ఎడిటర్స్ కామెంట్ : టీమ్ ఇండియా స్ఫూర్తి ఇదేనా..!?

#పాకిస్థాన్ దేశంపైకి యుద్ధానికి వస్తే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు ఆయుధాలు కొనుక్కోమంటారా..?.. అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ .. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యక్తం చేసిన ఆవేదన.
#కేంద్రం అన్యాయం చేస్తోంది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది..!.. ఇదీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన ఉత్తరం.
#వ్యాక్సిన్లపై అందరం కలిసి ఒకే వాయిస్ వినిపించింది. కేంద్రంతో ఘర్షణ పడాల్సిన పరిస్థితి వస్తోంది..! ఇది ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ..!
#దేశ ప్రజల్లో కొంత మందికి ఉచితంగా ఇచ్చి.. మరికొంత మంది కొనుక్కోమని చెబుతారా..? ఇదేమి విధానం..? .. ఇది సుప్రీంకోర్టు స్పందన..!
ఇవన్నీ టీకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి వల్ల వ్యక్తమైన అభిప్రాయాల్లో కొన్ని. సాధారణ ప్రజలు వెల్లడిస్తున్న అభిప్రాయాలు చెబితే.. ప్రభుత్వ మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు ఉన్నత స్థాయిలో.. ప్రజలను ప్రభావితం చేయగల నిర్ణయాలు తీసుకునే వ్యవస్థల అభిప్రాయాలు మాత్రమే చెప్పాం. ఆ వ్యవస్థలే.. కేంద్ర ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నాయి. దేశం అంతా ఒక్కటి కాదా… టీమ్ ఇండియా కాదా అని… ఆ వ్యవస్థలు సూటిగానే ప్రశ్నిస్తున్నాయి.

దారి తప్పిన “టీమ్ ఇండియా” కెప్టెన్ ..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ప్రధానమంత్రి కాగానే… రాష్ట్రాలను ఉద్దేశించి మనది టీమ్ ఇండియా… కేంద్రం కెప్టెన్ మాత్రమే.. మీరంతా అటగాళ్లు.. మీరు అభివృద్ధి చెందితేనే ఇండియా అభివృద్ధి చెందినట్లు అని చెప్పుకొచ్చారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం అనేది మిథ్య. చాలా పరిమిత అధికారాలు ఉంటాయి. రాష్ట్రాలన్నింటిలోనూ ప్రజా ప్రభుత్వాలు ఉంటాయి. వాటికే ఎక్కువ అధికారాలు ఉంటాయి. కానీ.. మోడీ ప్రధాని అయిన తర్వాత .. రాష్ట్రాల అధికారాలను లాగేసుకునే క్రమంలో… అన్ని విధానాలు ఢిల్లీకి చేరుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా మహమ్మారిగా మారిన కరోనా విషయంలోనూ కేంద్రమే అన్నీ చేతుల్లోకి తీసుకుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది.. మొదటి దశలో లాక్ డౌన్‌ను కూడా కేంద్రమే ప్రకటించింది. కానీ రెండో దశకు వచ్చే సరికి.. లాక్ డౌన్ నిర్ణయాలను రాష్ట్రాలకు వదిలేసింది. కానీ కరోనాకట్టడికి అవసరమైన మందులు.. వ్యాక్సిన్లు.. చివరికి ఆక్సిజన్‌ను కూడా.. తన పరిధిలోకి తెచ్చుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కావాల్సినన్ని పారించింది. ఇతర రాష్ట్రాలను ఎండబెట్టింది. కేంద్ర ప్రభుత్వం టీకాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు.. సమానత్వాన్ని హరించేలా ఉంది. టీకాలు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు… డోసు రూ.150 కే కేంద్రానికి ఇస్తున్నాయి. కానీ రాష్ట్రాలకు రూ. 300 నుంచి రూ. 600 వరకు… ప్రజలకు ఇంకా ఎక్కువగానే అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇది సమానత్వాన్ని హామీ ఇస్తున్న రాజ్యాంగం 14వ అధికరణకు బద్ధ వ్యతిరేకమని సుప్రీంకోర్టు కేంద్రానికి నేరుగానేగుర్తు చేసింది.

