రివ్యూ: కాలా

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

పెళ్లి మంత్రాలు వేరు
త‌ద్దినం మంత్రాలు వేరు
సంగీత్ లో వేసే స్టెప్పులు వేరు
పాడె ముందు వేసే చిందులు వేరు
ఎక్క‌డ ఏం చేయాలో అదే చేయాలి.. ఎవ‌రితో ఎలాంటి సినిమా చేయాలో అదే తీయాలి.

పా. రంజిత్ ‘క‌బాలి’తో షాక్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. ‘మీరు చూసిన ర‌జ‌నీ వేరు.. నేను చూపించాల‌నుకున్న ర‌జ‌నీ వేరు’ అని కాస్త కంగారు పెట్టాడు. కొంత‌మందికి అది న‌చ్చింది.. చాలా మందిని త‌ల‌పోటు తెప్పించింది. మ‌రోసారి.. ర‌జ‌నీ వ‌చ్చాడు. ‘మ‌నం సినిమా చేద్దాం’ అన్నాడు. అప్పుడు రంజిత్ ఏం చేయాలి? త‌ప్పొప్పుల లిస్టు వేసుకుని ‘క‌బాలి’ ప్ల‌స్సుల‌కు బ‌లాన్ని ఇస్తూ, మైన‌స్సుల్ని తీసేస్తూ ఓ బ‌ల‌మైన క‌థ త‌యారు చేయాలి. మ‌రి అదంతా చేశాడా? లేదంటే ‘మీరు చూసిన ర‌జ‌నీ వేరు.. నేను చూపించాల‌నుకున్న ర‌జ‌నీ వేరు’ అంటూ పాత పాటే పాడాడా? రెండో ఛాన్సులో అయినా ర‌జ‌నీ అభిమానులు కాల‌ర్ ఎత్తుకునే సినిమా తీశాడా?

క‌థ‌

ముంబైలోని ధారావి అనే మురికివాడ‌కు పెద్ద‌దిక్కు కాలా అనే క‌రికాలుడు (ర‌జ‌నీకాంత్‌). ఆ వాడ‌ని గేటెడ్ క‌మ్యునిటీ చేస్తాం. మీ జీవితాల్ని బాగు చేస్తాం అని చాలామంది వ‌స్తారు, వెళ్లిపోతారు. వాళ్లెవ్వ‌రూ కాలా ముందు నిల‌వ‌లేరు. కానీ.. హ‌రి దాదా (నానా ప‌టేక‌ర్‌) అలా కాదు. ఆ దారావిలోనే పెరిగి పెద్ద‌వాడై… విష‌పు ఆలోచ‌న‌ల‌తో.. ఎదిగిన‌వాడు. రాజ‌కీయ నాయ‌కుడి అవ‌తారం ఎత్తుతాడు. క‌బాలిని అడ్డు తొల‌గించుకుని, ఆ ధారావిని ఎలాగైనా సొంతం చేసుకోవాల‌ని కుట్ర‌లూ కుతంత్రాలూ ప‌న్నుతాడు. కాలా, హ‌రి దాదా ఇద్ద‌రి మ‌ధ్య ధారావి కోసం ఎలాంటి పోరు సాగింది? ధారావి హ‌రిదాదా హ‌స్త‌గ‌తం కాకుండా.. కాలా ఎలా అడ్డుకున్నాడు? అనేదే క‌థ‌.

