దాసరి జైరమేష్ వైసీపీలో చేరడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందా..?

దాసరి జైరమేష్ అనే పారిశ్రామికవేత్త… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని బయటకు తెలిసిన తర్వాత… మీడియా వర్గాల్లో కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. దాదాపుగా ఆయన ఇరవై ఏళ్ల నుంచి రాజకీయాల్లో లేరు. 1998లో టీడీపీ తరపున విజయవాడ లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ 1999లో అవకాశం కోసం చూసినా.. చంద్రబాబు చాన్సివ్వలేదు. అప్పట్నుంచి ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నారు. అప్పట్లో ఏపీ ప్రభుత్వానికి చెందిన ట్రాన్స్‌ఫార్మర్ల కాంట్రాక్టులన్నీ ఆయనకే వెళ్తాయని చెప్పుకునేవారు. అలా ఆర్థికంగా.. స్థిరపడిపోయిన ఆయన… ఆ తర్వాత రాజకీయాలను లైట్ తీసుకున్నారు. హఠాత్తుగా ఇరవై ఏళ్ల తర్వాత.. జగన్‌లో విలువలు నచ్చాయంటూ తెర ముందుకు వచ్చారు. వైసీపీలో చేరి విజయవాడ లోక్‌సభకు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

హఠాత్తుగా.. దాసరి జైరమేష్.. తెర ముందుకు ఎందుకు వచ్చారనే అంశంపై.. టీడీపీ నేతలు ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఆస్తులు, వ్యాపారాలు ఉన్న టీడీపీ నేతల్ని.. టీఆర్ఎస్ నేతలు.. టార్గెట్ చేసి మరీ… వివిధ రకాల బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేసి.. వైసీపీలో చేర్పిస్తున్నారనేది.. అందులో మొదటి అంశం. దాసరి జైరమేష్.. వ్యాపారాలు, పరిశ్రమలు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. ఆయనకు ఇప్పుడు ఆంధ్రప్రభుత్వం అండ కన్నా… తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చాలా అవసరం. ఈ కోణంలోనే.. దాసరి జైరమేష్‌ను… వైసీపీలో చేరేలా.. ప్రొత్సహిస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయం కాదనడానికి కూడా.. కారణాలేమీ లేవని చెబుతున్నారు. దాసరి జైరమేష్ సోదరుడు.. బాలవర్ధనరావు గత ఎన్నికలకు ముందు వరకూ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండేవారు.

వైసీపీలో చేరిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి వ్యవహారంలో కూడా.. కేటీఆర్ పేరు బయటకు వచ్చింది. స్వయంగా వైసీపీ నేతలతో.. వారు మాట్లాడి.. మేడాకు.. వైసీపీలో టిక్కెట్ ఖరారు చేసి.. చేర్పించారనేది.. రాజకీయ వర్గాల్లో అందరికీ తలిసిన నిజం. మేడా సోదరులు.. తెలంగాణ ప్రభుత్వం వద్ద పెద్ద ఎత్తున కాంట్రాక్టులు చేస్తున్నారు. ఈ ఒక్క బంధమే.. వారిని వైసీపీ వైపు మళ్లించేలా చేసింది. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్న కొంత మంది టీడీపీ నేతల్ని… టీఆర్‌ఎస్ వైపు నుంచి దువ్వడం ప్రారంభించారని.. త్వరలోనే.. మరికొన్ని చేరికలు ఆ కోటాలో ఉండవచ్చన్న చర్చలు జోరుగానే సాగుతున్నాయి. మొత్తానికి జగన్… పెద్దగా ఏమీ చేయకపోయినా.. ఆయనను.. గెలిపించేందుకు ఓ వైపు నుంచి టీఆర్ఎస్.. మరో వైపు నుంచి బీజేపీ.. తెగ ప్రయత్నం చేస్తున్నాయి. లక్ అంటే అదేనేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com