ఇరాన్, అమెరికా మధ్య హార్ముజ్ జలసంధి వేదికగా జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక ప్రాంతీయ వివాదంగా మిగిలిపోలేదు. ఒకవైపు ఇరాన్ జలసంధిపై టోల్ ఫీజులు వసూలు చేస్తూ, తన మిత్రదేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తుంటే.. దానికి ప్రతిగా అమెరికా నేవీ భౌతికంగా రంగంలోకి దిగడం అంతర్జాతీయ చట్టాల పరిధిని దాటి వెళ్తోంది.
భౌతిక అడ్డంకి – అది వార్ ఆఫ్ యాక్ట్
సాధారణంగా అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలను అడ్డుకోవడం అనేది యుద్ధ ప్రకటనతో సమానం. అమెరికా తన నావికా దళాన్ని ఉపయోగించి ఇరాన్ చమురు నౌకలను అడ్డుకోవడం , జలసంధిని క్లియర్ చేస్తామని ప్రకటించడం వెనుక ఉన్న లాజిక్.. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. అయితే, ఈ చర్య అంతర్జాతీయ చట్టాల ప్రకారం దౌత్యపరమైన పరిష్కారం కాకుండా, ప్రత్యక్ష సైనిక చర్యగా మారుతోంది. ఇది ప్రపంచ చమురు మార్కెట్‌ను కుదిపేసే బిగ్గెస్ట్ సప్లై డిస్ట్రప్షన్ కు దారితీస్తోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇరాన్ కంటే ఘోరంగా అమెరికా?
ఇరాన్ తన భద్రత కోసమో లేదా నిధుల కోసమో జలసంధిపై పట్టు సాధించాలని చూస్తోంది. కానీ, అమెరికా అంతర్జాతీయ చట్టాలను కాపాడతామని చెబుతూనే, ఏకపక్షంగా నౌకలను అడ్డుకోవడం ద్వారా మరో ఇరాన్ లాగే ప్రవర్తిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ తన ప్రాదేశిక జలాల్లో నిబంధనలు విధిస్తుంటే, అమెరికా మాత్రం అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ఏ నౌకనైనా ఆపే అధికారం తనకే ఉందని భావించడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది ఒక రకమైన మెరిటైమ్ హెజెమనీ గా మారుతోంది.
చమురు రవాణాపై ఇరాన్ పట్టు
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో సుమారు 20-30 శాతం ఈ చిన్న జలసంధి గుండానే వెళుతుంది. ఇక్కడే ఇరాన్‌కు భౌగోళికంగా గొప్ప వెసులుబాటు ఉంది. అమెరికా ఇక్కడ ఇరాన్‌ను ఛాలెంజ్ చేయడం అంటే, గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలను రిస్క్‌లో పడేయడమే. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లు దాటడం, గల్ఫ్ దేశాల్లో నిత్యావసరాల కొరత రావడం చూస్తుంటే.. అమెరికా ప్లాన్ కేవలం ఇరాన్‌ను దెబ్బతీయడమే కాదు, మొత్తం ప్రాంతాన్నే అస్థిరపరుస్తోందని అర్థమవుతోంది. ఇది కేవలం ఇరాన్, అమెరికా మధ్య పోరుగా మిగలదు.. చైనా, ఇండియా వంటి పెద్ద చమురు దిగుమతి దేశాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అది ఎలాంటి పరిణామాలకైనా దారి తీసే ప్రమాదం ఉంది.
