ఆంధ్రాపై కాంగ్రెస్ చిత్త‌శుద్ధి ఇంతేనా..!

కేంద్రాన్ని ఆంధ్రా డిమాండ్ చేస్తున్న అంశాల‌కు కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఆ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. స్పెష‌ల్ స్టేట‌స్‌, పోల‌వ‌రం ప్రాజెక్టు వంటివి త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని డిమాండ్ చేశారు. న్యాయం కోసం అన్ని పార్టీలూ క‌లిసిక‌ట్టుగా క‌ద‌లాల్సిన స‌మ‌యం ఇది అంటూ పిలుపునిచ్చారు. అంతే, ఏపీ కోసం ఈ మాత్రం స‌రిపోతుంది క‌దా! నాలుగు వాక్యాల ట్వీట్ చేశారు.. ఇంకేం కావాలి? ఓకే, ఆంధ్రా పోరాటంపై మ‌న‌మూ స్పందించేశామ‌న్న‌ట్టుగా ఉంది రాహుల్ వైఖ‌రి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాధ్య‌త ఇంతేనా..? అన్ని పార్టీలూ క‌లిసి పోరాడాల‌ని పిలుపునిచ్చారేగానీ, క‌లిసేందుకు కావాల్సిన చొర‌వ ఎవ‌రు తీసుకోవాలి..? ఆంధ్రాలో అనూహ్యంగా మ‌ద్ద‌తు పెరిగిపోతోందంటూ ఈ మ‌ధ్య ఊద‌ర‌గొట్టిన కాంగ్రెస్ నేత‌లు ఏమ‌య్యారు..? ఆంధ్రా ప్ర‌యోజ‌నాల గురించి ఏపీలో ఇంత ర‌చ్చ జ‌రుగుతుంటే ఏపీ ఎంపీలు ఎక్క‌డున్నారు..? ఏం చేస్తున్నారు..?

పార్ల‌మెంటులో ఏపీ విష‌య‌మై ఇంత గంద‌ర‌గోళం జ‌రుగుతుంటే… ఒక్క ట్వీట్ పెట్టేసి, వేరే ప‌నిలో రాహుల్‌ నిమ‌గ్న‌మైపోయారు. సీబీఐ జ‌డ్జి జ‌స్టిస్ లోయ హ‌త్య‌కేసుపై అనుమానాలు ఉన్నాయ‌నీ, నిజాలు తేల్చాల్సిందే అంటూ కాంగ్రెస్ నేత‌లు తీవ్ర స్వ‌రం వినిపించారు. దీనిపై సిట్ ఏర్పాటు చేసి, విచార‌ణ జ‌రిపించాలంటూ విప‌క్షాల‌కు చెందిన 114 మంది ఎంపీల‌తో సంత‌కాలు తీసుకుని, రాష్ట్రప‌తిని క‌లిసి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. లోయా హ‌త్య కేసును త‌క్కువ చేయాల‌న్న‌ది ఇక్క‌డి ఉద్దేశం కాదు. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌చ్చేస‌రికి ఇంత చొరవ కాంగ్రెస్ ఎందుకు తీసుకోవ‌డం లేద‌నేదే ప్ర‌శ్న‌..? ఒక హ‌త్య కేసు విష‌య‌మై అంద‌ర్నీ క‌లుపుకుని రాష్ట్రప‌తి వ‌ర‌కూ వెళ్లేంత ప్ర‌యాస‌ప‌డ్డ రాహుల్ గాంధీ… ఒక రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌చ్చేస‌రికి ఒక్క ట్వీట్ తో స‌రిపెట్టేస్తే ఏమ‌ని అర్థం చేసుకోవాలి..?

ఇంత‌కీ, మ‌న రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల చిత్త‌శుద్ధి ఏదీ..? ప‌్ల‌కార్డు ప‌ట్టుకుని నిల‌బ‌డితే చాలు… నిర‌స‌న అయిపోతుంద‌ని ఒక కాంగ్రెస్ ఎంపీ అనుకుంటారు. మ‌రొక‌రు, ఏ అమావాస్య‌కో పున్నానికో స‌భ‌లో క‌నిపిస్తే చాలు… త‌న హాజ‌రీయే పోరాటం అనుకుంటారు. ఇంకో ఎంపీ… ఆయ‌న‌ కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌న‌న్న ధ్యాసే లేదు! ఇలాంటి స‌మ‌యంలో కూడా సినిమాల్ని ప‌క్క‌నపెట్టి, అనుభ‌విస్తున్న ప‌ద‌వికి న్యాయం చేయాల‌న్న క‌నీస బాధ్య‌త ఆయ‌న‌కీ లేదు. నిజానికి, విభ‌జ‌న ద్వారా ఆంధ్రాలో భూస్థాపిత‌మైన కాంగ్రెస్ పార్టీని ఉద్ధ‌రించుకునేందుకు అవ‌కాశం ఉన్న సంద‌ర్భం. ఆంధ్రా గురించి కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీలో స్వ‌రం పెంచితే.. ఆంధ్రా ప్ర‌జ‌ల్లో కొంతైనా మార్పు వ‌చ్చేదేమో..! అడ్డగోలుగా విభ‌జ‌న చేస్తే చేశారు.. ఇప్పుడు మ‌న త‌ర‌ఫున మాట్లాడుతున్నారు అనే భావ‌న క‌లిగేదేమో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.