ఆర్భాటాలే త‌ప్ప అవ‌స‌రాలు ప‌ట్ట‌వా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికీ ఆర్భాటాల‌కే అగ్ర‌తాంబూలం ఇస్తోంది! రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం విష‌యంలో ఇంకా అదే త‌ర‌హా ప్ర‌చారయావే క‌నిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటు త‌రువాత నవ్యాంధ్ర‌ను తామే అభివృద్ధి చేస్తామ‌నీ.. చేయ‌గ‌ల స‌త్తా త‌మ‌కే ఉంద‌నీ.. ఆధునిక హైద‌రాబాద్ నిర్మాత‌ల‌మ‌నీ చంద్ర‌బాబు నాయుడు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూ ఉంటారు. ఎన్నిక‌ల్లో కూడా ఇదే ప్రొగ్రెస్ కార్డుతో ఆంధ్రా ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షించారు. అధికారంలోకి వ‌చ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా అమ‌రావ‌తి నిర్మాణ న‌మూనాల‌పైనే ప్ర‌భుత్వానికి క్లారిటీ లేదు. ఇదే విష‌యాన్ని మంత్రి నారాయ‌ణ తాజాగా వెల్ల‌డించారు.

రాజ‌ధాని ప్రాంతంలో నిర్మించబోతున్న భ‌వ‌నాల డిజైన్ల‌పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేద‌ని చెప్పారు. నార్మ‌న్ పోస్ట‌ర్ సంస్థ త‌యారు చేసిన న‌మూనాల‌పై మంత్రులు, అధికారుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింద‌న్నారు. ఈ లెక్క‌న డిజైన్లు ఏనాటికి పూర్త‌వుతాయో మ‌రి..? ఇంకోప‌క్క ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధం అంటున్న‌ట్టుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సంకేతాలు ఇచ్చేస్తున్నారు. అంటే.. ఈ టెర్మ్ లో రాజ‌ధాని నిర్మాణం అనేది ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డ అనేది దాదాపు స్ప‌ష్టంగానే ఉన్న‌ట్టు. వ‌చ్చే ఎన్నిక‌ల మేనిఫెస్టోలో మ‌రోసారి ఇదే అంశాన్ని ప్ర‌ధానంగా పెట్టుకుంటారేమో..!

ఇదే త‌రుణంలో అసెంబ్లీ భ‌వ‌నం గురించి కూడా మంత్రి నారాయ‌ణ కొన్ని విష‌యాలు చెప్పారు. ఆంధ్రా అసెంబ్లీ భ‌వ‌నాన్ని ఈఫిల్ ట‌వ‌ర్ మాదిరిగా నిర్మిస్తామ‌న్నారు. మొత్తం నాలుగు భ‌వ‌నాలుంటాయ‌నీ, వాటిపై దాదాపు 500 అడుగుల ఎత్తులో ఈఫిల్ ట‌వ‌ర్ లాంటిది క‌ట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలిపారు. దీని పైకి వెళ్లేందుకు అనువుగా లిఫ్టులు, న‌డిచి వెళ్లేందుకు ర్యాంపులు కూడా క‌ట్టాల‌ని అనుకుంటున్నార‌ట‌. స‌మావేశాలు లేని రోజుల్లో ఈ ట‌వ‌ర్ మీదికి ప‌ర్యాట‌కుల్ని అనుమ‌తించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు చెప్పారు. దీనికి సంబంధించిన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్ష జ‌ర‌గాల్సి ఉంద‌న్నారు.

అమ‌రావ‌తిలో ఈఫిట్ ట‌వ‌ర్ కావాల‌ని ఆంధ్రులు ఇప్పుడు అడుగుతున్నారా..? ఇలాంటివ‌న్నీ అద‌న‌పు హంగులు. అత్య‌వ‌స‌రాలు తీరిన త‌రువాత వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది. అంతేగానీ.. ఒక ప‌క్క అవ‌స‌ర‌మైన భ‌వ‌న నిర్మాణాల న‌మూనాలు ఫైన‌లైజ్ చేయ‌డం లేద‌ని చెబుతూనే.. మ‌రోపక్క ఈఫిల్ ట‌వ‌ర్ లాంటిది క‌డ‌దామ‌నుకుంటున్నాం అని చెబుతుంటే.. వినే ప్ర‌జ‌ల‌కు ఏమ‌నిపిస్తుంది..? అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు ఈఫిల్ ట‌వ‌ర్ క‌డ‌తార‌ట అని ప్ర‌చారం చేసుకోవ‌డానికి త‌ప్ప‌… ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ ప్ర‌తిపాద‌న‌కు ప్రాధాన్య‌త ఉందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.