ఇడి ట్వీట్‌కి జగన్, సుప్రీం నోటీసుకు బాబు సమాధానం చెప్పాల్సిందే

చంద్రబాబు, జగన్‌లిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళ జాగీరులా ఫీలవుతున్నట్టున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరి కంటే కూడా విలువలు, విశ్వసనీయతలాంటి విషయాల్లో తామే అగ్రగణ్యులం అని భావిస్తున్నట్టున్నారు. అందుకే ఇద్దరూ కూడా త్వం శుంఠ అంటే త్వం శుంఠ అని తిట్టుకోవడం, నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకోవడం చేస్తున్నారు. ఇద్దరికీ ఉన్న భజన మీడియా కూడా వాళ్ళు చేస్తున్న తప్పులను అందంగా కవర్ చేస్తున్నారు. ఈ రోజు కొత్తపలుకులో రాధాకృష్ణ చాటభారతం ప్రథమ ఉద్ధేశ్యం ఒక్కటే. పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్-చంద్రబాబులిద్దరూ కూడా దొందూ దొందే టైప్ అని చెప్పాలన్నదే ఆ ఉద్ధేశ్యం. అదే అవినీతి వ్యవహారాలకు వచ్చేసరికి జగన్‌కంటే చంద్రబాబు తక్కువ అవినీతి పరుడు అని చెప్పడానికి కష్టపడుతూ ఉంటాడు రాధాకృష్ణ. ఇక్కడ జగన్ సానుభూతి పరులందరూ కూడా అవినీతి విషయంలో చంద్రబాబు కూడా తక్కువేమీ కాదు అని ప్రజలకు చెప్తూ ఉంటారు. ఇద్దరి వాదనల్లోనూ నిజాలున్నాయి. కానీ జగన్-బాబులిద్దరూ కూడా ఒకరినుద్దేశించి ఒకరు మాట్లాడుకుంటూ ఇద్దరి తప్పులనూ మేనేజ్ చేసుకుంటున్నారు. కానీ ఆ ఇద్దరూ సమాధానం చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు.

జగన్ మోహన్‌రెడ్డికి సంబంధించిన డొల్ల కంపెనీల వ్యవహారంపై ఇడి ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌కి సమాధానం చెప్పాలని చంద్రబాబు జగన్‌ని నిలదీశాడు. చంద్రబాబు ప్రశ్నలో అర్థం ఉంది. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి అవినీతి వ్యవహారాల గురించి ఇడి స్థాయి సంస్థ మాట్లాడినప్పుడు స్పందించాల్సిన బాధ్యత జగన్‌కి లేదా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? అలాగే అంతకుముందు ఓటుకు కోట్లు కేసు గురించి సుప్రీం కోర్టు చంద్రబాబుకు నోటీసులు పంపించింది. ఆ నోటీసుల గురించి, బ్రీఫ్డ్ మీ వాయిస్ బాబుదా? కాదా? అన్న విషయం గురించి చంద్రబాబు స్పందించాలని జగన్ కోరాడు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి దేశ అత్యున్నత స్థాయి న్యాయస్థానం నోటీసులు పంపించడమంటే చిన్న విషయమేం కాదు. కానీ ఆ విషయాన్ని చాలా చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు, ఆయన భజన మీడియా జనాలు. జగన్ అవినీతి గురించి ప్రశ్నిస్తున్నప్పుడు….తన అవినీతి వ్యవహారాల గురించి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంటుంది. తన పాతివ్రత్యానికి మాత్రం తానే సర్టిఫికెట్ ఇచ్చేసుకోవడం, ప్రతిపక్షాన్ని మాత్రం పాతివ్రత్యాన్ని నిరూపించుకోమని సవాల్ చేయడం డొంక తిరుగుడు వ్యవహారం. చంద్రబాబు-జగన్‌ల అవినీతి వ్యవహారాలు, తప్పులను తగ్గించి చూపించాల్సిన అవసరం ఆ ఇద్దరికీ అమ్ముడుపోయిన భజన మీడియా జనాలకు ఉంటుందేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు. విలువలు, విశ్వసనీయత, నిప్పు….తుప్పు, తొక్కా, తోటకూర అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నీతిమంతులం, సమర్థులం, కష్టపడుతున్నవాళ్ళం అని డబ్బా కొట్టుకోవడం మాని ముందు ప్రజలకు సమాధానం చెప్పండి. అలా చేయడం చేతకాకపోతే మా ఇద్దరిదీ దొందూ దొందే వ్యవహారం, ఇద్దరమూ ఒకటే కేటగిరీ అని ఒప్పుకోండి. మీ కంటే సమర్థులైన నాయకులు ఎపిలో లేరు అని చెప్పి, మీరు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోతుంది అని భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి మరీ ఓట్లేయించుకోవాలన్న దుర్బుద్ధిని మాత్రం మార్చుకోండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com