దేశ రాజకీయాల్లో రోజుకో వింత పార్టీ పుట్టుకొస్తూ జనాలకు బోరెక్కిస్తున్న వేళ.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, సోషల్ మీడియా సెలబ్రిటీ జస్టిస్ మార్కండేయ కాట్జూ భీభత్సమైన ఐడియాతో మార్కెట్లోకి వచ్చారు. ఇటీవల ఇంటర్నెట్ను ఊపేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ కి గట్టి పోటీ ఇస్తూ.. కాట్జూ గారు ఏకంగా ఇష్క్ కరో పార్టీ ని లాంచ్ చేసేశారు. పేరు వినగానే ఇదేదో ప్రేమికుల రోజు కోసం, పార్కుల్లో తిరిగే లవర్స్ కోసం పెట్టిన రోమియో పార్టీ అనుకుంటే మీకు టోటల్ మిస్ కాన్సెప్షన్ ఉన్నట్లేనని ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. దేశంలోని పేదరికం, నిరుద్యోగాన్ని పోగొట్టడానికి ప్రజల మధ్య ఇష్క్ పెంచడమే ఈ పార్టీ ముఖ్య ఉద్దేశమట!
అయితే, పార్టీ పెట్టడం వరకు ఒక ఎత్తు అయితే.. ఈ ఇష్క్ కరో బండిని లాగడానికి ఆయన ఎంచుకున్న పిల్లర్ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. భారతదేశంలో ఉద్దండులైన నేతలు, సీనియర్ పొలిటీషియన్లు ఎందరో ఉండగా.. కాట్జూ గారు నేరుగా తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఎంపీ మహువా మొయిత్రాకు రూట్ క్లియర్ చేశారు. మహువా.. ఆ కాక్రోచ్ పార్టీ జోకర్లను వదిలేయ్, మన ఇష్క్ కరో పార్టీ లో చేరిపో.. మన అజెండా మేక్ లవ్, నాట్ వార్ అంటూ ఎక్స్ వేదికగా ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. అటు పార్లమెంట్‌లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే మహువా మొయిత్రా.. కాట్జూ గారి ప్రేమ సదస్సు లో చేరితే ఎలా ఉంటుందా అని నెటిజన్లు అప్పుడే మీమ్స్ పండించడం మొదలుపెట్టారు.
నిజానికి జస్టిస్ కాట్జూ గారికి దేశంలో ఏ రాష్ట్రంతోనూ, ఏ సమస్యతోనూ నేరుగా సంబంధం ఉండదు.. కానీ ఆయన వేలు పెట్టని అంశం అంటూ ఉండదు. ఉదయం లేచింది మొదలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి విషయంపై జ్ఞానబోధ చేస్తూ ట్వీట్లు పెట్టడం ఆయన స్టైల్. మొదట్లో ఆయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి కదా అని జనాలు కాస్త సీరియస్‌గా తీసుకుని చర్చించేవారు. కానీ రానురానూ ఆయన పెట్టే వింత వింత పోస్టులు, విశ్లేషణలు చూసి.. సార్‌కి బోర్ కొట్టినప్పుడల్లా ఇలాంటి ఐడియాలు వస్తుంటాయి అని లైట్ తీసుకోవడం ప్రారంభించారు. ఎవరూ పట్టించుకోని టైమ్‌లో సరిగ్గా ఈ ఇష్క్ కరో బాణం వదిలి మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారు.
మహువా మొయిత్రాను ఈ ఇష్క్ వ్యవహారంలోకి లాగడం ద్వారా కాట్జూ గారి ఇష్క్ కరో పార్టీ పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగానే వైరల్ అయ్యింది. మరి ఈ ప్రేమ పిలుపును అందుకుని మహువా ఏమైనా రిటన్ గిఫ్ట్ ఇస్తారేమో చూడాలి!
