చంద్రబాబుకు వీరతాళ్లు – మోదీ, జగన్‌లకు సవాళ్లు..‍‍! మహానాడులో జేసీ బోల్డ్ స్పీచ్..!!

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మామూలుగా మీడియాతో మాట్లాడితే హాట్ టాపిక్ అవుతుంది. చాలా నిజాలను ఆయన నిక్కచ్చిగా చెప్పేస్తారు. ఎవరేమనుకుంటారోనని ఆయన అనుకోరు. ఇక మహానాడులో మాట్లాడే అవకాశం వస్తే ఊరుకుంటారా..?. అదే చేశారు.. తన మార్క్ బోల్డ్ స్పీచ్‌తో అదరగొట్టేశారు. చంద్రబాబుకు వీరతాళ్లు వేశారు. మోదీ, జగన్‌లపై ఘాటుగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జగన్ పై ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మోదీ, జగన్‌ల ఎన్నికల ఒప్పందం కుదిరిందని… ఢిల్లీ నుంచి జగన్‌కు రూ. 1500 కోట్లు వస్తున్నాయని చెప్పారు. తనను వైసీపీలోకి ఆహ్వానించి డబ్బులడిగారని.. జేసీ బయటపెట్టారు. నేను ఎందుకు కప్పం కట్టాలని విజయసాయిరెడ్డిని ప్రశ్నించానన్నారు. జగన్‌ దగ్గర ఊడిగం చేయలేక వైసీపీలోకి వెళ్లలేదని తేల్చి చెప్పేశారు. ప్రత్యర్థులపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్కెచ్ వేస్తే.. రాజారెడ్డి అమలు చేసేవారని.. వైఎస్‌ను మంత్రిని చేసేందుకు రాజారెడ్డి చేయని పనులు లేవన్నారు. జగన్‌లో రాజారెడ్డి క్రూరత్వం ఉందని జేసీ విశ్లేషించారు. చంపాలి, కొయ్యాలి, నరకాలని జగన్ మాట్లాడతారని.. వీళ్లు చేసిన పనుల వల్ల రెడ్లపై ప్రజల్లో అసహనం పెరిగిందని జేసీ విమర్శలు గుప్పించారు.

జగన్‌ను ఎంత తీవ్రంగా విమర్శించారో. చంద్రబాబును అంతగాఆ ఆకాశానికెత్తారు జేసీ దివాకర్ రెడ్డి. చంద్రబాబు ప్రధాని పదవి వద్దనకూడదన్నారు. లోకేష్ సీఎం అయితే తప్పే లేదన్నారు. ఒకే పని కోసం 29సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగిన సీఎం ఎవరూ లేరని.. ఢిల్లీ సాయం కోసం అంతగా ప్రయత్నించారన్నారు. పోలవరం కోసం ప్రోటోకాల్ ను కూడా పక్కన పెట్టి సీఎం గడ్కరీ ఇంటికి వెళ్లారని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి..ఏపీ సౌభ్యాగ్యంగా ఉండాలని చంద్రబాబు ఆశ పడతారన్నారు. కియాను గుజరాత్‌లో పెట్టాలంటూ ప్రధాని ఒత్తిడి తెచ్చారని… కియా ప్రతినిధులకు ప్రధాని ఐదుసార్లు ఫోన్‌ చేశారని జేసీ ప్రకటించి కలకలం రేపారు. చంద్రబాబు పాలనా విధానాల వల్ల అనంతపురంలో రైతులు ఎకరాకు లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నారని జేసీ సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న.. అనంతపురం జిల్లా కోనసీమగా మారిందన్నారు. బ్రహ్మసముద్రం ప్రాజెక్టు పూర్తయితే కోనసీమను కూడా మించిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే అనంత జిల్లాకు వచ్చి చూడాలని సవాల్ చేశారు. కియా వచ్చాక అనంత జిల్లా రూపురేఖలు మారిపోయాయనన్నారు.

అన్నీ చెప్పిన జేసీ.. చంద్రబాబుకు కొన్ని సూచనలు కూడా చేశారు. చంద్రబాబు మూలవిరాట్టని… మంత్రులు, ఎమ్మెల్యేలు రమణ దీక్షితుల్లా తయారయ్యారని సెటైర్లు వేశారు. చివరిగా జగన్‌ వస్తే ఏపీకి భవిష్యత్‌ ఉండదని… చంద్రబాబు పక్కన ఎవరున్నారో.. జగన్‌ పక్కన ఎవరు ఉన్నారో చూడాలని ప్రజలకు లసలహా ఇచ్చారు జగన్‌ పక్కన పీకలు కోసే మంగలి కృష్ణ లాంటి వారుంటారన్నారు. చంద్రబాబు కోసం కాదు.. మీ కోసం, మీ పిల్లల కోసం టీడీపీకి ఓటు వేయాలని చివరిలో జేసీ పిలుపునిచ్చారు. మొత్తానికి జేసీ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు… మహానాడు మొత్తం సైలెన్స్ అయిపోయింది. అందరూ ఆసక్తిగా విన్నారు. చంద్రబాబు… కూడా ముసిముసి నవ్వులతో జేసీ ప్రసంగాన్ని ఆలకించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.