జ‌నం కోరుకునే మార్పు జ‌గ‌న్ లో క‌నిపిస్తోందా..?

వైకాపా అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ఏటికొప్పాక‌లో సాగింది. దీనిపై ఎప్ప‌టిలానే సాక్షి క‌థ‌నం ప్ర‌చురించింది. జ‌గ‌న్ వ‌స్తే త‌ప్ప త‌మ క‌ష్టాలు తీర‌వ‌ని జ‌నం అనుకుంటున్న‌ట్టుగా రాసుకొచ్చారు! జ‌గ‌న‌న్న వ‌స్తే చాలు… బొమ్మ‌ల‌కు ప్రాణం వ‌చ్చేస్తుంద‌య్యా, ఆ ఊరికి కొత్త క‌ళ వ‌చ్చేస్తుంద‌య్యా అంటూ ఏటికొప్పాక ప్ర‌జ‌లంద‌రూ అభిప్రాయ‌ప‌డ్డ‌ట్టు పేర్కొన్నారు. ఇదొక్క‌టే కాదు… జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సంబంధించి ఈ మ‌ధ్య కొన్నాళ్లుగా వ‌స్తున్న క‌థ‌నాల్లో ఈ కోణ‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. జ‌గ‌న్ వస్తే త‌ప్ప తమ జీవితాలు మార‌వ‌నీ, కష్టాలు తీర‌వ‌ని పాద‌యాత్ర‌లో క‌లుస్తున్న జ‌నం వాపోతున్నారంటూ దాదాపుగా రోజూ ఇదే యాంగిల్ ని హైలెట్ చేస్తున్నారు. నిజమే, ప్ర‌తిప‌క్ష నేత త‌మ ముందుకు వ‌స్తే కొంత‌మంది ప్ర‌జ‌లు క‌ష్టాలు చెప్పుకునే అవ‌కాశం ఉంటుంది. పవన్ కల్యాణ్ యాత్రల్లో కూడా ఇలాంటి సన్నివేశాలే కనిపిస్తున్నాయి. దాన్ని ఎవ్వ‌రూ త‌ప్పుబ‌ట్ట‌డం లేదు.

అయితే, ఇక్క‌డ కేవ‌లం ఈ ఒక్క పాయింట్ నే ప‌ట్టుకుని ‘జ‌గ‌న్ వ‌చ్చేస్తున్నారు’ అనే ధీమాతో వైకాపా శ్రేణుల్లో క‌నిపిస్తోంది. కానీ, ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే… ఓటు వెయ్య‌డానికి ముందు జ‌నం ఆలోచ‌నా విధానం ఎలా ఉంటుంద‌నే అంచ‌నా ఇప్ప‌టికీ వైకాపా వేసుకుంటున్న‌ట్టు లేదు! జ‌గ‌న్ వ‌స్తే చాల‌ని కొంత‌మంది ఆ మూమెంట్ లో అంటున్నా… వ‌చ్చాక ఏం చేస్తార‌న్న స్ప‌ష్ట‌త జ‌గ‌న్ ఇస్తేనే, ఆ ప్రభావం ఓటింగ్ వరకూ ఉంటుంది! ‘నేనొస్తే క‌ష్టాలు తీరిపోతాయి’ అని భ‌రోస్తా ఇస్తే స‌రిపోదు. ఆ మార్పును ఎలా తీసుకొస్తార‌నే విజ‌న్ ను ఇంత‌వ‌ర‌కూ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు చెప్ప‌లేక‌పోయారు.

ఆంధ్రాలో 2019లో జ‌ర‌గ‌బోతున్న ఎన్నిక‌ల‌్ని ప్ర‌జ‌లు చూసే కోణం వేరు. కేవలం నాయ‌క‌త్వాల మార్పు అనేది ముఖ్యాంశం కానే కాదు. రాష్ట్ర భ‌విష్య‌త్తు… దాని కోసం ఎవ‌రేం చెయ్య‌గ‌ల‌రు, అన్నిర‌కాలుగా వెన‌క‌బ‌డ్డ రాష్ట్రానికి ఎలాంటి స‌మ‌ర్థ నాయ‌క‌త్వం అవ‌స‌రం అనే కోణంలో ప్ర‌జ‌ల తీర్పు ఉంటుంది. పాద‌యాత్ర ద్వారా ఇంత‌వ‌ర‌కూ జ‌గ‌న్ ఇస్తున్న హామీలుగానీ, చేస్తున్న ప్ర‌సంగాల్లోగానీ రాష్ట్ర విశాల ప్ర‌యోజ‌నాల‌కు జ‌గ‌న్ ఏం చేయ‌గ‌ల‌రూ ఎలా చెయ్య‌గ‌ల‌రూ అనేది క‌నిపించ‌డం లేదు! జనం కోరుకునే మార్పు అభివృద్ధి, దాన్ని తీసుకొచ్చే సామ‌ర్థ్యం జ‌గ‌న్ లో ఉందా అనేది ప్ర‌జ‌లు చూస్తారు. పాద‌యాత్ర‌లో క‌లిసి క‌ష్టాలు చెప్పుకుంటున్న‌వారు కూడా పోలింగ్ బూత్ కి వెళ్లేస‌రికి ఇలానే ఆలోచించే అవ‌కాశాలున్నాయి. కాబ‌ట్టి, ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చేస్తా అనే ఒక చిన్న ట్యాగ్ లైన్ కి క‌ట్టుబ‌డి ఉండ‌కుండా… ఒక స్ప‌ష్ట‌మైన విజ‌న్ ను ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా జ‌గ‌న్ మాట్లాడాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. ఆంధ్రా ప్రజలు కచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్రం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల నుంచీ, గురౌతున్న నిర్లక్ష్యం గురించీ, జరగాల్సిన అభివ్రుద్ధి గురించి. ఈ తేడాని వైకాపా వ్యూహ‌క‌ర్త‌లు అర్థం చేసుకుంటున్నారో లేదో తెలీదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com