థియేటర్లలో… ఎక్కువ రేటుకు అమ్మితే జైలు జీవితమే!

కోకా కోలా, పెప్సీ, పాప్ కార్న్, శాండ్ విచ్, బర్గర్, వాటర్ బాటిల్… సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్లలో ఏది కొనాలని అనుకున్నా అక్కడి రేట్లు చూసి గుండెదడ రావడం ఖాయం. బయట మార్కెట్ ధరలకు, థియేటర్లలో అమ్మే ధరలకు అసలు పొంతన వుండదు. రెండురెట్లు, మూడురెట్లు ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ రేటుకు అమ్మినట్టు తెలిస్తే అంతే సంగతులు. తినుబండారాలు, శీతల పానీయాలు అన్నిటినీ ఎమ్మార్ఫీ ధరలకు అమ్మాలని, లేనిపక్షంలో ఎక్కువ ధరలకు విక్రయించే థియేటర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర తూనికల కొలతల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని విధివిధానాలు రూపొందించారు.

అధికారులు రూపొందించిన విధివిధానాలు:

  • ఫుడ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్… థియేటర్లలో అమ్మే ప్రతి వస్తువుపై బరువు, తయారు చేసిన తేదీ, ఎప్పటివరకూ నిల్వ వుంటుంది అనే అంశాలతో పాటు ఎంఆర్‌పీ (మ్యాగ్జిమమ్ రిటైల్ ప్రైస్) స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్‌ వుండాలి.
  • ఎంఆర్‌పీ మారితే… ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలి.
  • థియేటర్లలో సేమ్ బ్రాండ్‌ ఫుడ్ ఐటమ్స్ కాకుండా వివిధ బ్రాండ్స్ అందుబాటులో వుంచాలి.
  • ప్యాకేజ్డ్‌ రూపంలో వున్న వస్తువులపై తయారీదారు ఫుల్ అడ్రస్, ఐటమ్ నేమ్ అన్నీ వుండాలి.
  • ఇవన్నీ ప్రేక్షకులకు స్పష్టంగా తెలిసేలా బోర్డు పెట్టాలి.
  • ప్రతి వస్తువుని ఎంఆర్‌పీ ధరలకు విక్రయించాలి.

ఆగస్టు 1వ తేదీ ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎంఆర్‌పీ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువకు అమ్మినా… నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై భారీ జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష విధించేలా తూనికల కొలతల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి పాతికవేలు జరిమానా విధిస్తారు. అదే రెండోసారి అయితే రూ. 50 వేలు, మూడోసారి అయితే లక్ష రూపాయలతో పాటు ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తారు. డ్రగ్స్ కేసులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ముచ్చెమటలు పట్టించిన అకున్ సబర్వాల్ చేతిలో ఈ తూనికల కొలతల శాఖ వుంది. ఆయన ప్రతి జిల్లాకు ఈమేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పఏదైనా థియేటర్లో ఎమ్మార్ఫీ ధర కంటే ఎక్కువకు విక్రయిస్తున్నారని ప్రేక్షకుల దృష్టికి వస్తే…

టోల్‌ ఫ్రీ నంబర్‌ 180042500333 కి కాల్ చేసి, లేదా 7330774444 నంబర్ కు వాట్సాప్‌ చేసి కంప్లయిట్ ఇవ్వవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.