ఆంధ్రా భాజపా నేతల్లో అసంతృప్తి ఈనాటిది కాదు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ, ఆంధ్రాలో తెలుగుదేశంతో దోస్తీ కుదిరిన దగ్గర నుంచీ ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నా ఏపీ నేతలు మాత్రం తెలుగుదేశం కొంగు చాటున ఉండాల్సిన పరిస్థితి! దాంతో కొంతమంది నేతలకు భాజపాలో ఎదుగూ బొదుగూ ఉండటం లేదన్న అసంతృప్తి బాగా ఎక్కువైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ ఓపిక పట్టారుగానీ, ఇకపై ఆ అసంతృప్తి సెగలు బయటకి రావడం తథ్యం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఏపీ భాజపాలో ఉంటే ఎలాంటి ప్రయోజనమూ ఉండదనే ఒక స్థాయి నమ్మకం కొంతమంది కీలక నేతలకు వచ్చిందని అంటున్నారు! ఇంకో పక్క తెలుగుదేశం పార్టీతో అంటకాగే పరిస్థితి లేదనే చర్చకు తెర లేచినట్టు సమాచారం.
నిజానికి, ఏపీ నుంచి జాతీయ స్థాయి నేత వెంకయ్య నాయుడు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎలాగూ ఏపీలో అధికార పక్షం మిత్రపక్షమే కాబట్టి, సొంతంగా భాజపా ఎదిగేందుకు కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కేంద్రంలో వెంకయ్య ఉన్నారు కాబట్టి, కొత్తగా ఏర్పడ్డ ఏపీకి కేంద్రమే చాలా ఇస్తోంది కాబట్టి ఆ మేరకు పొలిటికల్‌గా బీజేపీ మైలేజ్ పెంచుకోవచ్చు. కానీ, పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వెంకయ్యతో చంద్రబాబుకు ఉన్న దోస్తీ కారణంగా ఏపీలో భాజపా నాయకులకు ప్రాధాన్యత లేకుండా పోతోందన్నది ఓపెన్ సీక్రెట్. కేంద్రం ఏం ఇస్తున్నా ఆ క్రెడిట్ తెలుగుదేశం అకౌంట్లోకి వేసుకుంటారు! ఆ విషయం తెలిసినా కూడా వెంకయ్య నాయుడు ఏమీ మాట్లాడరు. ఇక, ఇతర రాష్ట్ర నేతలకు ప్రశ్నించేంత స్వేచ్ఛ ఎక్కడుంటుంది? మొత్తానికి, వెంకయ్య నాయుడి పుణ్యామా అని ఆంధ్రాలో కమలం వికసించే పరిస్థితి లేదని కొంతమంది భాజపా నేతలే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నారట. ఇంకోపక్క, వర్గ విభేదాలు కావాల్సినన్ని! వెరసి, ఇంకా భాజపాలో కొనసాగడం అనేది ఉపయోగం లేని పని అనే భావన ఏపీ భాజపాలో నెమ్మదిగా వ్యాపిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలో కీలకమైన ఓ నలుగురు భాజపా నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం! కేంద్రంలో భాజపా అధికారంలో ఉందికదా, ఏదో ఒకరకమైన లబ్ధి ఉంటుందని ఎదురుచూస్తున్న సదరు సీనియర్లను పట్టించుకునే పరిస్థితి కూడా పార్టీలో లేదంటున్నారు. దీంతో భాజపా నుంచి బయటకి వెళ్లాలని దిక్కులు చూస్తున్నావారు పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. భాజపా నుంచి బయటకి వచ్చినవారు ఎటూ తెలుగుదేశంలోకి వెళ్లలేరు. అలాగని కాంగ్రెస్ వైపు చూస్తే అది ఆత్మహత్య! ఇక, వారికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ప్రతిపక్ష పార్టీ వైకాపా. నిజానికి, భాజపాలో నెలకొన్న ఈ అసంతృప్త వాతావరణాన్ని వైకాపా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ఆ క్రమంలోనే బెజవాడ నాయకుడు వెల్లంపల్లిని చేర్చుకున్నారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ ప్రముఖులు కూడా ఫ్యాను కిందకి చేరతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.