టైటిల్ మాత్ర‌మే క్లాస్‌.. లోప‌ల‌దంతా మాస్‌


మాస్ ప‌ల్స్ ప‌ట్టుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. రెండు ఫైట్లు, నాలుగు డైలాగులు చెప్పేస్తే.. మాస్‌కి చేరువైన‌ట్టు కాదు. ఎమోష‌న్స్‌తో క‌నెక్ట్ అవ్వాలి. ఈ విష‌యంలో బోయ‌పాటి శ్రీ‌ను మార్క్ ప్ర‌త్యేకం. ద‌మ్మున్న హీరోయిజం, దాని చుట్టూ క‌థ‌, మాస్‌తో ఈల కొట్టించేలా స‌న్నివేశాల్ని తీర్చిదిద్ద‌డం – ఇదీ.. బోయ‌పాటి స్టైల్‌! దాంతోనే విజ‌యాల్ని అందుకొంటున్నాడు. జ‌య జాన‌కీ నాయ‌క కూడా ఇదే మీట‌ర్‌లో సాగే సినిమాలా అనిపిస్తోంది. ట్రైల‌ర్ చూస్తే.. బెల్లంకొండ శ్రీ‌నివాస్‌లోని మాస్ కోణాన్ని 360 డిగ్రీస్‌లోనూ చూపించే ప్ర‌య‌త్నం చేశాడు బోయ‌పాటి. బెల్లం కొండ కూడా… బోయ‌పాటి స్టైల్‌కి త‌గ్గ‌ట్టుగా మారిపోయాడు. యాక్ష‌న్ ఎపిసోడ్లు, డైలాగులు, బిల్డ‌ప్పులు… ఇవ‌న్నీచూస్తే బోయ‌పాటి నుంచి మ‌రో ప‌క్కా మాస్ అండ్ యాక్ష‌న్ సినిమా వ‌స్తున్న‌ట్టు అనిపిస్తోంది. టైటిల్‌, హీరో ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే – బోయ‌పాటి త‌న బ్రాండ్ ఏమైనా ఛేంజ్ చేశాడా అనే అనుమానం వేసింది. కాక‌పోతే… టైటిల్ మాత్ర‌మే క్లాస్‌.. లోప‌ల‌దంతా మాస్‌… అన్న‌ట్టు టీజ‌ర్‌ని క‌ట్ చేశాడు బోయ‌పాటి. త‌న నుంచి ఏమైతే ఆశిస్తారో.. అవ‌న్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్న‌ట్టున్నాయి. కాక‌పోతే.. బోయ‌పాటి మార్క్ నుంచి బెల్లం కొండ శ్రీ‌ను బ‌య‌ట ప‌డ‌డం కాస్త క‌ష్ట‌మే. రాబోయే రెండు మూడు సినిమాల విష‌యంలో బెల్లం కొండ కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. ఈనెల 11న ముచ్చ‌ట‌గా మూడు సినిమాలు రాబోతున్నాయి. మిగిలిన వాటికి… జ‌య జాన‌కీ నాయ‌క‌.. స‌వాల్ విసిరేలానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com