ప్రొ.నాగేశ్వర్ : వీవీ లక్ష్మినారాయణ టీడీపీలో చేరితే ఎవరికి లాభం..?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ.. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని.. ప్రచారం జరుగుతోంది. ఆయన భీమిలి నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. దీంతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కసారిగా విమర్శలు గుప్పించారు. జగన్ కేసులపై విచారణ జరిపింది వీవీ లక్ష్మీనారాయణే. అందుకే… చంద్రబాబుతో కలిసి వీవీ లక్ష్మినారాయణే కేసు నడిపారంటూ.. ఇద్దరూ కలిసి చేశారంటూ విమర్శలు ప్రారంభించారు. ఇలాంటి విమర్శల మధ్య వీవీ లక్ష్మినారాయణ టీడీపీలో చేరితే ఎవరికి లాభం..?

వీవీ లక్ష్మినారాయణ టీడీపీలో చేరుతారని ప్రచారం..!

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ ఓ గౌరవప్రదమైన పోలీస్ ఆఫీసర్. ఆయన సీబీఐలో ఉన్న కాలంలో.. ఒక్క జగన్ కేసుల్ని మాత్రమే కాదు. సత్యం స్కాం, గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ స్కాంలను కూడా విచారించారు. వేల కోట్లతో ముడిపడి ఉన్న ఇలాంటి కేసుల్లో… ఎక్కువగా అవినీతి జరుగుతూ ఉంటుంది. కానీ వీవీ లక్ష్మినారాయణ ఈ కేసులను.. ఓ లాజికల్ ఎండ్‌కు తీసుకొచ్చారు. ఆయన విచారించిన కేసుల్లో జగన్ కేసు ఒకటి అంతే. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఆయన.. సీబీఐ నుంచి సొంత రాష్ట్రానికి వెళ్లిపోయిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆలోచించారు. వీఆర్ఎస్ తీసుకుని వచ్చేసి.. రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఆయన వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత అందరూ సొంత రాజకీయ పార్టీ పెడతారని అనుకున్నారు. కానీ ఈ రోజుల్లో రాజకీయ పార్టీ పెట్టడం అంత సులభమేమీ కాదు. ఓ రాజకీయ పార్టీని నడపాలంటే ఎంతో కరిష్మా ఉండాలి. లక్ష్మినారాయణకు.. ఇమేజ్ ఉన్న మాట నిజం. కానీ కరిష్మా ఉండాలి. అది లేకపోతే.. ప్రజల్లో ఓ ఉద్యమం ఉండాలి. కేజ్రీవాల్‌కు అవినీతి వ్యతిరేకత ఉద్యమం ఎలానో.. అలాంటి ఉద్యమం ఒకటి ఉండాలి. కానీ.. అలాంటిదేమీ ఇప్పుడు ఏపీలో లేదు. లక్ష్మినారాయణ ఇప్పుడు మాట్లాడుతున్న మాటల్ని బయట్టి ఆయన ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఊహాగానాలే అని ఆయన అంటున్నారు కానీ ఖండించడం లేదు. అంటే.. ఆయన ఏ క్షణమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సొంత పార్టీ పెట్టలేకపోతే ఉన్న ఒకే ఒక్క మార్గం టీడీపీ..!

