హీరో శివాజీ పవన్ కళ్యాణ్ వాదన తో విభేదిస్తున్నాడా?

హీరో శివాజీ ట్విట్టర్ వేదిక గా బిజెపి ని కడిగేసాడు. విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతుందని విరుచుకుపడ్డాడు. ఆయన చేసిన ట్వీట్ల సమాహారం ఇలా ఉంది –

రోడ్లకు లక్ష కోట్లు ఇచ్చామన్నారు. 67 వేల కోట్లకే లెక్క చెప్పారు. మిగితావి ఎవరికిచ్చారు ? . మీరిచ్చిన దొంగ లెక్కలు, అంకెలు కూడితే 5 లక్షల కోట్లు . స్టీల్ ప్లాంట్ , దుగరాజపట్నం పోర్టు కలిపితే 12 లక్షల కోట్లు దాటతాయి. అసలు కేంద్ర బడ్జెట్ ఎంతో మీ మట్టి బుర్రలకి తెలుసా ? అబద్ధాలు అంకెల్లో చెబితే నిజాలైపోతాయా ? హరిబాబు ఎప్పుడైనా ఆంధ్ర సమస్యలపై 10 నిమిషాలు పార్లమెంటులో మాట్లాడారా ? 27 పేజీల లేఖలో రైల్వే జోన్ మర్చిపోయావేం ? విశాఖ హరిబాబూ ?“.

ఇలా సాగాయి ఆయన ట్వీట్లు. హరిబాబునే కాదు, వెంకయ్య నాయుడు ని కూడా పేరుపెట్టి మరీ తిట్టాడు. ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఛేసిన కొన్ని ట్వీట్లు మాత్రం పవన్ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ ని వ్యతిరేకిస్తున్నట్టు ఉంది.

ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క వాదన తో ప్రజలని తికమక పెడుతుండటం తో, జెపి, ఉండవల్లి తదితరులతో పవన్ కళ్యాణ్ ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసాడు. భారత దేశం లో ఏ రాష్ట్రం లోనూ అవినీతి రహిత పాలన లేదనేది సామాన్యుడి అభిప్రాయం. ఈ లెక్కన, ఈ కమిటీ అధ్యయనం లో బిజెపి ఇవ్వకుండా వదిలేసిన లెక్కలతో పాటు, బిజెపి ఇచ్చిన డబ్బులతో టిడిపి నేతల జేబుల్లోకి వెళ్ళిన లెక్కలు కూడా బయటికి వచ్చే అవకాశముంది. ఈ విషయం లో టిడిపికి మద్దతిస్తూ పవన్ ని శివాజీ భవిష్యత్తు లో విభేదిస్తాడేమో అనిపించేలా శివాజీ ట్వీట్లున్నాయి. ఆయన చేసిన ఈ ట్వీట్లు ఆ అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి:

మనకు విభజన చట్టం ముఖ్యం. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉత్తరాంధ్ర – రాయలసీమ ప్యాకేజ్, ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం, రాజధాని ముఖ్యం. ఇవి వదిలేసి ఈ లెక్కల బొక్కలు వెతకటం ఏమిటి అన్నయ్యా ? నాకో విషయం అర్ధం కావడం లేదు. సెంటర్ ఏపీకి ఏమిచ్చింది, ఏపీ ఇచ్చిందాన్ని ఏం చేసింది, ఇవన్నీ CAG చూసుకుంటుంది.

అంటే కేవలం బిజెపి చేసిన అన్యాయం వరకే మాట్లాడదాం, టిడిపి దుర్వినియోగం చేసిన నిధుల సంగతి ఇప్పుడు మాట్లాడొద్దు అన్నట్టుగా శివాజీ ట్వీట్లున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.