విశ్లేష‌ణ‌

ఈ నేల మ‌న‌దిరోయ్.. ఈ మ‌ట్టి మ‌న‌దిరోయ్ – అనే టైపు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి క‌థ ఇది. కాక‌పోతే ఇందులో విప్ల‌వాలూ, ఎర్ర డైలాగులూ ఏమీ ఉండ‌వు. అంతే తేడా! సినిమా షూటింగ్ అంతా ఒకే లొకేష‌న్‌లో పూర్తి చేయాలి, ర‌జ‌నీ ష‌ర్టు న‌ల‌క్కుండా సినిమా అయిపోవాలి – అనే నిబంధ‌న‌లు, ష‌రతుల‌తో అల్లుకున్న క‌థ‌లా అనిపిస్తుందంతే! క‌బాలిలో కాస్తో కూస్తో ఎమోష‌న్లు క‌నిపిస్తాయి. భార్యా భ‌ర్త‌ల అనుబంధం, తప్పిపోయిన భార్య‌ని మ‌ళ్లీ వెదికే ప్ర‌య‌త్నం క‌దిలిస్తుంటుంది. అలాంటి ఎమోష‌న్ కూడా `కాలా` ఇవ్వ‌దు. ర‌జనీ నుంచి ఆశించేది బ‌ల‌మైన హీరోయిజం. ఆయ‌న క‌ద‌లాల్సిన అవ‌స‌రం లేదు. నిల‌బ‌డి నాలుగు డైలాగులు చెబితే థియేట‌ర్లో పూన‌కాలు వ‌చ్చేస్తాయి. చిన్న‌గా న‌వ్వితే… ఆ న‌వ్వుకు అభిమానులు కుదేలైపోతారు. ఆయ‌న స్టైల్‌, డాన్స్‌, ఫైట్ అన్నీ స్పెష‌లే. అవే ర‌జ‌నీ బలాలు. వాటిపై దృష్టి పెట్ట‌ని ర‌జ‌నీ ఏకైక సినిమా ఏదైనా ఉందీ అంటే… అది క‌చ్చితంగా `కాలా`నే. సినిమా ప్రారంభ‌మైన చాలా సేప‌టి వ‌ర‌కూ ర‌జ‌నీ మాట్లాడ‌డు. అత‌ని చుట్టు ప‌క్క‌న పాత్ర‌లు మాత్రం వీరావేశం చూపిస్తుంటాయి. ర‌జ‌నీ హీరోనా, సైడ్ క్యారెక్ట‌రా అనే అనుమానం వ‌స్తుంది. `క్యారే… సిట్టింగా` అంటూ ర‌జ‌నీ ఓ చోట‌… రౌడీ మూక‌తో ఢీ కొట్ట‌డానికి ష‌ర్టు మ‌డ‌తెడ‌తాడు. థియేట‌ర్లు ఊగిపోతాయ్‌. ఆ డైలాగ్ చెప్పినంత సేపు ఉండ‌దు.. ర‌జ‌నీ స్థానంలో వేరే వాళ్లెవ‌రో వ‌చ్చి ఫైట్ చేసి ర‌జ‌నీ శ్ర‌మ త‌గ్గిస్తారు.

ఓ స‌న్నివేశంలో నానా ప‌టేక‌ర్ ర‌జ‌నీ ఇంటికొస్తాడు. ‘ధారావి ఇక నుంచి నాది’ అంటూ త‌న అధికార బ‌లం చూపించాల‌నుకుంటాడు. కానీ ‘నా అనుమ‌తి లేకుండా నువ్వు ధారావిలో అడుగుపెట్టొచ్చు. కానీ నాకు చెప్ప‌కుండా ఇక్క‌డ్నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌లేవు’ అంటాడు ర‌జ‌నీ. తొలి స‌గానికి ఈ సీనే హైలెట్‌. అలాంటి స‌న్నివేశాలు క‌నీసం ఐదారైనా ఉండాల్సింది. క‌థ‌లో అలాంటి ఆస్కారం ఉంది. కానీ రంజిత్ ఆ దిశ‌గా ఆలోచించ‌లేక‌పోయాడు. ఫ్యాన్స్‌కి కావ‌ల్సింది ఇచ్చేసి – ఆ త‌ర‌వాత త‌న‌కు కావ‌ల్సిన‌ట్టుగా క‌థ‌ని న‌డిపించాలి. ఈ విష‌యంలో రంజిత్ మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. క‌థానాయ‌కుడి పాత్ర‌కంటే ప్ర‌తినాయ‌కుడి పాత్ర బ‌లంగా ఉండాలి. అప్పుడు హీరోయిజం మ‌రింత ఎలివేట్ అవుతుంది. ప్ర‌తినాయ‌కుడిగా నానా ప‌టేక‌ర్‌లాంటి న‌టుడ్ని ఎంచుకున్నాడు రంజిత్‌. కానీ ఆ స్థాయికి త‌గిన పాత్ర‌ని సృష్టించ‌లేక‌పోయాడు. నానాని స‌వాల్ చేసే స‌న్నివేశం ఈ సినిమాలో ఒక్క‌టంటే ఒక్క‌టి ఉండ‌దు. అలాంట‌ప్పుడు అవ‌తల ఉన్న‌ది నానా అయితే ఏంటి?? మ‌రొక‌రైతే ఏంటి?