లక్ష్మినారాయణ స్వచ్చంద పదవీ విరమణ చేశారు కాబట్టి.. ఆయనకు రాజకీయంపై పూర్తి హక్కు ఉంది. సొంత పార్టీ అయినా పెట్టుకోవచ్చు లేదా.. ఇతర పార్టీల్లో అయినా చేరవచ్చు. ఆయనకు రాజకీయాల్లో చేరే హక్కు ఉంది. మనకు.. మాట్లాడే హక్కు ఉంటుంది. లక్ష్మినారాయణ సొంత పార్టీ పెట్టి.. అవినీతి, ఫిరాయింపులు లేని రాజకీయాలు చేయాలని నేను కోరుకుంటాను. ఆయనపై కేజ్రీవాల్ సక్సెస్ అయిన ఇంపాక్ట్ ఉండి ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే… లోక్‌సత్తా జేపీ ఫెయిల్యూర్ కూడా.. ఆయన మదిలో ఉండి ఉండవచ్చు. కోదండరాం కూడా సక్సెస్ కాలేదు. ఇలాంటి పరిణామాలతో.. లక్ష్మినారాయణ తేల్చుకోలేకపోతున్నారని.. అనుకుంటున్నారు. లక్ష్మినారాయణ ఆరెస్సెస్‌పై… లక్ష్మినారాయణకు అభిమానం ఉండటంతో.. ఆయన బీజేపీలో కలుస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన బీజేపీతో కలుస్తారని ఎప్పుడూ చెప్పలేదు. ఏపీలో ఇలాంటి సమయంలో ఎవరైనా బీజేపీతో కలవడం అసాధ్యం. ఆ పార్టీలో ఉన్న వాళ్లే ఉండటం లేదు. జగన్మోహన్ రెడ్డిపై విచారణ జరిపిన సీబీఐ మాజీ అధికారిని బీజేపీ చేర్చుకోవడం కూడా కష్టమే. జగన్‌ను నిరాశ పరిచే పని బీజేపీ చేయదు.

టీడీపీలో చేరబోతున్న ప్రచారాన్ని హైలెట్ చేసుకున్న జగన్ మీడియా..!

ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే. ఆ పార్టీలో చేరే అవకాశం లేదు. ఇక వైసీపీలో చేరరు. ఎందుకంటే.. అసలు ఆయన కేసులు విచారణ జరిపింది… జగన్‌పైనే కాబట్టి.. ఆ పార్టీలో చేరే అవకాశం లేదు. జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది . అయితే.. జనసేన ఎమర్జ్ అయ్యే పొలిటికల్ ఫోర్స్‌గా లేదు… కాబట్టి… ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ టీడీపీ. ఆయన ఇప్పుడు టీడీపీలో చేరితే.. టీడీపీకి ఇబ్బంది.. లక్ష్మినారాయణకు కూడా ఇబ్బందే. చంద్రబాబు మోడీ – జగన్ – ఈడీ జోడి అని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈడీ లేఖ బయటకు వచ్చింది. జగన్ కేసులపై సీబీఐ విచారణ ఆపేసిందన్నది ఆ లేఖ సారాంశం. టీడీపీ అనుకూల మీడియాలో ఇది హైలెట్ అయినప్పుడు.. లక్ష్మినారాయణ టీడీపీలో చేరబోతున్నారనే అంశాన్ని… జగన్ అనుకూల మీడియా హైలెట్ చేసుకుంది. ఓ ఆయుధంగా మార్చుకుంది. తనపై ఉన్న అవినీతి ఇమేజ్ ను.. న్యూట్రల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది టీడీపీకి నష్టమే.

టీడీపీలో చేరితే ఆయన ఇమేజ్‌కూ ఇబ్బందే..!

సీబీఐ అధికారిగా… లక్ష్మినారాయణ ఇమేజ్ చాలా గొప్పగా ఉంటుంది. సీబీఐ అధికారి అంటే… ఎలా ఉంటారు అంటే… రోల్ మోడల్‌గా ఆయనను చూపిస్తున్నారు. ఆ ఇమేజ్ ఎంత కాలం ఉంటుందో చెప్పలేం కానీ.. టీడీపీలో చేరితే ఆ ఇమేజ్‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. టీడీపీలో చేరితే అడ్వాంటేజ్… డిస్ అడ్వాంటేజ్ రెండూ ఉంటాయి. టీడీపీలో చేరితే.. పరిమితం అయిపోతారు. చాలా మంది దూరం అవుతారు. సొంతంగా పార్టీ పెట్టుకుంటే.. ఎంపీ, ఎమ్మెల్యేలు కాకపోవచ్చు. కానీ.. సంప్రదాయ రాజకీయాలు చేయకుండా కొత్త ప్రయత్నం చేయవచ్చు. లక్ష్మినారాయణ.. సొంతంగా.. ఓ పార్టీ పెడితే మంచిదని అభిప్రాయం. భారత ప్రజాస్వామ్యానికి ఇలాంటి.. ప్రయోగాలు చాలా అవసరం అని నా అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com