చంద్ర‌బాబును మ‌రోసారి మాట‌ల్తో ఇరికించిన జేసీ!

తెలుగుదేశంలో ఆయ‌న రూటే స‌ప‌రేటు! సొంతం పార్టీకే కౌంట‌ర్లు ఇవ్వ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. ఆయ‌న అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అని ఈపాటికి అర్థ‌మైపోయే ఉంటుంది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లో నిల‌వ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని కూడా ఇరికించేస్తుంటారు. ఏరువాక పౌర్ణ‌మి కార్య‌క్ర‌మంలో ఇలానే కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గంలో ఈ కార్య‌క్రమం జ‌రిగింది. దీనికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా జేసీ దివాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ… పోల‌వ‌రం ప్రాజెక్టును వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చెయ్యాల‌ని ముఖ్య‌మంత్రిని కోరారు. ఆ మాటేదో మామూలుగా చెప్పి ఉంటే ఒక లెక్క‌. దాని ముందు మాటేంటంటే… అమ‌రావ‌తితో త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని, పోల‌వ‌ర‌మే త‌మ‌కు ముఖ్య‌మని చెప్ప‌డం! చంద్ర‌బాబు నాయుడు మీద ఆ భ‌గ‌వంతుడు కూడా క‌క్ష క‌ట్టిన‌ట్టున్నాడ‌ని, అన్ని వైపుల నుంచీ సీఎంకు సాయం అందడం లేద‌ని వాపోయారు. రైతులు క‌ష్టాల్లో ఉన్నార‌నీ, ద‌ళారుల వ‌ల్ల మోస‌పోతున్నార‌నీ, పండించిన పంట‌కు స‌రైన గిట్టుబాటు ధ‌ర ద‌క్క‌డం లేద‌ని జేసీ ఈ సంద‌ర్బంగా చెప్ప‌డం విశేషం. దీంతో అదే స‌భ‌లో ఉన్న ముఖ్య‌మంత్రి మ‌రోసారి అవాక్క‌వ్వాల్సి వ‌చ్చింది. తెలుగుదేశం ప్ర‌భుత్వం హ‌యాంలో రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు ల‌భించ‌డం లేద‌ని సూటిగా జేసీ చెప్పిన‌ట్టే క‌దా!

నిజానికి, ఇదే పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి గ‌తంలో జేసీ ఇంకోలా మాట్లాడారు! 2018 నాటికి ఎట్టి ప‌రిస్థితిల్లోనూ పోల‌వ‌రం పూర్తి చేస్తామ‌ని చంద్ర‌బాబు అంటుంటే.. అబ్బే, అది సాధ్యం కాని ప‌నీ, 2020కి కూడా పూర్తి కాద‌నీ, అద‌నంగా మారో నాలుగైదేళ్లు స‌మ‌యం కావాల్సి ఉంటుంద‌ని అన్నారు. ఇప్పుడేమో త‌మ‌కు పోల‌వ‌ర‌మే ముఖ్య‌మంటున్నారు! ఇక‌, రాజ‌ధాని విష‌యానికొస్తే.. త‌మ‌కు అవ‌స‌రం లేద‌న్న‌ట్టుగా మాట్లాడుతున్నారు. త‌మ‌కు అంటే.. రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కు అన్న‌ట్టు అర్థం వ‌చ్చేలా ఆయ‌న మాట్లాడార‌ని అనుకోవ‌చ్చా..! ఓ రెండు నెల‌ల కింద‌ట ఇదే అమ‌రావ‌తి గురించి మాట్లాడుతూ… రాజ‌ధాని అభివృద్ధి విష‌యంలో ముఖ్య‌మంత్రికి, మంత్రి నారాయ‌ణ‌కు అవ‌గాహ‌న లేద‌ని కామెంట్ చేశారు.

ఇంత‌కీ.. జేసీ ప్ర‌స్తుతం చేసిన కామెంట్స్ య‌థాలాపంగానే చేశారా, లేదా ఏదైనా బ్యాక్ మైండ్ లో ఉండి వ్యాఖ్యానించారా అని అంటే.. ఉండే ఉంటుంద‌ని కొంత‌మంది అనుమానిస్తున్నారు. బంజారాహిల్స్ భూముల అక్ర‌మాల‌కు సంబంధించి జేసీ మేన‌ల్లుడిని తెలంగాణ ప్ర‌భుత్వం అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ వ్య‌వ‌హారంలో కాస్త హెల్ప్ చేయాలంటూ చంద్ర‌బాబును జేసీ కోరే ప్ర‌య‌త్నం చేశార‌ట‌. జేసీకి సీఎం అపాయింట్మెంట్ కూడా దొర‌క‌లేద‌ట అంటూ కొన్ని క‌థ‌నాలు వినిపించాయి. మ‌రి, ఆ అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకునే ఇలా సీఎంను ఇరుకున పెట్టే విధంగా మాట్లాడి ఉంటార‌ని భావించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.