‘అమరావతి’ ఆందోళనకారుడిపై ఐటీ కత్తి!

అమరావతి నగర నిర్మాణానికి తన వంతు ప్రయత్నం ద్వారా చిన్న చిన్న ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న పర్యావరణ ఆందోళన కారుడిపై ఎదురుదాడి చేయడానికి ప్రభుత్వానికి ఇంత కాలానికి అవకాశం దొరికినట్లుగా కనిపిస్తోంది. పచ్చటి పంట పొలాల్లో కాంక్రీట్‌ జంగిల్‌ లాంటి అమరావతి నగరాన్ని నిర్మించడానికి పూనుకోవడం అనేది ఏమాత్రం సమర్థనీయం కాదంటూ.. పి.శ్రీమన్నారాయణ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ద్వారా పోరాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నుంచి గానీ.. వారికి తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ అనుమతులు రాకపోయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నిర్మాణాల విషయంలో ముందుకు దూసుకెళ్లిపోతున్నది. అయితే పి.శ్రీమన్నారాయణ మాత్రం తన ఆందోళన విషయంలో మడమ తిప్పడం లేదు.

గ్రీన్‌ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఆయన ఆ పోరాటాన్నే ఉధృతం చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులు అడపాదడపా .. శ్రీమన్నారాయణను వెనుకనుంచి రాజకీయ ప్రత్యర్థులు నడిపిస్తున్నారంటూ ఆరోపణలు చేయడం కూడా జరుగుతోంది. తెలుగుదేశం ప్రయత్నాలకు ప్రతిపక్షాలు గండికొట్టదలచుకుంటాయి గనుక.. ఇలాంటి విమర్శలకు ఆస్కారం ఏర్పడుతూ వచ్చింది.

అయితే వారి విమర్శలు మరింత ఎక్కువ కావడానికి స్వయంగా శ్రీమన్నారాయణ ఓ అవకాశం కల్పించారు. ఆయన తాజాగా తన ఫేస్‌ బుక్‌ ఖాతా ద్వారా.. అమరావతిలో రాజధాని నిర్మాణం రాకుండా.. పర్యావరణానికి ద్రోహం జరగకుండా చూడ్డానికి తాను చేస్తున్న పోరాటానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా బహిరంగ విజ్ఞప్తి చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ విషయంలో తొలుత హైకోర్టును, సుప్రీం కోర్టును ఆశ్రయించిన శ్రీమన్నారాయణ అక్కడ పని జరక్క, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ద్వారా బ్రేకులు వేయించే ప్రయత్నంలో ఉన్నారు.

అయితే అమరావతిని అడ్డుకోవడానికి ఇంతవరకు తాను కోర్టు ఖర్చులకు 53 లక్షల రూపాయల సొంత డబ్బు ఖర్చు చేశానని.. అందులో 1.70 లక్షలు ఎన్నారై మిత్రులనుంచి చందాలు వచ్చాయని, తాను సొంతంగా ఇంకా కాగల ఖర్చులు భరించే స్థితిలో లేను కాబట్టి.. ఈ పోరాటానికి మద్దతిచ్చే వాళ్లంతా విరాళాలు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. సహజంగానే.. తెదేపా వ్యతిరేకులు ఎంతో కొంత ఇచ్చే అవకాశం ఉంది.

అయితే.. ఈ చందాల వ్యవహారంపై తాజాగా ఐటీ శాఖ దృష్టి పెట్టింది. 53 లక్షల సొంత డబ్బు ఆయన ఎలా పెట్టారు? అదంతా లెక్కల్లో ఉన్న సొమ్మేనా? వాటికి పన్నులు చెల్లిస్తున్నారా? ఆయన బ్యాంకు ఖాతాకు వస్తున్న విరాళాలు ఎంతెంత? ఎక్కడెక్కడనుంచి? ఉంటున్నాయి. దానికంతా పన్నుల చెల్లింపులు పద్ధతిగా జరుగుతున్నట్లేనా? అనేదిశగా వారు శోధన ప్రారంభించినట్లు సమాచారం. మొత్తానికి అమరావతి ఆందోళన కారుడిపై ఐటీ కత్తి వేలాడుతున్నదన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com