వైసీపీ రాజకీయాల్లో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కంటే అంబటి రాంబాబే హాట్ టాపిక్‌గా మారారు. సాక్షి మీడియాలో తన బాస్ కంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఆక్రమిస్తూ అంబటి సాగిస్తున్న జోరు చూస్తుంటే, ఆయన ఏకంగా పార్టీ సుప్రీమో పదవిపైనే కన్నేశారా అనే అనుమానం కలుగుతోందని సెటైర్లు పడుతున్నాయి. జగన్ అనుమతితో చేస్తున్నారో లేక సాక్షి యాజమాన్యాన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి స్లాట్లు కొట్టేస్తున్నారో కానీ, ప్రస్తుతం వైసీపీ అంటే రాంబాబే అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
రాజకీయాల్లో సింపతీ కోసం అంబటి ఆడుతున్న డ్రామాలు తారస్థాయికి చేరాయి. మొన్నటి దాడి ఘటనను అడ్డం పెట్టుకుని ఆయన చేస్తున్న రాజకీయం చూస్తుంటే, ఆస్కార్ లెవల్ పర్ఫార్మెన్స్ అనిపిస్తోంది. ఎప్పుడూ రూపాయి బయటకు తీయని అంబటి, ఇప్పుడు తన సొంత ఇమేజ్ కోసం ధారాళంగా ఖర్చు పెడుతుండటం చూసి సొంత పార్టీ నేతలే నోరెళ్లబెడుతున్నారు. ఆయనను నమ్మి మనం రూపాయి ఖర్చు పెట్టడం కంటే, ఆయన ఖర్చు పెడుతున్నప్పుడే పక్కన ఉండి ఎంజాయ్ చేయడం మిన్న అని అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు.
సాక్షి మీడియాను తన ప్రచార సాధనంగా వాడుకోవడంలో అంబటి మాస్టర్ ప్లాన్ వేశారు. తన కార్యక్రమాలకు మిగిలిన మీడియాలో ఎలాగో చోటు దొరకదని ఆయనకు బాగా తెలుసు. అందుకే, నాకు సాక్షిలో ప్రాధాన్యం ఇవ్వకపోతే పార్టీ నన్ను వదిలేసిందని జనం అనుకుంటారు అంటూ పార్టీ హైకమాండ్‌ను ఇబ్బంది పెట్టి మరీ స్లైడ్లు వేయించుకుంటున్నారు. పాపం జగన్ రెడ్డి ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అవే విజువల్స్ పదే పదే వేయించుకుంటుంటే, అంబటి మాత్రం రోజూ కొత్త కొత్త గెటప్పులతో సాక్షి స్క్రీన్ మీద మెరిసిపోతున్నారు.
ప్రస్తుతం గుంటూరులో ఆయన చేసిన దీక్ష కూడా అలాంటిదే. జగన్ రెడ్డి నైజం తెలిసిన వారు మాత్రం అంబటిని హెచ్చరిస్తున్నారు. పార్టీలో ఎవరైనా తనకంటే ఎక్కువ హైలైట్ అవుతున్నారని తెలిస్తే జగన్ ఎంత త్వరగా కట్ చేస్తారో రాంబాబుకు తెలియంది కాదు. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు అంబటి చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ చూస్తుంటే, త్వరలోనే ఆయనకు షాక్ తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. కానీ, రాంబాబు మాత్రం ఇప్పుడు ఎవరి మాట వినే మూడ్‌లో లేరు, ఆయన దృష్టి అంతా సాక్షి కెమెరా ఫోకస్ పైనే ఉంది!
