క‌రేబియ‌న్లు.. రేసులోకి వ‌చ్చారా?

క్రికెట్ ప్రేమికులు ఇప్ప‌టికీ వెస్టిండీస్ జ‌ట్టుని అభిమానిస్తుంటారు. ఎందుకంటే…ఒక‌ప్పుడు ఆ జట్టు నమోదు చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. వెస్టిండీస్‌ బౌలర్లు జెట్ స్పీడ్ తో బంతులు వేస్తుంటే.. క్రీజ్ లో నిలదొక్కుకోవడానికి మేటి బ్యాట్స్ మెన్ కు సైతం చమటలు పట్టేసేవి. ఆ గ‌డ్డ‌పై అడుగుపెడితే.. విజ‌యం కోసం అల్లాడిపోయేవాళ్లు. ప్ర‌పంచం మొత్తం ఊపేసే ఆసీస్‌కీ అక్క‌డ చుక్క‌లు క‌నిపించేవి. అది కరీబియన్‌ క్రికెట్ చరిత్రలో స్వర్ణయుగం. బ్రెయిన్ లారా టైమ్స్ లో కూడా వెస్టిండీస్‌ అతివీర భయంకరమైన జట్టే. అయితే తర్వాత కాలంలో జట్టు నీరుగారిపోయింది. బలమైన బోర్డ్ లేకపోవడం, ఏవో ఆర్ధిక సమస్యలు, జట్టులో సమన్వయ లోపం.. ఇలా వెస్టిండీస్‌ జట్టు వీక్ గా కనిపించింది. కనిపిస్తుంది కూడా. ఈమ‌ద్య వెస్టిండీస్ ప్ర‌ద‌ర్శ‌న ప‌సికూన‌ల కంటే దారుణంగా త‌యారైపోయింది. చిన్న జ‌ట్ల చేతిలోనూ ఘోరంగా ఓడిపోవ‌డం మొద‌లెట్టింది. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి క‌నీసం అర్హ‌త కూడా సాధించ‌లేక‌పోయింది. వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్‌లో క‌రీబియ‌న్ జ‌ట్టు క‌నిపించ‌డం కూడా ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌క‌మే. అయితే… భార‌త క్రికెట్ జ‌ట్టు ప‌ర్య‌ట‌న ఆ జ‌ట్టుకి టానిక్‌లా ప‌నిచేసింది. ఓ వ‌న్డేలో గెలిచి, ఏకైక టీ ట్వంటీ మ్యాచ్‌ని కైవ‌సం చేసుకోవ‌డం క‌రేబియ‌న్ క్రికెట్ జ‌ట్టులో, ఆ దేశ‌పు క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నింపేదే.

వెస్టిండీస్ ఓడుతూ వ‌స్తున్నా.. ”ప్రమాదకరమైన జట్టు” అనే ట్యాగ్ లైన్ ను మాత్రం నెలబెట్టుకునే ఉంటుంది. గత టీట్వంటీ వరల్డ్ కప్ దీనికి మంచి ఉదాహరణ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ జట్టు ఏకంగా టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ‘ మాకు మా బోర్డ్ యునిఫామ్ కూడా ఇవ్వలేదు” అని మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టన్ వ్యాఖ్యానిస్తే.. రోమాలు నిక్కబొడిచాయి. ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు, ఆధునూతన సౌకర్యాలు, కోట్లు సంపాదించే ప్లేయర్స్.. ఇలా చెప్పుకోవడం కాదు. ఆట కదా ముఖ్యం అనిపించింది. నిజమే.. కరీబియన్‌ అంటే సంచలనమే.

నిన్న‌టి టీ ట్వంటీలో వెస్టీండీస్ గెలుపు కూడా ఓ సంచ‌ల‌న‌మే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 190 పరుగులు చేసింది. భారీ స్కోర్ చేశాం అనే ధీమాలో ఫీల్డింగ్ లోకి దిగారు టీమిండియా ఆటగాళ్ళు. అయితే ఈ భారీ స్కోర్ కరేబియన్ జట్టు ముందు చిన్నబోయింది. ఒకే ఒక్కడు.. ఈ భారీ స్కోర్ ను ఉప్ అని ఊదిపారేశాడు. పేరు ఎవిన్ లూయిస్.. విండీస్ ఓపెనర్ గా వచ్చిన లూయిస్.. చుక్కలు చూపించాడు. కేవలం 62 బంతుల్లో 125 పరుగులు బాదేశాడు. లూయిస్ బాదుడికి టీమిండియా కు పట్టపగలే చుక్కలు కనిపించాయి. బౌలర్లకు దిక్కు తోచలేదు. లూయిస్ బాదుడును బిక్కు బిక్కు మని చూడటం తప్పితే ఏమీ చేయలేని పరిస్థితి. లూయిస్ దెబ్బకు ఇంకా తొమ్మది బంతులు మిగిలివుండగానే టార్గెట్ ఫినిష్ చేసింది విండీస్. కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఇంత భారీ లక్ష్యాన్ని చేధించేసింది.

ముందే చెప్పుకున్నాం కదా.. విండీస్ ప్రమాదకరమైన జట్టు అని. తమదైన రోజు మమ్మల్ని ఎవరూ ఆపలేరని మరోసారి నిరూపించింది విండీస్. ఈ విజ‌యం వెస్టిండీస్‌కి ఓ టానిక్‌లా ప‌నిచేయాలి. బోర్డు గొడ‌వ‌లు, ఆట‌గాళ్ల వాకౌట్ల‌తో క‌ళ త‌ప్పిన క‌రేబియ‌న్లు… ఇక‌నైనా మేల్కోవాలి. ఆట‌గాళ్ల హ‌క్కులు, బోర్డు ఆధిప‌త్యం కంటే దేశ ప్ర‌తిష్ట మిన్న అనే విష‌యాన్ని గ్ర‌హించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఆ దిశగా బోర్డు, ఆట‌గాళ్లు అడుగులు వేస్తే… త‌ప్ప‌కుండా ఒక‌ప్ప‌టి వెస్టిండీస్ ని చూసే అవ‌కాశం ద‌క్కుతుంది. ఆ దేశ క్రికెట్ జ‌ట్టుకే కాదు..
ప్ర‌పంచ క్రికెట్‌కి అది అవ‌స‌రం కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.