వ్యాక్సిన్లు ఇవ్వరు .. కొనుక్కునే చాన్స్ కూడా ఇవ్వరా..?

ప్రస్తుత కేంద్ర వ్యాక్సిన్ విధానం ప్రకారం దేశ ప్రజల్లోని 45 ఏళ్లు, ఆ పైబడిన వయసులోని వారికి కేంద్రం టీకాలు సరఫరా చేస్తున్నది. 18-44 వయసువారికి రాష్ట్రాలే కంపెనీల వద్ద కొనుగోలు చేసి టీకాలు వేయాలి. 18- 44 వయసు వారు 60 కోట్ల వరకు ఉంటారు. అంటే అత్యధిక శాతం జనాభాకు వ్యాక్సిన్ వేయించే బాధ్యతను రాష్ట్రాల మీదకు నెట్టివేసి కేంద్రం చేతులు దులుపుకున్నదన్న మాట. రాష్ట్రాలు ఏ తిప్పలో పడి వ్యాక్సిన్లను అధిక ధరకు కొనడానికి సిద్ధపడినా అమ్మేందుకు టీకా కంపెనీలు ముందుకు రావడం లేదు. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం. సమాఖ్యస్ఫూర్తిని ఇది మంట గలుపుతోంది. అటు కేంద్రం ఇవ్వదు.. ఇటు కొనుక్కోనివ్వదన్నట్లుగా పరిస్థితి మారింది. ఇది సమాఖ్య స్ఫూర్తిని మరింత హననం చేస్తోంది. దేశంలో రాష్ట్రాల అధికారాలను గండికొట్టి… కేంద్రమే పూర్తిగా అధికారాన్ని గుప్పిట పెట్టుకునే చర్యలను.. మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడే ప్రారంభించారని స్పష్టమయింది. రాష్ట్రాల ఆదాయ వనరులను పరిమితం చేసి.. కేంద్రంపై ఆధారపడేలా చేయడానికే కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఏ మాత్రం నిధుల కేటాయింపు అధికారం లేని నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసినప్పుడే మొదటి బీజం పడింది. ఒకే దేశం- ఒకే సారి ఎన్నికలు, ఒకే మార్కెట్, ఒకే విధమైన చట్టాలు, చివరకు ఒకే పార్టీ, ఒకే వ్యక్తి పాలన అన్నట్లుగా పాలనా వ్యూహం సాగుతోంది. రాష్ట్రాల్లో నేతలు నోరెత్తకుండా తమ అదుపులో పెట్టుకునేందుకు సామ దాన దండోపాయాలను ప్రయోగించారు.

అధికారం అంతా కేంద్రానిది..రాష్ట్రాలకు బాధ్యతలా..?

రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశాలపై కూడా రాష్ట్రాల్ని ఏ మాత్రం సంప్రదించకుండా చట్టాలు చేసేందుకు బిజెపి సర్కార్ వెనుకాడడం లేదు. ఇటీవల 0నులపై రాష్ట్రాలకున్న హక్కుల్ని కేంద్రం స్వాధీనం చేసుకుంటూ బిల్లును ఆమోదించింది. ఒక్కరూ నోరు మెదపలేకపోయారు. కొన్ని పార్టీలు.. ఇలా చేయడం రాజ్యాంగ హక్కులకు సంబంధించింది… కనీసం దీన్ని సెలెక్ట్ కమిటీకి నివేదించంమని డిమాండ్ చేసినా వారి వాయిస్ ఎక్కడా వినిపించలేదు. చివరికి రాష్ట్రాల హక్కులను హరించడానికి కేంద్రం ఎంతగా దిగజారుతోందంటే… ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం పనిచేసేందుకు కొంత స్వేచ్చ కల్పించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలు అప్పజెబుతూ బిల్లును ఆమోదింపచేసింది. ఇప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం అంటే… ప్రజలుఎన్నుకున్న ప్రభుత్వం కాదు… లెఫ్టినెంట్ గవర్నరే అక్కడ ప్రభుత్వం. మోడీ మరోసారి ప్రధానిగా గెలిస్తే… ఆ చట్టాన్ని రాష్ట్రాలకు అన్వయించరన్న గ్యారంటీ ఏమీ లేదు. అదే అనుమానాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తం చేశారు. కానీ వారు బిల్లుకు ఆమోదం తెలిపారు.. వారి అనివార్యత వారిది.. అలా బీజేపీ అందరికీ భయం కల్పించింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్వచించిన జస్టిస్ సర్కారియా, జస్టిస్ ఎంఎం పూంఛీ సిఫారసుల గురించి ఇవాళ ఎవరూ మాట్లాడడం లేదు. అంతర్ రాష్ట్ర మండలి అనేది అర్థరహితంగా మారింది కేంద్ర రాష్ట్ర వివాదాలను పరిష్కరించే స్వతంత్ర సంస్థ అంటూ లేకుండా పోయింది. చివరికి పైనాన్స్ కమిషన్ ఇచ్చిన గ్రాంట్లను కూడా కేంద్రం ఏదో దానం చేస్తున్నట్లుగా భావిస్తోంది.

సీఎంగా మోడీ చెప్పిన మాటలకు ప్రధానిగా చేస్తున్న పనులకు పొంతనేది..?

ప్రస్తుతం … ప్రజల ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి సమాఖ్య స్ఫూర్తిని అంతం చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నప్రధాని మోడీ… గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. నాటి కేంద్రం ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ నేతృత్వంలోని యూపీీ ప్రభుత్వం మన సమాఖ్య స్ఫూర్తి మూలాల్నే దెబ్బతీస్తోందని 2012లో అంబేడ్కర్ 121వ జయంతి సందర్భంగా విమర్శలు చేశారు. అప్పటికే ఆయన బీజేపీలో ప్రముఖ నేతగా ఎదగడంతో ఆయనమాటలకు విశేష ప్రాధాన్యం లభించింది. కేంద్రం కీలక అంశాలపై రాష్ట్రాలతో చర్చించడంలేదని ఆయన మరో సందర్భంలో ఆరోపించారు. యూపీఏ సర్కార్ సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందన్న ఆవేదనతో ఆయన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కూడా మంతనాలు సాగించారు. ఢిల్లీ సుల్తానులు దేశ సమాఖ్య స్వభావానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని పదే పదే ఆరోపించారు. చివరికి ఆ సుల్తానుల జాబితాలోకి ఆయనే చేరారు. సమాఖ్య స్ఫూర్తిని హరిస్తున్నారు. ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నామని.. అభిప్రాయం తీసుకుంటున్నామని చెబుతున్నారు కానీ.. ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశమే రాదని.. ఇప్పటికే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రధాని మోడీ చెప్పినట్లుగా ఇండియా… టీమ్ ఇండియానే. రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అన్ని రాష్ట్రాల్లో ప్రజలు అభివృద్ధి చెందితేనే… దేశం అభివృద్ధి చెందుతుంది. బీజేపీకి ఓట్లేసిన వారు మాత్రమే భారతీయులు.. మిగతా వారు కాదన్నట్లుగా విభజించిపాలించడం సమాఖ్య స్ఫూర్తి కాదు.. దేశాన్ని విభజించే పాలన అవుతుంది. ఇప్పటికైనా కేంద్రం.. టీమిండియా గొప్పతనంలో రాష్ట్రాల పాత్రను గుర్తించి… మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారో.. అంతా మా ఇష్టం అన్నట్లుగా ముందుకు పోయి ప్రజల్ని బలి తీసుకుంటారో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close