విస్తరిస్తున్న ”డాటా క్లాస్” – రిలయెన్స్ జియో టార్గెట్

రిలయెన్స్ జియో సిమ్ కార్డులకోసం భారతదేశాన్ని ఒక అంబానీ క్యూలో నిలబెట్టేశారంటే అంటే అతిశయోక్తి అనిపించ వచ్చు. కానీ, ఇంద్రజాలం లాంటి ఈ సన్నివేశం వెనుక అంబానీల అద్భుతమైన విజన్ ను కాదనలేము.

మంత్రాలకు చింతకాయలు రాలవని మనకు తెలుసు. అయితే, 1) చింతకాయలు రాలేసమయంలో అంబానీలు పెద్దగా మంత్రాలు చదువుతున్నారా? 2) లేక వారు మంత్రాలు చదువుతున్న సమయంలో చింతకాయలు రాలుతున్నాయా అనే ప్రశ్న కు రెండూ సరైన సమాధానాలే! వీరికి తెలిసినంత టైమింగ్ మరెవరికీ తెలియదు అన్నదే ఖచ్చితమైన బాటమ్ లైన్!!

”దేశంలో ఎక్కడినుంచైనా ఎక్కడికైనా పోస్టు కార్డు ఖర్చుతోనే మాట్లాడండి” అని ధీరూభాయ్ అంబానీ ఇచ్చిన పిలుపు – సిమ్ కార్డులేని CDMA (కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్) రిలయెన్స్ ఫోన్ – లో దేశమంతా మాట్లాడుతూనే వుండింది.

విస్తరిస్తున్న టెక్నాలజీని, మాట్లాడకుండా వుండలేని లేదా ఎక్కువ మాట్లాడే భారతీయుల స్వభావాన్నీ – పోటీదారులు బరిలోకే రాకుండా నిలువరించే వ్యాపారనీతికి జోడించడమే కమ్యూనికేషన్ రంగంలో అంబానీల దక్షతకు తార్కాణం! మొబైల్ ఫోన్ కనెక్టివిటీలో ప్రపంచమంతా అధునాతనమైన GSM (గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ ) ని అందిపుచ్చుకోగా పాతబడిపోయిన CDMA టెక్నాలజీతో 10 పైసలకే నిమిషం మాట్లాడుకోనిచ్చిన తెలివి అంబానీలదే!

కమ్యూనికేషన్ రంగంలో దేశ, విదేశీ భాగస్వామ్య కంపెనీలు పోటీ పడుతూండటంవల్ల వాయిస్ కాల్స్ చార్జీలు తగ్గాయి. డాటా చార్జీలు తగ్గాయి. కనెక్షన్లు పెరిగాయి. పోటీ వల్ల సర్వీసుల క్వాలిటీ కొంత పెరిగింది.

ఈ నేపధ్యంలో ”కాల్ చార్జీలే లేవు ఎంతైనా ఉచితంగా మాట్లాడుకోండి” అనేసి ముఖేష్ అంబానీ రిలయెన్స్ జియో సిమ్ కార్డుల కోసం దేశ వ్యాప్తంగా యువకుల్ని క్యూలలో నిలబెట్టేశారు.

వీరు తమకోసం మాత్రమే కాదు…అక్క చెల్లెళ్ళ కోసం, అమ్మలు, అత్తల కోసం, కొందరైతే తాతల కోసం క్యూలో వున్నారు. వీరిలో చాలా మంది ఫోన్ లో మాట్లాడటం కంటే వర్చువల్ ప్రపంచంలో రోజూ రెండు మూడు సార్లయినా తిరిగి రావడానికి అలవాటు పడిపోయారు.

యువతీ యువకులు సరే! మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో అక్షరాస్యత, లోకం పోకడలు అర్ధం చేసుకోగల ఫంక్షనల్ లిటెరసీ వున్న వారు ముఖ్యంగా నడివయసు స్త్రీలు, పెద్ద వయసు పురుషులు ఫేస్ బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియాలో కాసేపైనా తిరిగి రాకపోతే కుదరనంతగా అలవాటు పడిపోతున్నారు. డిస్కౌంట్ సేల్స్ కోసం అమెజాన్, ఫిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి ఆన్ లైన్ పోర్టల్లలో షాంపింగ్ చేస్తున్నారు. విండో షాపింగ్ చేస్తూనే వున్నారు!
ఇదంతా కూడా స్మార్ట్ ఫోన్ల నుంచే!!

ఈ ధోరణిని పసిగట్టడమే జియో రిలయెన్స్ విజయం! వీరందరికీ ఇంటర్ నెట్ కనెక్టివిటీ కోసం ”డాటా” అమ్మకమే ఆసంస్ధ వ్యాపారం!

”ఎనలాగ్” విధానంలో ఫోన్ సంభాషణకు ఎంతో డాటా స్పేస్/సైజ్ అవసరం! డిజిటల్ టెక్నాలజీ లో వాయిస్ కాల్ కు తక్కువ స్పేస్ సరిపోతుంది. ఈ సూత్రం ఆధారంగానే జియో రిలయెన్స్ ఉచిత కాల్స్ స్కీముని ప్రకటించింది. నిజానికి ఏదీ ఉచితం కాదు. వాయిస్ కాల్ స్పేస్ – డాటా నుంచి ఖర్చయిపోతూనే వుంటుంది. ఫోన్ లో డాటా కనెక్షన్ ఆఫ్ చేస్తే ఫోన్ కాల్ వెళ్ళదు…రాదు.

ఇంటర్ నెట్ కనెక్టివిటీతో స్మార్ట్ ఫోన్ వాడకంలో కొత్తగా విస్తరిస్తున్న వర్గాలకు ఉచిత కాల్స్ పెద్ద విషయమే కాదు! తక్కువ ఖర్చుతో ఎక్కువ డాటా మాత్రమే వారి ప్రధాన ప్రయోజనం!

ఉచిత ఫోన్ కాల్స్ అన్న జియో రిలయెన్స్ నినాదం దేశాన్ని క్యూలో నిలబెట్టేసింది. నిజానికి ఆ క్యూ గట్టిగా ఆశ పడుతున్నది చౌక ధరలకు డాటా మాత్రమే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com