్ తెలివి తక్కువ వాడేం కాదు. ఆయన తాను కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నా..కింద పడితే వెళ్లి ఏ రాజకీయ పార్టీలో పడాలో కూడా డిసైడ్ చేసుకుని మరీ నరుక్కుంటున్నారు. గత ఎన్నికల్లోనే తనకు టిక్కెట్ ఇస్తామన్నారని ఆయన చెప్పుకుంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఇవ్వకుండా ఉంటారా అని.. తాను ఇలా రాజకీయం చేస్తున్నారు. కానీ సర్వీసులో ఉండి ఇలా చేయడం అంటే.. సివిల్స్ వ్యవస్థను బలహీనం చేయడమే. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఇతరులు అదేపనిచేస్తే.. వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. అందుకే ఇలాంటి వారికి బుద్ది చెప్పేలా.. వ్యవస్థను బలపరిచేలా.., కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.