మ‌ధ్య‌లో ‘చిట్టెమ్మా.. ‘ అంటూ ఏజ్ ఓల్డ్ ల‌వ్ స్టోరీ ఒక‌టి. సినిమా అస‌లే స్లో అంటే.. స్లోమోష‌న్‌లో తీసి మ‌రింత స్లో చేసేశారు. నిజానికి ఆ ల‌వ్ ట్రాక్ క‌థ‌కి అవ‌స‌ర‌మా? దాని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి? అనేది ద‌ర్శ‌కుడు ఆలోచించ‌లేక‌పోయాడు. సినిమా పేరు కాలా. న‌టీన‌టులంతా ‘కాలా’నే. అందుకే ఓ ద‌బ్బ‌పండులాంటి పాత్ర‌ని వీళ్ల మ‌ధ్య‌లో పెడ‌దామ‌న్న ఆలోచన‌కు త‌ప్పితే… హ్యూమా ఖురాసీ పాత్ర మ‌రెందుకూ అక్క‌ర‌కు కాలేదు. కాలా తాలుకూ ఫ్లాష్ బ్యాక్‌, ల‌వ్ స్టోరీ.. ఇవేం సినిమాకి బూస్ట‌ప్‌గా నిల‌వ‌లేక‌పోయాయి. ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశాడు. అత‌ని నుంచి పొలిటిక‌ల్ పంచ్‌లు బాగా పేల‌తాయి. క‌నీసం కొన్ని స‌న్నివేశాల్లో అయినా ఆ వాడీ వేడీ చూపిస్తాడ‌నుకుంటే… దానికీ ఆస్కారం లేకుండా చేశాడు. కొన్ని కొన్ని ఎలివేట‌ష‌న్ సీన్లు, షాట్లు, స్లో మోష‌న్ హీరోయిజాలూ మిన‌హాయిస్తే… ర‌జ‌నీ ఫ్యాన్స్ పూన‌కంతో ఊగిపోయే సంద‌ర్భాలు క‌నిపించ‌లేదీ ‘కాలా’లో. వీటికి తోడు ప‌తాక స‌న్నివేశాల్లో క‌న్‌ఫ్యూజ్ ఒక‌టి. బాంబు బ్లాస్టులో కాలా చ‌నిపోయాడా, లేదంటే అలా న‌మ్మిస్తున్నారా? నానా ప‌టేక‌ర్‌ని చంప‌డానికి వ‌చ్చింది కాలానేనే… లేదంటే అదంతా ఓ క‌లా…?? అంటూ స‌వాల‌క్ష అనుమానాలు మెదులుతాయి.

