నా అంత అనుభవమున్న రాజకీయనాయకుడు ఇంకొకరు ఎవరూ లేరు అని చంద్రబాబు తరచుగా చెప్పుకుంటూ ఉంటాడు. మిగతా విషయాల్లో తెలియదు కానీ రాజకీయ వ్యూహాల విషయంలో మాత్రం అది నిజం. మామూలుగా రాజకీయ నాయకుల జంపింగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ చంద్రబాబు సారధ్యంలోని టిడిపి పార్టీ మాత్రం నాయకులకంటే ఎక్కువ జంపింగ్సే చేసేసింది. కమ్యూనిస్టులతో కలిశారు. బిజెపితో సంసారం గురించి ప్తత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెసీఆర్ పార్టీతో కూడా కాపురం చేశాడు. అలాగే కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో కూడా రహస్యంగా రాసుకుపూసుకు తిరిగాడన్నది వాస్తవం. ఎప్పుడు ఎవరిని ఎలా వెన్నుపోటు పొడవాలో? ఎప్పుడు ఎవరిని ఎలా వదిలేయాలో, ఎవరిని కలుపుకోవాలో, ఎవరిని ఎలా వదిలించుకోవాలో చంద్రబాబుకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఈ విషయంలో మాత్రం మన తెలుగు నాయకుడు చంద్రబాబు ప్రపంచానికి పాఠాలు చెప్పెయ్యగలడు.
నందమూరి తారకరామారావు మనవడు ఎన్టీఆర్ విషయంలో కూడా తన రాజకీయ వ్యూహాలన్నింటినీ వాడేశాడు చంద్రబాబు. కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్‌ని పట్టించుకున్న నాథుడు లేడు. కనీస ప్రోత్సాహం అందించిన వాడు కూడా ఎవ్వడూ లేడు. స్వయం కృషితో, ప్రతిభతో, పుట్టుకలో కలిసొచ్చిన ఎన్టీఆర్ ముఖకవళికలతో అనతి కాలంలోనే సూపర్ స్టార్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్. 2009లో తనకు అవసరమైనప్పుడు మాత్రం ఎన్టీఆర్‌ని చేరదీశాడు చంద్రబాబు. ఎన్నికల ప్రచారానికి వాడుకున్నాడు. ఎన్టీఆర్ మొహం చూపించి ఓట్లు కొల్లగొట్టేయాలని ప్లాన్ చేశాడు చంద్రబాబు. అది ఎన్టీఆర్-చంద్రబాబుల పొలిటికల్ సినిమా ప్రారంభం. కానీ ఎన్టీఆర్ మాత్రం తాత నందమూరి తారక రామారావులాగే రాజకీయాల్లో కూడా సత్తా చాటాలనుకున్నాడు. కష్టంతో పోరాడి గెలిచిన విధానం, మనుషులను, సమాజాన్ని అవగాహన చేసుకుని ఉన్న ఎన్టీఆర్ టాలెంట్స్ ముందు చాక్లెట్ బాయ్ లోకేష్ నిలబడలేడన్న విషయం అందరికీ తెలుసు. ఇక చంద్రబాబుకు మాత్రం తెలియకుండా ఎందుకు ఉంటుంది? అందుకే తన రాజకీయ చాణక్య తెలివితేటలన్నీ వాడేసి చాలా నైస్‌గా, స్మూత్‌గా ఎన్టీఆర్‌ని పార్టీ నుంచి బయటకు పంపించేశాడు. ఎక్కడా ఎవ్వరూ కూడా ఎన్టీఆర్‌కి సపోర్ట్‌గా ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్తపడ్డాడు. ఎన్టీఆర్ పేరు వినపడకుండా చేశాడు. బొమ్మ కనపడకుండా చేశాడు. అట్టే మాట్లాడితే వర్గ శతృవు అయిన వైఎస్ జగన్‌కి ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తున్నాడని అనుకూల మీడియాతో అబద్ధపు ప్రచారం చేయించాడు. ఒక టైంలో ఎన్టీఆర్‌ని తొక్కేయాలని కూడా గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఆయన సినిమా కలెక్షన్స్ స్థాయిని తగ్గించడానికి శతధా ప్రయత్నించారు. అలా ఎన్టీఆర్-చంద్రబాబుల పొలిటికల్ సినిమాకి బీభత్సమైన ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడింది.
పుట్టిన మరుక్షణం నుంచి కూడా ఇలాంటివి ఎన్నో చూసేసిన హీరో ఎన్టీఆర్ కూడా వెంటనే అలర్ట్ అయ్యాడు. తనను తాను మార్చుకున్నాడు. మరింత బలంగా తయారయ్యాడు. సినిమాలలో కూడా తన యాక్టింగ్ స్టైల్ మార్చి నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. మరోసారి టాప్ పొజిషన్‌కి వచ్చేశాడు. అదే సమయంలో చంద్రబాబు బలాలు తగ్గి బలహీనతలు పెరుగుతూ వచ్చాయి. 2019కి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సొంతంగా పోటీ చేయడం ఖాయం. 2014లో తనకు బలమయిన పవన్ ఈ సారి మాత్రం తనకు వ్యతిరేకంగా కత్తి దూసేలా కనిపిస్తున్నాడు. అలాగే బిజెపి వాళ్ళు కూడా కలిసుందామంటూనే చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు. అందుకే చంద్రబాబుకు ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ అవరమయ్యాడు. లోకేష్ బాబు కూడా తెలుగు దేశం పార్టీలో నాయకుడిగా నిలబడిపోయాడని చంద్రబాబుకు గట్టి నమ్మకం వచ్చేసింది. ఇప్పుడిక ఎన్టీఆర్ టిడిపిలోకి వచ్చినా లోకేష్‌కి జూనియరే అవుతాడు. లోకేష్‌కి పార్టీ అధ్యక్షుడి హోదా ఉంటే ఎన్టీఆర్‌కి కార్యకర్త హోదా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడప్పుడే ఎన్టీఆర్ పదవులు కోరుకోడు. ఎన్నికలలో పోటీ చేయడు కాబట్టి. అందుకే కృష్ణా పుష్కరాల టైం నుంచి కూడా ఎన్టీఆర్‌కి ప్రేమ రాయబారం పంపిస్తూ ఉన్నాడు చంద్రన్న. చంద్రబాబు రాజకీయ వ్యూహాల సినిమా స్క్రీన్ ప్లేకు సంబంధించినంత వరకూ ఇప్పుడిక ఎన్టీఆర్ మళ్ళీ టిడిపికి దగ్గరైతే చంద్రబాబు వైపు నుంచి కథ సుఖాంతమైనట్టే.
మరి ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చూపిస్తాడు? బాలకృష్ణలా సరిపెట్టుకునే రకమో, లేకపోతే హరికృష్ణలా ఆవేశంగా నాలుగు మాటలు మాట్లాడడం, ఆ తర్వాత సైలెంట్ అయ్యే రకం కూడా కాదు ఎన్టీఆర్. టిడిపిని మళ్ళీ నందమూరి వంశం చేతుల్లోకి తీసుకురావడం కోసం ఎంతదూరమైనా వెళతాడు. చరిత్ర సృష్టించిన నందమూరి తారకరామారావుపైన మనవళ్ళకే కొంచెం ఎక్కువ ప్రేమాభిమానాలు ఉన్నాయోమో అని కొన్ని సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మరి తర్వాత తరంలో ఈ నందమూరి-నారావారి రాజకీయ చిత్రం ఎలా ఉండబోతుందో చూడాలి మరి.