‘మైండ్‌గేమ్’ ట్రాప్‌లో అడ్డంగా పడిపోయిన జగన్

హైదరాబాద్: జగన్ ఎంత కట్టడి చేసినా ఉపయోగం లేకుండా పోతోంది. ఎమ్మెల్యేలు కట్లు తెంచుకుని పారిపోయి టీడీపీ శిబిరంలో చేరిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ చేరారు. మరికొంతమంది మంచి తరుణంకోసం పొంచిచూస్తున్నారని అంటున్నారు. ఇవాళ జగన్ నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి ఏడుగురు గైర్హాజరయ్యారని సమాచారం.

2014 ఎన్నికలకు ముందు ఒక సమయంలో జగన్ ప్రభంజనం ఎలా ఉందంటే, అతను అధికారంలోకి రావటం అనివార్యమనిపించింది. 2014 ఎన్నికల్లో కూడా ఫలితాలలో అధికారపార్టీకి ఢీ అంటే ఢీ అనే స్థాయిలో స్థానాలు గెలుచుకున్నాడు. 67 స్థానాలంటే ఆషామాషీ ఏమీ కాదు.

ప్రస్తుత పరిస్థితికి కారణం జగన్ లోపమా, అధికార పార్టీ చూపుతున్న ప్రలోభమా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. రెండూ కారణాలనూ ఒకసారి పరికిస్తే… జగన్ నాయకత్వ లక్షణాలు, పార్టీని నడిపే తీరు(ఆర్గనైజేషనల్ స్కిల్స్) మొదటినుంచి లోపభూయిష్టంగానే ఉంది. ఒక నాయకుడికి ఉండకూడని – ఎవరినీ నమ్మకపోవటం, ఎవరి సలహా వినకపోవటం వగైరా లక్షణాలన్నీ – ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. దానికితోడు అనేక కీలక విషయాలపై, కీలక సమయాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని పార్టీని విమర్శలకు గురిచేశారు(తాజాగా చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకపోవటం, అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పార్టీనుంచి ఎవరూ హాజరుకాకపోవటం వంటివి). దీనికి తోడు ఆయన పనితీరులో నిలకడ కనిపించకపోవటం మరో ప్రధాన లోపం. ఏదైనా కార్యక్రమంగానీ, ఉద్యమంగానీ చేపడితే అది ఉన్నంతకాలం ఉంటారు… ఒక్కోసారి రోజుల తరబడి జనానికి కనిపించరు. రోజువారీగా పూర్తిస్థాయిలో రాజకీయాలలో ఉన్నట్లుగా కనిపించటంలేదు. వీటన్నింటినీ మించి ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలా అన్న తహతహ, ఆరాటం ఆయన మాటల్లో, చేతల్లో కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనా ఆయన వ్యక్తిత్వంలో, వ్యవహారశైలిలో ఒక నిండుదనం కనబడటంలేదు. అసలే ‘సీబీఐ కేసులు’ అనే లొసుగు(vulnerability) ఆదినుంచి ఉండగా, ఈయన వ్యక్తిత్వంకూడా అలాగే ఉండటంతో శ్రేణుల్లో నమ్మకం సడలటం సహజమే.

మరోవైపు తెలుగుదేశం పార్టీ ఒకవైపు తెలంగాణలో తమపార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ తోలుకుపోతోందని ఆక్రోశిస్తూనే, విలువలకు తిలోదకాలిచ్చి ఏపీలో అదే తరహాలో వైసీపీని నిర్వీర్యం చేయటానికి బేరసారాలు మొదలుపెట్టింది. అనేక తాయిలాలతో, ప్యాకేజిలతో వైరిపక్షంవారిని ఆకట్టుకోవటం ప్రారంభించింది. మొదట భూమా&కో తదితరులతో ఒక బ్యాచ్‌ను తీసుకుని, తర్వాత మరింత బలంగా మైండ్ గేమ్ మొదలుపెట్టింది. చినబాబు తిరుపతి పర్యటనలో మరో కీలకనేత రాబోతున్నాడని ప్రకటన చేయటం దానిలో భాగమే.

అసలే ఎవరినీ నమ్మని వైసీపీ అధినాయకుడికి టీడీపీ మైండ్‌గేమ్‌తో అందరూ అనుమానంగానే కనిపించటం సహజమే. పార్టీలో అందరికీ పక్కనున్నవారిపై అనుమానాలు మొదలయ్యాయి. మైండ్ గేమ్ మొదలుపెట్టినవారి లక్ష్యం ఇదే. ఇది ఎంతదాకా వెళ్ళిందంటే, జగన్‌ మీద ఈగ వాలినా ఊరుకోబోమన్నట్లు కనిపించే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గండికోట శ్రీకాంత్ రెడ్డి, జ్యోతుల నెహ్రూల మీద కూడా మీడియాలో ఊహాగానాలు సాగేటంత. చివరికి చెవిరెడ్డి కూడా తాను పార్టీని వీడబపోనని సంజాయిషీ ఇచ్చారంటే మైండ్ గేమ్ ఎంత బలంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా మైండ్ గేమ్‌లో ఇంత అడ్డంగా దొరికిపోవటానికి కారణం టీడీపీ ప్రలోభాలకంటే వైసీపీలోని వ్యవస్థాగతమైన లోపాలేనని చెప్పాలి. నిర్మాణం పునాదినుంచి పటిష్ఠంగా ఉంటే ఇది జరిగేది కాదు. ఇప్పటికైనా జగన్ ఒక మంచి మేధావుల బృందాన్ని(థింక్ ట్యాంక్) ఏర్పరుచుకుని సమీకృతంగా, సంయోజకంగా(cohesive), సమన్వయంగా పయనిస్తే నష్టాన్ని నియంత్రించుకోవచ్చు. లేకపోతే అప్పటి ప్రజారాజ్యం పార్టీలాగానో, ఇప్పటి తెలంగాణా టీడీపీలాగానో అస్తిత్వం ప్రశ్నార్థకమవటం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com