కమెడియన్లు హీరోలైతే… కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అది తప్ప… అన్నీ ఇవ్వాలని చూస్తుంటారు వాళ్లు. సునీల్ అలా చేసే తప్పులో కాలేశాడు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి కూడా హీరో అయ్యాడు. గీతాంజలిలో తానే హీరో అయినా… కథంతా అంజలి చుట్టూ తిరిగింది. ఈసారి మాత్రం నిజం హీరో అనిపించుకొంటూ – జయమ్ము నిశ్చయమ్మురా తీశాడు. ట్రైలర్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే.. దర్శకుడు ఓ కథ చెప్పే ప్రయత్నం చేసినట్టు అర్థమవుతుంది. కరీంనగర్ అబ్బాయి.. ఊరికీ, అమ్మకి దూరంగా కాకినాడ వస్తాడు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం. మూడు నెలల్లో ట్రన్స్ఫర్ చేయించుకొని మళ్లీ అమ్మ దగ్గర వాలిపోవాలనుకొంటాడు. అయితే కాకినాడలో అతనికి ఎదురైన పరిస్థితులు, తన ప్రేమకథ అతని జీవితాన్ని ఏ మలుపు తిప్పాయన్నది ఈ సినిమా కథ. ట్రైలర్లో శ్రీనివాసరెడ్డి ఏం కామెడీ చేయలేదు గానీ.. ప్రవీణ్, కృష్ణభగవాన్, పోసాని మాత్రం కామెడీ పండించే ప్రయత్నం చేశారు.
వినోదం కంటే.. భావోద్వేగాలు కీలకంగా మారిన కథ ఇది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. ఓసారిటు చూడే.. పాట వినసొంపుగా చెవులకు తాకుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మ విశ్వాసానికీ, అంథ విశ్వాసానికీ మధ్య జరిగే పోరు ఇది. కథానాయకుడికి జాతకాల పిచ్చి. బాగా నెమ్మదస్తుడు. తనలో ఆత్మవిశ్వాసం ఎలా పెరిగింది, జాతకాల పిచ్చి ఎలా పోయిందన్న పాయింట్ అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం చేశారు. తూ.గో జిల్లా వేష భాషలు, అక్కడి లొకేషన్లు ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఈనెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ట్రైలర్, ఆడియో వరకూ బాగానే ఉన్న ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.