ఏపీ స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకూడదని జగన్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు తప్ప ఇంకే ఉండకూడదన్నట్లుగా మున్సిపాలిటీలు, జడ్పీటీసీలు, కార్పొరేషన్లను ఏకగ్రీవాలు చేసుకున్న జగన్ రెడ్డి తాను ప్రతిపక్ష హోదా కోల్పోయే సరికి ఏకగ్రీవాలు కాకూడదంటున్నారు. పోటీ చేయాల్సిందేనని ఏ నియోజకవర్గంలో అయినా ఏకగ్రీవాలు అయితే ఆ ఇంచార్జ్ విషయంలో సీరియస్ గా తీసుకుంటానని హెచ్చరించారు.
పార్టీ ముఖ్యనేతలందర్నీ పిలిచి ఎప్పట్లాగే విచిత్రమైన విషయాలు చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జగన్ ఒక విచిత్రమైన లాజిక్‌ను తెరపైకి తెచ్చారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ.. ఓట్లు పెరిగినా, తగ్గినా ప్రమాదకరమేనని వ్యాఖ్యానించారు. గతంలో బెంగాల్లో 91 లక్షల ఓట్లను, తమిళనాడులో 74 లక్షల ఓట్లను తొలగించారని గుర్తు చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకు నాయకులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు రెండేళ్ల పాలనను ఎండగడుతూ వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ఒక బుక్‌లెట్‌ను కూడా ఆయన విడుదల చేశారు. చంద్రబాబుది ఒక్క వెన్నుపోటు కాదని, అనేక వెన్నుపోట్లని విమర్శిస్తూ.. ప్రజల నిరసనల సెగలు ప్రభుత్వానికి తగలాలని పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు. ఈ నిరసన కార్యక్రమాల కోసం జూన్ 4 నుంచి 12 వరకు ఒక ప్రత్యేక షెడ్యూల్‌ను జగన్ ప్రకటించారు. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసనలు, జూన్ 8 లేదా 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో సదస్సులు, జూన్ 12న భారీ ర్యాలీలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆయన ఆదేశించారు. అయితే ఈ నిరసనల్లో ఆయన ఎక్కడా పాల్గొనే అవకాశాలు లేవు.
