అదీ సాక్షి అంటే..! ఏదైనా లోకేష్ లింక్ రావాల్సిందే..!

ఎన్నారై పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో.. గత వారం రోజులుగా.. కలకలం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. రాకేష్ రెడ్డి అనే వ్యక్తి లీలలు బయటకు వస్తున్నాయి. కథలు.. కథలుగా చెప్పుకుంటున్నారు. కానీ సాక్షి, వైసీపీ అభిమానుల్లో మాత్రం ఓ వెలితి ఉండిపోయింది. ఇలాంటి ఘటనలు ఏమి జరిగినా.. ముందుగా.. అందులో టీడీపీ కోణం వెలికి తీస్తుంది సాక్షి. ఇప్పటి వరకూ.. అలాంటిదేమీ ప్రకటించకపోవడమే… ఆ వెలితి. కానీ నేటితో ఆ వెలితిని తీర్చేశారు. ఆ రాకేష్ రెడ్డి.. చిన్నబాబుకు సన్నిహిడేనట.. అని ఓ కథనం ప్రచురించేశారు. అయితే.. ఇద్దరూ ఎలా సన్నిహితమయ్యారో చెప్పలేదు. కలిసి “స్టాన్ ఫర్డ్‌”లో చదువుకున్నారో.. లేక.. లోకేష్ కి అనుచరుడిగా టీడీపీలో ఎదిగారో మాత్రం క్లారిటీ లేదు. కానీ.. చినబాబుకి మాత్రం సన్నిహితుడేనని తీర్పిచ్చారు.

రాకేష్ రెడ్డి… కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అనుచరుడిగా తిరిగారు. ఆయన పేరు చెప్పుకుని దందాలు చేశారు. మొన్న ఎన్నికల్లో వివేక్… టీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ.. అంతకు ముందు టీడీపీ తరపున గెలిచారు. అలా.. టీడీపీ కార్యకర్త అయిన రాకేష్ రెడ్డికి… నేరుగా లోకేష్‌తో లింక్ చేసేసింది సాక్షి ఎడిటోరియల్ స్టాఫ్. మనం..మనం బరంపురం అన్నట్లు.. వాళ్లు .. వాళ్లు టీడీపీనే కదా.. లోకేష్‌కి సన్నిహితుడేనని తీర్పు ఇచ్చేద్దామనుకుంటే.. అదే కథనంలో రాకేష్ రెడ్డికి.. తెలంగాణ అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని రాసుకొచ్చారు. పెద్దగా లాజిక్కులు లేకుండా.. పూర్తిగా సాక్షి మైండ్‌తో చదివితే.. లోకేష్ లింక్.. ఈ పత్రికలో స్పష్టంగానే తెలిసిపోతుంది.

చినబాబుతో సాన్నిహిత్యం వల్లే హైదరాబాద్ విమానాశ్రయంలో రాచమర్యాదలు… రాకేష్‌కి లభించాయట..!. దీన్ని ప్రత్యేకంగా బాక్స్ కట్టి మరీ సాక్షి ప్రచురించింది. ఏపీ ప్రభుత్వానికి విమానాశ్రయాల మీద ఇంత పట్టు ఉందన్న మాట. ఇక తిరుమలలో ఎల్-వన్ దర్శనం రాకేష్ చెబితే ఈజీనేననట. ఇది కూడ.. చినబాబుతో రాకేష్ రెడ్డి సాన్నిహిత్యానికి… ఓ సాక్ష్యంగా సాక్షి చెప్పుకొచ్చింది. ఎల్-1 దర్శనం ఎలా వస్తుందో… తిరుమలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ తెలుసు. దానికి లోకేష్ సాన్నిహిత్యం అవసరం లేదు. ఏదైతేనేం… జయరాం హత్య లాంటి సంచలన కేసులో.. ఏదో ఒకటి.. టీడీపీ లింక్ పెట్టకపోతే.. అది సాక్షి ఎందుకు అవుతుంది..? ఆ ఎడిటోరియల్ స్టాఫ్.. విశ్వాసంగా పని చేసిన వాళ్లు ఎందుకవుతారు..?. ఎట్టకేలకు వాళ్లు తమ వృత్తి నైపుణ్యను నిరూపించుకున్నారు..! . కొసమెరుపేమిటంటే.. ఈ వార్తను.. తెలంగాణ ఎడిషన్లో మాత్రమే ఉంచారు. మరి ఏపీ ఎడిషన్లో ఎందుకు స్కిప్ చేశారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]