ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంక్రాంతి సంబరాల్లో రికార్డింగ్ డ్యాన్స్ చేశారంటూ జగన్ చేసిన ఆరోపణలు రివర్స్ అవుతున్నాయి. తాడేపల్లి ప్రెస్మీట్లో ఆయన కూటమి ప్రభుత్వంలో మంత్రులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్టేజీపై మహిళా డ్యాన్సర్లతో కలిసి అశ్లీల రికార్డింగ్ డ్యాన్సులు వేశారని, అసలు మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పనులు చేస్తున్నవారిని జైల్లో పెట్టాల్సింది పోయి, ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.
జగన్ ఆరోపణలపై జబర్దస్త్ కళాకారుడు శాంతి స్వరూప్ తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోలో మంత్రి పక్కన ఉన్నది మహిళ కాదని, లేడీ గెటప్ ధరించిన మగవాడినైన తానేనని స్పష్టం చేశారు. నేను ఒక కళాకారుడిని, వృత్తిలో భాగంగా ఆడవేషం వేసి మంత్రి గారితో కలిసి డ్యాన్స్ చేశాను. నిజానిజాలు తెలుసుకోకుండా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. మంత్రి సుభాష్‌ను తానే స్టేజిపైకి పిలిచామన్నారు. ఒక కళాకారుడికి, రికార్డింగ్ డ్యాన్సర్‌కు తేడా తెలియకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా జగన్ విమర్శలపై ఘాటుగా స్పందించారు. శాంతి స్వరూప్ లేడీ గెటప్ వేస్తారనే కనీస సమాచారం కూడా జగన్‌కు ఇచ్చేవాళ్లు లేరా? అని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి రోజాను అడిగినా శాంతి స్వరూప్ గురించి చెప్పేవారు. కళాకారులను గౌరవించడం మా సంస్కృతి. సొంత ఇళ్లలో సెట్టింగ్‌లు వేసుకునే జగన్‌కు జనంలో జరిగే సంక్రాంతి సంబరాలు ఎలా తెలుస్తాయి అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల నాయకులను టార్గెట్ చేయడం జగన్‌కు అలవాటుగా మారిందని, తాము ఎక్కడా హద్దులు దాటలేదని స్పష్టం చేశారు.
వైసీపీ నాయకుడు ఒకరు రికార్డింగ్ డాన్సర్లపై అనుచితంగా ప్రవర్తించి కేసుల పాలయ్యాడు. ఆ విషయం జగన్‌కు ఎవరూ చెప్పలేదమో కానీ.. సంక్రాంతి పండుగను గొప్పగా చేసుకున్నా ఆయన తట్టుకోలేకపోతున్నారన్న విమర్శలు మాత్రం ఎదుర్కొంటున్నారు.
