రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్ని బ‌హిష్క‌రిస్తారా..?

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల విష‌యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాస్త త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. ఎందుకంటే, ఇటీవ‌లే ఆ పార్టీకి చెందిన ఇద్ద‌రు స‌భ్యుల‌పై అసెంబ్లీ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. ఈనెల 12న స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం సంద‌ర్భంగా కాంగ్రెస్ స‌భ్యులు వీరంగం సృష్టించారు. మండ‌లి ఛైర్మ‌న్ స్వామి గౌడ్ పై హెడ్ ఫోన్స్ తో దాడి, అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, సంప‌త్ కుమార్ ల స‌భ్యత్వాల‌ను స్పీక‌ర్ ర‌ద్దు చేశారు. ఈ నిర్ణ‌యాన్ని భార‌త ఎన్నిక‌ల సంఘానికి కూడా నివేదించారు. అయితే, స‌భ్య‌త్వాలు ర‌ద్దు చెల్ల‌దంటూ ఈ ఇద్దరు నేతలూ కోర్టును ఆశ్ర‌యించారు.

అదే రోజున రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్లు కూడా దాఖ‌ల‌య్యాయి. పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థిని బ‌ల‌ప‌రుస్తూ దాఖ‌లైన ప‌త్రాల్లో ఈ ఇద్ద‌రూ సంత‌కాలు చేశారు. ఇప్పుడు స‌మ‌స్య ఏంటంటే… స‌భ్య‌త్వాలు ర‌ద్దు అయిన ఈ ఇద్ద‌ర్నీ ఓటింగ్ కి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలా వ‌ద్దా అనేది సందిగ్ధంలో ప‌డింది. ఈ ఇద్ద‌రు స‌భ్యుల‌కూ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కు క‌ల్పించాలా వ‌ద్దా అనే అంశంపై ఈసీఐతోపాటు రాష్ట్ర ఎన్నిక‌ల అధికారికి రాజ్య‌స‌భ ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి లేఖ రాశారు. ఇంత‌వ‌ర‌కూ ఈ లేఖ‌పై ఎలాంటి స్పంద‌నా రాక‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. నిజానికి, తెలంగాణ‌లో రాజ్య‌స‌భ సీట్లు మూడు మాత్ర‌మే ఉన్నాయి. అయితే, త‌మ‌కు బ‌లం లేక‌పోయినా కేవ‌లం జంప్ జిలానీల‌ను ఇబ్బంది పెట్టాల‌నే ఉద్దేశంతో కాంగ్రెస్ కూడా నామినేష‌న్ వేయించింది.

కోమ‌టిరెడ్డి, సంప‌త్ ల స‌భ్య‌త్వాల ర‌ద్దుపై కోర్టు స్టే ఇస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఆ పార్టీ ఉంది. ఒక‌వేళ స్టే ఇవ్వ‌క‌పోతే ఈ అంశాన్ని కూడా కేసీఆర్ స‌ర్కారుపై రాజ‌కీయ పోరాటాస్త్రంగా మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు స‌మాచారం. కోర్టు తీర్పును బ‌ట్టీ త‌మ నిర్ణ‌యం ఉంటుంద‌ని నేత‌లు అంటున్నారు. ఒక‌వేళ స‌భ్య‌త్వాల ర‌ద్దుపై త‌మ‌కు అనుకూల‌మైన నిర్ణ‌యం రాక‌పోతే… ఎన్నిక‌ల్ని బ‌హిష్క‌రిద్దామ‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నిక‌ల్ని బ‌హిష్క‌రిస్తే, ఇదే అంశాన్ని ప్ర‌ధానాస్త్రంగా మార్చుకుని కేసీఆర్ ను ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌ట్టే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఎలాగూ యాత్ర‌ల పేరుతో కాంగ్రెస్ ప్రజ‌ల్లోనే ఉంది కాబ‌ట్టి, ఇప్పుడు ఈ అంశాన్ని కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తేనే పార్టీకి ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని భావిస్తోంది. ఏం చేసినా తెరాస‌పై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే కాంగ్రెస్ నేత‌ల ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.