సీనియర్ల చేరిక‌తో జ‌గ‌న్ కు కొత్త స‌మ‌స్య‌లా..?

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ ఏపీ ప్ర‌ధాన పార్టీల్లో హ‌డావుడి పెరిగింది. మ‌రోసారి వ‌ల‌స‌ల బాట ప‌ట్టేందుకు అధికార‌, ప్ర‌తిప‌క్షాలు సిద్ధ‌మౌతున్నాయి. ఈ క్ర‌మంలో వైకాపా అధినేత జ‌గ‌న్ కూడా ప‌లువురు ప్ర‌ముఖ నేత‌ల్ని పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధ‌మౌతున్నారట. నేతల చేరికల విషయంలో గ‌త ఎన్నిక స‌మ‌యంలో జ‌రిగిన పొర‌పాట్ల‌ను పునరావృతం చేయ‌కూడ‌ద‌ని భావిస్తున్నారని సమాచారం. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైకాపాలో చేరేందుకు కొంత‌మంది సీనియ‌ర్ నేత‌లు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చినా జ‌గ‌న్ కాద‌న్నారు! ఫ‌లితంగా, జ‌గ‌న్ పై అల‌క‌బూనిన కొంత‌మంది ఆయ‌న‌కి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేశారు. కొంతమంది టీడీపీలోకి వెళ్లిన పరిస్థితీ చూశాం. అలాంటి ప‌రిస్థితి రానీయ‌కుండా ఇప్పట్నుంచే జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి త్వ‌ర‌లో వైకాపాలో చేర‌డం ఖాయ‌మ‌నే ప‌రిస్థితి ఉంది. దీంతో నెల్లూరు జిల్లాలో ఆయ‌న కీల‌కపాత్ర పోషిస్తార‌ని వైకాపా వ‌ర్గాలు అంటున్నారు. కానీ, ఇక్క‌డే స‌మ‌స్య మొద‌లైంది. ఆయ‌నకి పార్టీలో కీల‌కపాత్ర ఇస్తే… సీనియ‌ర్ నేత మేక‌పాటి ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న మొద‌లౌతుంది..? ఇప్ప‌టికే ఆయ‌న వ‌ర్గం ఆనం రాకపై కాస్త గుర్రుగానే ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే, ఇదే అంశమై జ‌గ‌న్ దృష్టి సారించార‌నీ తెలుస్తోంది. టీడీపీ నుంచి ఎంపీ అవంతి శ్రీ‌నివాస‌రావు కూడా వైకాపాలోకి వ‌స్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. అది ఎంతవరకూ నిజమో తెలీదుగానీ… అదే జరిగితే స్థానికంగా అక్కడా ఇలాంటి సమస్యే తప్పేలా లేదు. ఇక‌, ప్ర‌స్తుతం పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ త్వ‌ర‌లోనే మ‌రికొంత‌మంది సీనియ‌ర్ నేత‌లు, త‌టస్థంగా ఉంటున్న నాయ‌కుల‌ను చేర్చుకునే కార్య‌క్ర‌మం మొద‌లుపెడ‌తార‌నీ వైకాపా వ‌ర్గాలు అంటున్నాయి.

వైకాపాలోకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్న‌వారందరినీ చేర్చుకుంటూ పోతే… ఆయా నియోజ‌క వ‌ర్గాల్లో ఉన్న నేత‌ల ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న మొద‌లౌతుంది. ఇప్ప‌టికే నెల్లూరులో, ప్ర‌కాశం జిల్లాలో కూడా ఇలాంటి వ్య‌తిరేక‌త పార్టీ సొంత వ‌ర్గాల నుంచి వ్య‌క్త‌మౌతోందట. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా యాక్టివ్ అవుతోంది. వారు కూడా తటస్థంగా ఉన్న మాజీ నేతలపైనే ద్రుష్టి పెట్టిన సంగతి తెలిసిందే. జగన్ కూడా అలాంటి నేతలను దగ్గరకు చేర్చుకునే క్రమంలో ఉన్నారంటూ సంకేతాలు వెలువడుతూ ఉండటం విశేషం. ఇబ్బ‌డిముబ్బ‌డిగా నేత‌ల్ని పార్టీలోకి తీసుకొస్తే… అదో కొత్త స‌మ‌స్య‌గా మారుతుంద‌నే చర్చ వైకాపా వర్గాల్లో మొదలైందని సమాచారం. చేర్చుకునే నేత‌ల విష‌యంలో తొంద‌ర‌పాటు లేకుండా నిర్ణ‌యాలు తీసుకుంటూ… ఇప్ప‌టికే పార్టీలో ఉన్న‌వారికి ప్రాధాన్య‌త త‌గ్గ‌కుండా ప్ర‌య‌త్నించాల‌నే సూచ‌న‌లూ వినిపిస్తున్నాయి.!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com