న‌టీన‌టులు

ర‌జ‌నీకాంత్ లో వేగం, ఛార్మ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. కాక‌పోతే.. రంజిత్ వాటిని వాడుకోలేదంతే. ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేశాడ‌నిపిస్తోంది. త‌న‌కు త‌గిన క‌థ కాక‌పోయినా.. త‌న‌లోని హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు లేక‌పోయినా ఓపిగ్గా భ‌రించాడ‌నిపిస్తోంది. నానా ప‌టేక‌ర్ – ర‌జ‌నీకాంత్.. రెండూ రెండు సింహాలే. కానీ వాటికి స‌రైన వేట ల‌భించ‌లేదు. హీరో పాత్ర‌లో ఎలివేష‌నే స‌రిగా చేయ‌క‌పోతే.. ఇక విల‌న్ పాత్ర గురించి ఏం చెప్పాలి? ఈశ్వ‌రీరావుకే కొన్ని ఎక్కువ డైలాగులు ద‌క్కాయి. ఆమె తెలుగ‌మ్మాయే. కానీ పాత్ర స్వ‌భావం మాత్రం పూర్తి త‌మిళం. స‌ముద్ర‌ఖ‌నికి మ‌రోసారి మంచి పాత్ర ద‌క్కింది. హ్యూమా అందంగా ఉంది.కాక‌పోతే మ‌రీ బొద్దుగా త‌యారైంది.

సాంకేతిక వ‌ర్గం

‘క‌బాలిలో నీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంద‌య్యా’ అని ఎవ‌రో కాస్త గ‌ట్టిగా చెప్పుంటారు. ఆ మాటా నిజ‌మే. అందుక‌నే సంతోష్ నారాయ‌ణ్ మ‌రోసారి క‌బాలిని ఫాలో అయిపోయాడు. తెర వెనుక‌ ‘బాషా’ టైపు ఆర్ ఆర్ న‌డుస్తుంటుంది. సీనులో మాత్రం ఆ ద‌మ్ము ఉండ‌దు. తీసింది మురికివాడ నేప‌థ్యంలో సినిమా. పాడిందేమో వెస్ట్ర‌న్ బీట్‌. ఒక్క పాటంటే ఒక్క‌టీ ఆక‌ట్టుకునేలా లేదు. ధారావి అనే ప్రాంతాన్ని ఈ సినిమా కోసం సృష్టించారు. ఆ ఆర్ట్ ప‌నిత‌నాన్ని మాత్రం మెచ్చుకోవాలి. క్లైమాక్స్‌ని రంగుల విల్లుగా మార్చారు. ఇవి మిన‌హా సాంకేతికంగా మెరుపులుండ‌వు. పా రంజిత్‌కి ద‌క్కిన రెండో అవ‌కాశం ఇది. దాన్ని అత‌ను మ‌రోసారి వృథా ప‌ర‌చుకున్నాడు. హీరోకి ఏం కావాలి? అత‌ని అభిమానుల‌కు ఏం కావాలి? అనే లెక్క‌లు వేసుకోకుండా సినిమా తీయ‌డం మంచి ప‌ద్ధ‌తే. కాక‌పోతే… తీసిన సినిమా అయినా వాళ్ల‌కు న‌చ్చేలా ఉండాలి. జ‌నం మెచ్చేలా ఉండాలి. ఇవి రెండూ ‘కాలా’లో జ‌ర‌గ‌లేదు.

తీర్పు

హీరోయిజం చుట్టూ క‌థ న‌డిపించాలి. లేదంటే… క‌థ‌లోంచే హీరోయిజం పుట్టాలి. ర‌జ‌నీ సినిమాల‌న్నీ మొద‌టి సూత్రంతో అల్లుకునేవే. కానీ రంజిత్ మాత్రం రెండో సూత్రాన్ని న‌మ్ముకున్నాడు. దాన్ని త‌ప్పుప‌ట్ట‌లేం. కానీ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే స్థాయి, ద‌మ్ము ఈ క‌థ‌ల‌కు లేదు. ఎంతో ఇష్ట‌ప‌డి తీసిన ‘క‌బాలి’పై జ‌నం ‘బాలేదు’ అని ముద్ర వేశారు. ‘క‌బాలి బాగానే ఉంది క‌దా’ అని చెప్పుకోవాలంటే దాని ప‌క్క‌న మ‌రో చిన్న గీత గీయాలి. ఆ ఉద్దేశం మాత్రం ‘కాలా’ నెర‌వేర్చింది

ఫినిషింగ్ ట‌చ్‌: ‘క‌బాలి’ 0.5

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com