బాబుపై పువ్వులు.. జ‌గ‌న్ పై రాళ్లు వేసిన‌ జేసీ!

ఆయ‌న‌కు ఆగ్ర‌హం వ‌చ్చినా అనుగ్ర‌హం వ‌చ్చినా త‌ట్టుకోవ‌డం క‌ష్టం! ఆయ‌నేనండీ.. అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌నితీరును ఆకాశానికి ఎత్తేసినా, అమాంతంగా కింద‌కు ప‌డేసినా.. రెండూ ఆయ‌న‌కే సాధ్యం. ఈ మ‌ధ్య‌నే తాను రాజీనామా చేసేస్తా అంటూ హ‌డావుడి చేసిన సంగ‌తి తెలిసిందే. సొంత జిల్లాకు నీళ్లు తెప్పించ‌లేక‌పోతున్నాన‌నే ఆవేద‌న‌తో రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా అని ప్ర‌క‌టించారు! స‌రిగ్గా, ఇర‌వై నాలుగు గంట‌ల్లో ఆ జిల్లాకు నీరు విడుద‌ల చేయాలంటూ స‌ర్కారు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీలో త‌న ఉనికిని చాటి చెప్పుకోవ‌డం కోస‌మే ఇలా చేశార‌నే వాద‌న ఉంది. అయితే, తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం ఎప్ప‌టికప్పుడు ఢిల్లీకి వెళ్తూ, ప‌ట్టుద‌ల‌తో దాన్ని పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు అని జేసీ మెచ్చుకున్నారు. ఈ ముఖ్య‌మంత్రిని తాను మ‌న‌సా వాచా న‌మ్ముతున్నాను అన్నారు. నీటి విష‌యంలో మాత్రం ఈయ‌న‌కు సాటిగ‌ల నాయ‌కుడు రాబోయే రోజుల్లో రార‌నీ, గ‌తంలో లేర‌ని కూడా జేసీ చెప్పారు! తాగ‌టానికి నీళ్లు, తిన‌డానికి అన్నం లేని ప్రాంత‌మైన అనంత‌పురం జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేశార‌న్నారు. ఇబ్బందుల‌న్నీ అధిగ‌మించి త‌మ‌కు నీళ్లు ఇస్తున్నార‌నీ, అందుకు జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌ఫున‌ అభినంద‌న‌లు తెలుపుతున్నా అన్నారు. ఇదే సంద‌ర్భంలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ గురించి కూడా జేసీ మాట్లాడారు..!

ఈరోజు రాష్ట్రంలో ఒక విచార‌క‌ర‌మైన సంఘ‌ట‌న త‌న దృష్టికి వ‌స్తోంద‌న్నారు. ‘మా వాడు. మావాడు అంటే ఎవ‌రు..? జ‌గన్‌.. తెల్ల‌వారి లేచిన‌ప్ప‌టి నుంచి ముఖ్య‌మంత్రి అయితి అయితి అయిపోయినా అనే నాశ‌నం అయిపోతున్నాడు’ అంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి కొన్ని ఓట్లు సంపాదించుకుంటార‌ని అనుకున్నా కొంత త‌ప్పులేద‌నీ, కానీ జ‌గ‌న్ కు నిజంగానే పోయేకాలం వ‌చ్చింద‌న్నారు. అనంత‌పురానికి నీళ్లు ఇస్తుంటే జ‌గ‌న్ చూసి ఓర్వ‌లేక‌పోతున్నారు అన్నారు. రాయ‌ల‌సీమ‌కు నీళ్లెలా ఇస్తార‌నీ, ప‌ల్నాడుకు ఇవ్వాల‌ని మాట్లాడుతున్నార‌న్నారు. అంబ‌టి రాంబాబుతో ఈ డిమాండ్ ను తెర‌మీదికి జ‌గ‌న్ తెస్తున్నార‌న్నారు. ఓట్ల కోసం నువ్వు పుట్టిన ప్రాంతానికి అన్యాయం చేయ‌డం స‌రైందా అంటూ మండిప‌డ్డారు. ప‌ల్నాడుపై జ‌గ‌న్ కు ప్రేమ లేదు వంకాయ లేదూ, కేవ‌లం నాలుగు ఓట్ల కోస‌మే ప్ర‌య‌త్నం చేయ‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌ని అన్నారు. ఓప‌క్క చంద్ర‌బాబును పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. అదే త‌రుణంలో జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. మావాడు మావాడు అంటూనే జ‌గ‌న్ పై పంచ్ లు వేసేశారు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.