అంతర్జాతీయ వేదికలపై తనదైన ముద్ర వేయడంలో డాక్టర్ కె.ఎ. పాల్ శైలే వేరు. అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ఆయన నిర్వహించిన క్రైస్తవ ప్రార్థన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గ్లోబల్ పీస్ మిషన్ అధ్యక్షుడిగా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న యుద్ధాలు ఆగిపోవాలని, శాంతి వర్ధిల్లాలని ప్రార్థన చేసేందుకు సెనేట్ సభ్యులు ఆయనకు అవకాశం కల్పించారు.
ఒకప్పుడు కె.ఎ. పాల్ అమెరికాలో పేరున్న మత ప్రచారకుడు. ఇండియాలో కూడా ఒకప్పుడు ఆయన సువార్తాసభలు పెడితే గ్రౌండ్లు సరిపోయేవి కావు. తర్వాత గ్లోబల్ పీస్ మిషన్ పెట్టి శాంతి దూతగా మారారు. ప్రపంచ దేశాధినేతలతో నేరుగా చర్చలు జరపగలిగే స్థాయి ఆయనది. లిబియా మాజీ నియంత గడాఫీ నుంచి అమెరికా మాజీ ప్రెసిడెంట్ల వరకు అందరితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. యుద్ధ మేఘాలు కమ్ముకున్న దేశాల్లో శాంతి చర్చల కోసం విమానాల్లో తిరుగుతూ ఆయన చేసిన ప్రయత్నాలు చేసేవారు.
అలాంటి పలుకుబడి ఉన్న ఆయన స్వదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత తన ఇమేజ్ను పూర్తిగా దెబ్బతీసుకున్నారg. ప్రజాశాంతి పార్టీ స్థాపించి ఆయన చేసిన విన్యాసాలు, చిత్రవిచిత్రమైన స్టేట్మెంట్లు, ముఖ్యమంత్రులపై ఆయన చేసే వ్యాఖ్యలు అన్నీ ప్రజల్లో ఆయన్ను ఎంటర్టెయినర్గా మిగిల్చాయి. ఇప్పుడీ సెనెట్ క్రైస్తవ ప్రార్థన వీడియోలను ఆయన సోషల్ మీడియాలో తన పరపతిని చాటుకోవడానికి ప్రమోట్ చేసుకుంటున్నారు.


