జ‌న‌సేన‌లోకి ల‌క్ష్మీ నారాయ‌ణ‌.. టార్గెట్ టీడీపీ…!

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్ వి.వి. ల‌క్ష్మీనారాయ‌ణ స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కి ఇంకా చాలా స‌ర్వీసు ఉంది క‌దా… వి.ఆర్‌.ఎస్‌. ఎందుకు అనే చ‌ర్చ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. రాజ‌కీయాల్లోకి రావ‌డ‌మే ఆయ‌న ల‌క్ష్య‌మా.. అంటే, ఇలా ఉన్న‌తోద్యోగాల‌ను వ‌దులుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌వారు చాలామంది ఉన్నారు. అలాంప్పుడు ఈయ‌న మీదే ఎందుకంత ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అంటే.. జ‌గ‌న్ కేసు, స‌త్యం కేసు, గాలి జ‌నార్థ‌న్ రెడ్డి వంటి కీల‌క కేసులు ఈయ‌న సార‌థ్యంలో వెలుగుచూసిన‌వే. ఈ కేసులు వెలుగులోకి వ‌చ్చిన స‌మ‌యంలో ఆయ‌న ఆంధ్రాలో మంచి పేరు వ‌చ్చేసింది. ఆయ‌న‌కి అభిమానులు ఉన్నారు అని చెప్పినా పెద్ద‌గా ఆశ్చ‌ర్యం లేదు. ఈ నేప‌థ్యంలో ల‌క్ష్మీనారాయ‌ణ ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్న‌ది రాజ‌కీయాల్లోకి రాక కోస‌మే అనే అభిప్రాయం కాస్త బ‌లంగానే వినిపిస్తోంది.

ఆయ‌న ల‌క్ష్యం రాజ‌కీయాలే అయితే.. ఏ పార్టీలో చేర‌తారు..? వైకాపాలో చేరే అవ‌కాశం లేదు. ఎందుకంటే, జ‌గ‌న్ కేసు డీల్ చేసింది ఆయ‌నే కాబ‌ట్టి, ఆ వ‌ర్గాల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంటుంది. పోనీ, భాజ‌పాలో చేర‌తారా అంటే.. గాలి జ‌నార్థ‌న్ కేసులో కూడా క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించారు. కాబ‌ట్టి, అక్క‌డా ఎంట్రీ ఉండ‌క‌పోవ‌చ్చు. ఇక‌, మిగిలింది టీడీపీ. ప్ర‌స్తుతం కేంద్రంతో టీడీపీ వైరం పెట్టుకోవ‌డం, రాజ‌కీయంగా టీడీపీని తొక్కేయాల‌నే వ్యూహంతో భాజ‌పా ఉండ‌టం.. ఈ ప‌రిస్థితుల‌న్నీ ఒక కొలీక్కి వ‌స్తే త‌ప్ప టీడీపీ గురించి ఆయ‌న ఆలోచించ‌క‌పోవ‌చ్చు అని కొంత‌మంది అంటున్నారు. ఇంతవరకూ వినిపిస్తున్న విశ్లేషణలు ఇవే. కానీ, వీట‌న్నింటిక‌న్నా వెలుగులోకి వస్తున్న అంశం… జ‌న‌సేన లో ఆయన చేరిక! అది కూడా భాజ‌పా ప్రోద్బ‌లంతోనే అనే గుస‌గుసలు కూడా తెర‌మీదకి వ‌స్తుండ‌టం మరీ విశేషం.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. జ‌న‌సేన‌లో కీల‌క‌ బాధ్య‌త‌లు ల‌క్ష్మీ నారాయ‌ణ తీసుకునే అవ‌కాశం ఉంది! పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పోస్టు ఆయ‌నకి ద‌క్క‌నుంద‌ని సమాచారం. ప‌వ‌న్ కు అన్ని ర‌కాలుగా సాయం చేసేందుకే ల‌క్ష్మీ నారాయ‌ణ ప‌ద‌వీ విరమ‌ణ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇంకా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం ఏంటంటే.. ఇదంతా భాజ‌పా స‌ర్కారు ప్లాన్ లో భాగ‌మే అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉండ‌టం..! ఆంధ్రాలో కాపు ఓట్ల‌ను చీల్చ‌డం ద్వారా టీడీపీని నిర్వీర్యం చెయ్యొచ్చు అనేది భాజ‌పా మ‌హావ్యూహంలో భాగమ‌నీ, ఆప‌ని చేసేందుకు ప‌వ‌న్ వెన‌క ల‌క్ష్మీ నారాయ‌ణ లాంటి వాళ్లు ఉంటే మరింత బాగుంటుంద‌నే అభిప్రాయంతోనే తెర వెన‌క ఈ క‌థ న‌డుస్తోంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కేంద్రంగానే ఈ స్కెచ్ సిద్ధ‌మైంద‌ని తెలుస్తుండ‌టం మ‌రో విశేషం! ఏపీలో జేడీగా ఆయనకి వచ్చిన పాపులారిటీని ఇలా వినియోగించుకోబోతున్నట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com