న‌వ‌రంధ్రాల్లో మైనం పెట్టా…

నీ న‌వ‌రంధ్రాల్లో మైనం పెట్టా.. ఇదొక తిట్టు. వీర వెంక‌ట శివ‌ సుబ్ర‌హ్మ‌ణ్య‌ శాస్త్రి హాస్యంలో తెచ్చిన కొత్త ఒర‌వ‌డిది. హాస్యం పేరుతో ఆయ‌నెవ‌ర్నీ అప‌హాస్యం చేయ‌లేదు. అలాగ‌ని రాజీ కూడా ప‌డ‌లేదు. జంధ్యాల‌గా హాస్య ప్రేమికుల మ‌న‌స్సుల్లో గూడు క‌ట్టుకున్న ఆ మ‌హామ‌నీషి సృష్టించిన హాస్యం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. వేట‌గాడు చిత్రంలో ప్రాస‌ల‌తో ప్రారంభ‌మైన ఆయ‌న సంభాష‌ణా వైదుష్యంలో ఆఖ‌రు చిత్రం వ‌ర‌కూ ప‌దును త‌గ్గ‌లేదు…అంత‌కంత‌కూ పెరిగింది త‌ప్ప‌. చరిత్ర ద‌గ్గ‌ర్నుంచి పురాణాల వ‌ర‌కూ, సైన్సు నుంచి గ‌ణితం వ‌ర‌కూ ఏ అంశాన్నీ ఆయ‌న విడిచిపెట్ట‌లేదు. ఆఖ‌రుకు వంట‌లతో పాటు మ‌నుషుల నైజాల‌తో కూడా న‌వ్వుల పువ్వులు పూయించారు.

అశుద్ధ భ‌క్ష‌కా.. మొజాయిక్ నేల‌మీద ఆవాలు వేసి మొక్క‌లు మొలవాల‌నే మొహం, మండుటెండ‌లో ర‌గ్గు క‌ప్పుకుని ప‌డుకునే మొహం, అప్రాచ్య‌పు వెధ‌వా, ప‌ర‌మ బోరింగ్ మొహం.. ఇలా ఎన్న‌ని చెప్పం.. క‌విని కాన‌న్న వాణ్ణి అంటూ శ్రీ‌లక్ష్మి నోట ప‌లికించిన క‌విత‌… ఇలా ఎన్న‌ని చెప్పం.. ఆయ‌న తిట్లను. దీనికి తోడు ఆయ‌న సృష్టించిన పాత్ర‌లు అనంతం. పాత్ర‌ధారులూ అనంత‌మే. ఒక శ్రీ‌వారికి ప్రేమ లేఖ చిత్రాన్నే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటే వంట‌లు, సినిమా క‌థ‌లు నేమ్ నుంచి శుభం కార్డు దాకా చెప్ప‌డం, చ‌రిత్ర‌, పేకాట‌, సారా, ఎదుటి వ్య‌క్తి జుట్టు మీద మొక్కు, కోపం వ‌స్తే గోడకేసి త‌ల‌కొట్టుకోవ‌డం, కోపం వ‌స్తే న‌వ్వ‌డం, మ‌తిమ‌రుపు మ‌నిషి అంశాల‌తో ఆయ‌న చ‌తుర సంభాష‌ణ ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించింది. సీరియ‌స్ సినిమాని ఆద్యంతం హాస్య గుళిక‌ల‌తో న‌డిపించారు. అందుకు చంటబ్బాయి ఉదాహ‌ర‌ణ‌. చిరంజీవిని ఫుల్ లెంగ్త్ కామెడీ యాక్ట‌ర్‌గా చూపారిందులో. అహ నా పెళ్ళంట చిత్రంలో అర‌గుండు పేరుతో బ్ర‌హ్మానందమ‌నే క్యారెక్ట‌ర్ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశారు. ప్రాధాన్య‌త లేని న‌టుల్ని సైతం హీరోలుగా మార్చిన ఖ్యాతి జంధ్యాల‌ది.

ఆయ‌న సృష్టించిన పాత్ర‌లు.. సంభాష‌ణ‌లు న‌టుల‌కు అన్నం పెట్టాయి. వారి పురోభివృద్ధికి బాట‌లు వేశాయి. ఇప్పుడు కొంద‌రు న‌టులు హాస్య పాత్ర‌ల‌తో మెరుపులు మెరిపిస్తుండ‌డానికి అస‌లైన కార‌ణం జంధ్యాల‌. కుప్పిగంతులు.. అశ్లీల పాట‌ల న‌డుమ మ‌న‌సును ఉల్లాస‌ప‌రిచేలా చేస్తున్న‌ది హాస్యం. ఇప్పుడైతే హాస్యానికి అర్థ‌మే మారిపోయింది. శృంగారం, డ‌బుల్ మీనింగ్ డైలాగులే హాస్యంగా చెలామ‌ణీలోకి వ‌చ్చేశాయి. అవి లేకుండా సినిమా చూడ‌లేని స్థాయికి అత్య‌ధిక శాతం ప్రేక్ష‌కులు కూడా వ‌చ్చేశారంటే స‌మాజాన్ని ఎంత భ్ర‌ష్టు ప‌ట్టించేశారో చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

జంధ్యాల సినిమాల‌లో ఎక్క‌డా డ‌బుల్ మీనింగ్ డైలాగ్ క‌నిపించేది కాదు. ఒక వేళ ప‌ద ప్ర‌యోగం అలా ఉన్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు అలా ఆలోచించేవారు కూడా కాదు. సంద‌ర్భోచితంగా సున్నిత‌మైన హాస్యాన్ని రంగ‌రించి, సినిమాకొచ్చిన ప్రేక్ష‌కుణ్ణి క‌డుపుబ్బా న‌వ్వ‌గా వ‌చ్చిన క‌న్నీళ్ళ‌తో ఇంటికి పంపేవారు జంధ్యాల‌. గుండెలు మార్చ‌బ‌డును నాటిక‌తో ప్రారంభ‌మైన ఆయ‌న హాస్య సంభాష‌ణ ప్ర‌స్థానం జూన్ 19, 2001న ఆగిపోయింది. ఆయ‌న పుట్టింది 1951లో సంక్రాంతినాడు. న‌వ్వులను ఇంటికి తెచ్చే పండుగ‌నాడు పుట్టిన ఆయ‌న అన్ని ఇళ్ళ‌కూ న‌వ్వుల‌ను పంచారు.

అలాంటి జంధ్యాల‌ను ఎవ‌రైనా ఏమైనా అంటే వారే న‌వ్వుల‌పాలైపోతార‌ని తెలుసుకుంటే మేలు. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు పేరుతో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మంలో జంధ్యాల‌పై అసంద‌ర్భ వ్యాఖ్య‌లు చేసి చిరంజీవి, బ్రంహ్మానందం న‌వ్వుల పాలైపోయారు త‌ప్ప‌…. జంధ్యాలకు వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేదు. జంధ్యాల గొప్ప‌ద‌నాన్ని ఈ సంద‌ర్భంగా ఆ ఇద్ద‌రు న‌టుల‌కు గుర్తు చేయాల‌నిపించింది. అంతే…

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.