పవన్ ఎక్కడ్నుంచి పోటీ చేయాలో కూడా స్క్రీనింగ్ కమిటీనే చెబుతుందా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలన్నదానిపై.. పార్టీ తరపున ఓ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రాంతీయపార్టీల్లో సహజంగా ఇలాంటి స్క్రీనింగ్ కమిటీలు ఉండవు. అధ్యక్షుడే.. అన్ని రకాల సర్వేలు, నివేదికలు తెప్పించుకుని పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకుని.. క్యాడర్‌ మనోభావాలు, ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని .. అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు. అభ్యర్థుల వడపోతకు..ఓ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. సీనియర్ నేత మాదాసు గంగాధరం నేతృత్వంలో ఈ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. పార్టీ తరపున పోటీ చేయాలనుకునే ఎవరైనా… ఈ స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

పవన్ కల్యాణ్ తాను కూడా స్వయంగా.. ఓ దరఖాస్తును వారికి ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్లు కమిటీ ద్వారానే ఎంపికవుతాయని… జనసేన టికెట్ల కేటాయింపులో స్క్రీనింగ్ కమిటీదే తుది నిర్ణయమని పవన్ కల్యాణ్ తన దరఖాస్తు ద్వారా తేల్చి చెప్పినట్లయింది. ఇప్పటికే..అనేక మంది… జనసేన నేతలు.. పలు నియోజకవర్గాల్లో తామే అభ్యర్థులంటూ.. ప్రచారం చేసుకుంటూ ఉండటంతో… కొన్ని చిక్కులు వస్తున్నాయి. అలాంటి పరిస్థితి రాకుండా.. దరఖాస్తుల పద్దతి ప్రవేశపెట్టారు. అయితే పవన్ కల్యాణ్ .. మొదటి దరఖాస్తు ఇచ్చినా.. ఎక్కడ నుంచి పోటీ చేయాలనే ఆసక్తి ఉందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

పవన్ తాను పోటీ చేస్తాను.. టిక్కెట్ ఖరారు చేయమని మాత్రమే దరఖాస్తు చేసారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని మాత్రం.. స్క్రీనింగ్ కమిటీకే పవన్ వదిలేశారా..? అన్న చర్చ జనసేనలో ప్రారంభమయింది. మిగతా నేతలు.. కూడా… నియోజకవర్గాల పేర్లు చెప్పకుండా.. తాము కూడా పోటీ చేస్తామని.. మంచి నియోజకవర్గం చూసి పెట్టమని.. స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తులు చేస్తారేమోననే సందేహం ఆ పార్టీలో ప్రారంభమయింది. అదే సమయంలో.. పవన్ కల్యాణ్.. గతంలో ఒకరికి టిక్కెట్ ప్రకటించారు. ముమ్మడివరం నియోజకవర్గం నుంచి పితాని బాలకృష్ణ అనే నేతకు.. టిక్కెట్ ప్రకటించారు. మరి ఆయన కూడా దరఖాస్తు చేసుకోవాలా.. అనే సందిగ్ధంలో పడిపోయారు. పవన్‌కే టిక్కెట్ స్క్రీనింగ్ కమిటీ ఇస్తూంటే… పవన్‌.. పితాని బలకృష్ణకు టిక్కెట్ ఎలా ఇస్తారని.. ముమ్మిడివరంలో ఇతర జనసేన నేతలు తమను తాము ప్రశ్నించుకుని దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com