ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం దళిత క్రైస్తవుల అంశం కీలంగా మారింది. జగన్ రెడ్డికి కంచుకోటలాంటి ఓటు బ్యాంకుపై ఇప్పుడు షర్మిల రెడ్డి నేరుగా సర్జికల్ స్ట్రైక్ మొదలుపెట్టారు. దళిత క్రైస్తవుల హక్కుల కోసం విజయవాడ వేదికగా ఆమె గళమెత్తుతుంటే, తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఈ సున్నితమైన అంశంపై జగన్ అనుసరిస్తున్న తీరు, ఆయన రాజకీయ పునాదులనే కదిలించేలా ఉంది.
నమ్మిన వారిని అలా వదిలేస్తారా?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుండి దళిత క్రైస్తవులు అంటే మతం మారిన దళితులు ఆ కుటుంబానికి వెన్నెముకగా నిలిచారు. ఒక సారి జగన్ రెడ్డి అధికారంలోకి రావడానికి వీరి ఓట్లే కీలకం. కానీ, నేడు సుప్రీంకోర్టు తీర్పుతో వారి మనుగడ ప్రశ్నార్థకమైన వేళ, జగన్ రెడ్డి కనీసం సంఘీభావం తెలపకపోవడం దారుణం. మా వాడు.. మా కోసం నిలబడతాడు అని నమ్మిన వర్గానికి ఇప్పుడు జగన్ ముఖం చాటేయడం, వారిని నట్టేట ముంచడమే అవుతుంది. రాజకీయ అవసరాల కోసం అండగా నిలిచిన వారిని ఇలా అన్యాయం చేయడం జగన్ మార్క్ విశ్వసనీయత కు మాయని మచ్చగా మిగిలిపోనుంది.
ఢిల్లీ భయం.. ఓటు బ్యాంకుకు శాపం!
జగన్ రెడ్డి మౌనం వెనుక ఉన్న అసలు కారణం ఢిల్లీ భయం. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు కోపం వస్తుందేమోనన్న భయంతో, తన సొంత ఓటు బ్యాంకు ప్రయోజనాలను ఆయన బలిపీఠం ఎక్కిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న కేసుల భయం ముందు, ఇక్కడ తనను నమ్మిన వారి కన్నీళ్లు జగన్కు కనిపించడం లేదు. అధికారం కోసం సిద్ధాంతాలను, అండగా నిలిచిన వర్గాలను తాకట్టు పెట్టే ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా..అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
షర్మిల దూకుడు – జగన్ కోటలో బీటలు
జగన్ వదిలేసిన ఖాళీని షర్మిల రెడ్డి అత్యంత చాకచక్యంగా భర్తీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరఫున ఆమె రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ, దళిత క్రైస్తవుల గొంతుకగా మారుతున్నారు. పార్లమెంట్లో చర్చ జరగాలి.. ఎవరు ఎవరి పక్షమో తేలాలి అంటూ ఆమె వేస్తున్న ప్రశ్నలు నేరుగా జగన్ రెడ్డికి తగులుతున్నాయి. ఇప్పటి వరకు జగన్ తన ఆస్తిగా భావించిన ఓటు బ్యాంకు ఇప్పుడు షర్మిల వైపు మొగ్గు చూపుతోంది. పునాదులు కదులుతున్నా, ప్యాలెస్ గోడల మధ్య జగన్ ఇంకా భ్రమల్లోనే బతకడం విచారకరం.
అందరూ దూరం.. జగన్కు అర్థం కావడంలేదా?
కుటుంబాన్నే కాదు.. ఓటు బ్యాంకును కూడా ఒక్కో వర్గాన్ని దూరం చేసుకుంటూ పోతున్న జగన్, చివరకు ఒంటరివాడయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దళిత క్రైస్తవులకు అండగా ఉండేందుకు ముందుకు రాకపోగా, కనీసం ఆ వర్గాల ఆవేదనను వినే తీరిక కూడా లేకపోవడం ఆయన అహంకారానికి నిదర్శనం. భయంతో చేసే రాజకీయాలు ఎప్పుడూ శాశ్వతం కావు, కానీ ఆ భయం వల్ల పోగొట్టుకున్న నమ్మకం మాత్రం తిరిగి రాదు. రాజకీయాల్లో ఎవరినైనా మోసం చేయవచ్చు కానీ, అధికారం ఇచ్చి అండగా నిలిచిన వారిని మోసం చేస్తే ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. దళిత క్రైస్తవుల విషయంలో జగన్ రెడ్డి తీరు కంచే చేను మేసినట్లు ఉంది. తన పునాదులను తనే పెకలించుకుంటూ, ప్రత్యర్థులకు మార్గం సుగమం చేస్తున్న జగన్ తీరు చూస్తుంటే.. ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని స్పష్టమవుతోంది. నమ్మిన వారిని నట్టేట ముంచే నాయకుడికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.


