భార‌త ర‌త్న స‌రే.. పాఠ్యాంశంగానూ జోడించ‌లేరా బాబూ!

నంద‌మూరి తార‌క రామారావు.. తెలుగు ప్ర‌జ‌లు ఆజ‌న్మాంతం గుర్తుంచుకోద‌గ్గ వ్య‌క్తి. వ్య‌క్తిగ‌తంగా ప్ర‌తి ఒక్క‌రిలోనూ లోపాలుంటాయి. అవి ఎన్టీఆర్‌లోనూ ఉన్నాయి. వాటి గురించి ప‌క్క‌న పెడితే ఆయ‌న‌లో ఎన్నో సుగుణాలున్నాయి. సినీ జీవిత‌మంతా ఒకెత్త‌యితే.. రాజ‌కీయ య‌వ‌నిక‌పై ఆయ‌న వెలుగు ఒకెత్తు. పార్టీ పెట్టిన తొమ్మిది నెల‌ల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘ‌న‌త ఆయ‌నొక్క‌రికే సొంత‌మ‌నీ, ఒక్క క‌లం పోటుతో 30మంది మంత్రుల‌ను తొల‌గించార‌నీ, ప‌టేల్ ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌నూ, శాస‌న మండ‌లినీ చరిత్ర‌లో క‌లిపేశార‌నీ, పేద‌వారికి నాలుగు మెతుకులు పెట్టేందుకు రెండు రూపాయ‌ల‌కే కిలో బియ్యం, ఒంటి నిండా గుడ్డ క‌ట్టేంద‌కు జ‌న‌తా వ‌స్త్రాలు.. ఇలా ఎన్న‌ని చెప్పుకోగ‌లం.. ఇవ‌న్నీ ఆయ‌న చేసిన మేళ్ళే. అంత‌కు మించి, ఆయ‌నో మేరున‌గధీరుడు. ఆత్మాభిమానం నిలువెల్లా పాదుకుపోయిన విగ్ర‌హం.

ఇప్పుడివ‌న్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వ‌చ్చిందంటే.. ప‌క్క రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో న‌టుడు దివంగ‌త రాజ్‌కుమార్ జీవిత చ‌రిత్ర‌ను పాఠ‌శాల విద్య‌లో పాఠంగా ప్ర‌వేశ పెట్టారు. ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరుపేజీల‌లో రాజ్‌కుమార్ జీవిత సంగ్రహాన్ని క‌న్న‌డ విద్యార్థుల‌కు అందించారు. మ‌రి మ‌న ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ఏమైంది. 1995 ఆగ‌స్టులో ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించిన అనంత‌రం ఆయ‌న పేరుమీద స‌త్కార్యాలైతే జ‌రుగుతున్నాయి కానీ, ఆయ‌న పేరును నిల‌బెట్టే ప్ర‌యత్నాలు మాత్రం సాగ‌టం లేదు. ల‌క్ష్మీపార్వ‌తిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్న ద‌గ్గ‌ర్నుంచి మొద‌లైన కుత‌కుత‌లు ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్చుతుణ్ణి చేసిన అనంత‌రం స‌ద్దుకున్నాయి.

త‌దుప‌రి తెలుగు దేశం పార్టీ మ‌హానాడు నిర్వ‌హించిన ప్ర‌తిసారి ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని తీర్మానించ‌డాన్ని అల‌వాటుగా చేసుకున్నారు త‌ప్ప ఆ తీర్మానాన్ని అటు టీడీపీ కానీ, ఇటు ఆయ‌న కుటుంబం కానీ కేంద్రం మ‌న్నించేలా ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. కార‌ణం భార‌త రత్న ప్ర‌క‌టిస్తే ఆ పుర‌స్కారాన్ని ఎవ‌రందుకోవాల‌నే శంక‌. నిజానికి ఆ అవ‌కాశం ఎన్టీఆర్ భార్య కాబ‌ట్టి ల‌క్ష్మీపార్వ‌తికే ఉంటుంది. స‌హ‌జంగానే ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల‌కు ముఖ్యంగా చంద్ర‌బాబుకూ, మ‌రి కొంద‌రికీ ఇదెంత‌మాత్రం రుచించ‌ని అంశం. ఎన్టీఆర్ భార‌త రత్న‌కు అర్హుడా కాదా అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే కేవ‌లం ఈ కార‌ణంగానే ఆ అవార్డు ద‌క్క‌డం లేదు. భార‌త ర‌త్న రాక‌పోనీ, క‌నీసం ఆయ‌న జీవిత చ‌రిత్ర‌ను ఓ పాఠ్యాంశంగా చేర్చచ్చు క‌దా. ఓ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వియ్యంకుడూ, ఎన్టీఆర్ ఆఖ‌రు త‌న‌యుడూ అయిన బాల‌కృష్ణ ఇదే విష‌య‌మై విజ్ఞ‌ప్తి చేశారు. ఇంత‌వ‌ర‌కూ అదీ నెర‌వేర‌లేదు. భారత ర‌త్న పుర‌స్కారం కేంద్రం చేతిలో ఉంద‌ని త‌ప్పించుకోవ‌చ్చు.. పాఠ్యాంశంగా చేర్చే అవ‌కాశమూ, అధికార‌మూ టీడీపీ ప్ర‌భుత్వానికి ఉన్నాయి క‌దా.. చేరుస్తామంటే కాద‌నేదెవ‌రు? ఎందుకు తాత్సారం చేస్తున్నారు. రాజ‌కీయ జీవితాన్ని ప‌క్క‌న పెడితే ఓ మహాన‌టుడిగా ఎన్టీఆర్‌ను ఈ త‌రాల‌కు ప‌రిచ‌యం చేయ‌వ‌చ్చు క‌దా. ఎందుకు నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు. ఈ ప్ర‌శ్న‌కూ ప్ర‌స్తుతం స‌మాధానం చిక్క‌డం లేదు.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.