కడప నగరంలో సంచలనం సృష్టించిన పెద్ద దస్తగిరి హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య వెనుక మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా వెల్లడయింది. ప్రధానంగా వందల కోట్ల విలువైన భూ వివాదాలే ఈ హత్యకు దారితీశాయని, ఇందులో కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి లొంగిపోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
పెద్ద దస్తగిరి గత కొంతకాలంగా రవీంద్రనాథ్ రెడ్డికి బినామీగా వ్యవహరించారు. ముస్లిం వెల్ఫేర్ సొసైటీకి చెందిన సుమారు వంద కోట్ల రూపాయల విలువైన భూములను అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. దస్తగిరి భార్య పేరిట ఉన్న దాదాపు 9.70 ఎకరాల విలువైన భూమిని తిరిగి ఇచ్చేయాలని రవీంద్రనాథ్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని, ఆ భూమిని వెనక్కి ఇచ్చేందుకు దస్తగిరి నిరాకరించడమే ప్రాణాల మీదకు తెచ్చిందని సమాచారం. ఈ కారణంగానే పెద్ద దస్తగిరిని అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేశారని అర్థమైపోతుంది.
దస్తగిరి అడ్డంకిగా మారాడని భావించిన నిందితులు, పక్కా ప్రణాళికతో ఆయనను అంతమొందించినట్లు తెలుస్తోంది. రవీంద్రనాథ్ రెడ్డి తప్పించుకుని తనను ఇరికిస్తున్నట్లుగా క్లారిటీ రావడంతో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పోలీసులకు లొంగిపోయి వాంగ్మూలం ఇవ్వడంతో, ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములయ్యారు, మంత్రాంగం ఎలా నడిచింది అనే విషయాలు స్పష్టమవుతున్నాయి.
ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల పేర్లు బయటకు రావడంతో కడప జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, బినామీ లావాదేవీలు ,చివరకు హత్యకు దారితీసిన పరిణామాలు ఈ కేసును అత్యంత కీలకంగా మార్చాయి. విచారణ వేగవంతం చేసి బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
