అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగియనుందని ప్రకటించారు. ఇరాన్లో ఇక లక్ష్యంగా చేసుకోవడానికి ఏమీ మిగలలేదు. నేను కోరుకుంటే ఈ యుద్ధాన్ని ఇప్పుడే ఆపేయగలను అని ఆయన ప్రకటించారు. అమెరికా-ఇజ్రాయెల్ దళాల దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా నిర్వీర్యమైందని, అందుకే తాము అనుకున్న షెడ్యూల్ కంటే ముందే విజయం దిశగా సాగుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు.
తాము యుద్ధాన్ని ఆపేది లేదంటున్న ఇజ్రాయెల్
ట్రంప్ యుద్ధం ముగుస్తుందని చెబుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం తన కార్యకలాపాలను తగ్గించేందుకు సిద్ధంగా లేదు. ఇరాన్ అణు కేంద్రాలు , బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు పూర్తిగా ధ్వంసం అయ్యే వరకు యుద్ధం కొనసాగాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ట్రంప్ తన రాజకీయ అవసరాల కోసం, చమురు ధరల పెరుగుదల భయంతో యుద్ధాన్ని మధ్యలోనే ముగించాలని చూస్తున్నారనే ఆందోళన ఇజ్రాయెల్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. లక్ష్యాలను సాధించకుండా వెనక్కి తగ్గితే ఇరాన్ మళ్ళీ కోలుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ హెచ్చరిస్తోంది.
అమెరికాకు వేల కోట్ల నష్టం
యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్ కు 100 డాలర్లకు పైగా పెరగడం ట్రంప్ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ ఇప్పటికే చైనాకు సుమారు 11.7 మిలియన్ బారెళ్ల చమురును ఎగుమతి చేస్తూ తన ఆర్థిక మూలాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంధన ధరల పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో, త్వరితగతిన యుద్ధాన్ని ముగించి విజయం ప్రకటించాలని ట్రంప్ యోచిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం అవసరమైనంత కాలం యుద్ధం చేస్తామంటూ తమ పట్టుదల వీడటం లేదు.
అస్పష్టమైన తదుపరి పరిణామాలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఇప్పుడు టార్గెట్ ఎంటో ట్రంప్‌నకు కూడా తెలియడం లేదు ఒకవైపు ట్రంప్ యుద్ధం ఆపేస్తానని అంటుంటే, మరోవైపు ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య తలెత్తిన ఈ భిన్నాభిప్రాయాలు మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
