జి.ఎస్.టి.బిల్లుకి రాజ్యసభ ఆమోదముద్ర వేయడంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్ధిక సంవత్సరం నుంచి ఆ ఏకీకృత పన్ను విధానం అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్రఆర్ధికశాఖ శరవేగంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. కీలకమైన ఆ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదముద్ర లాంచనప్రాయమే. కానీ దేశంలో కనీసం సగం రాష్ట్రాలు ఆ బిల్లుని అమలుచేయడానికి సిద్దంగా ఉన్నామని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి సమర్పించవలసి ఉంటుంది. వాటి ఆధారంగా రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేస్తారు. కనుక ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే భాజపా పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అందరికీ దీని కోసం లేఖలు వ్రాశారు.
ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రులు ఇద్దరికీ కూడా లేఖలు వ్రాసారు. వీలైనంత త్వరగా ఆ బిల్లుకి మద్దతు తెలుపుతూ శాసనసభలో తీర్మానాలు చేసి పంపవలసిందిగా జైట్లీ తన లేఖలో కోరారు. అందుకోసం అవసరమైతే శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించవలసిందిగా కోరారు. జి.ఎస్.టి.బిల్లుకి తెదేపా, తెరాస రెండు పార్టీలు పూర్తి మద్దతు ఇచ్చాయి కనుక, శాసనసభలో దానికి మద్దతుగా తీర్మానాలు చేసి పంపడానికి వాటికేమీ అభ్యంతరాలు ఉండవనే భావించవచ్చు. కానీ జైట్లీ కోరినట్లుగా దీనికోసం ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు నిర్వహిస్తారా లేదా షెడ్యూల్ ప్రకారమే సమావేశాలు నిర్వహిస్తారా? అనేది చిన్న సస్పెన్స్.
దేశంలో ఈ ఏకీకృత పన్ను విధానం అమలులోకి వస్తే వస్తువుల ధరలు తగ్గుతాయని, దాని వలన సామాన్య ప్రజలకి చాల మేలు కలుగుతుందని మోడీ ప్రభుత్వం ఘంటాపధంగా చెపుతోంది. కానీ అది కార్పోరేట్ కంపెనీలకి మాత్రమే మేలు కలుగుటుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. వాటి వాదనలలో నిజానిజాలు ఏమిటో ఆ నూతన పన్ను విధానం అమలులోకి వచ్చిన తరువాతే క్రమంగా బయటపడుతుంది. అంతవరకు అందరూ ఓపికగా ఎదురు చూడవలసిందే!