రివ్యూ – చంద్రకళ సీసా లో “కళావతి” మందు

తమిళ్‌లో సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందిన ‘అరణ్మయి’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఇదే సినిమాని తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. ‘అరణ్మయి’ హిట్‌ అవ్వడంతో సుందర్‌ సి. దర్శకత్వంలో ‘అరణ్మయి2’ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతవరకు భయపెట్టింది, ఏమేరకు ఎంటర్‌టైన్‌ చేసింది తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.

కథ:

కొవిలూర్‌ అనే గ్రామంలో మంచి పేరు, ప్రతిష్టలు కలిగిన కుటుంబంగా పేరు తెచ్చుకున్న ఓ జమీందారు తమ ఊరిలోని గుడి బయట వున్న అత్యంత భారీ విగ్రహానికి కుంభాభిషేకం చేసేందుకు దాని స్థానాన్ని మారుస్తారు. ఎంతో మహిమగల ఆ దేవతా విగ్రహం పక్కకు జరగడం వల్ల ఆ ప్రాంతంలో వున్న క్షుద్రశక్తులు బలపడతాయి. అదే అదనుగా క్షుద్ర మాంత్రికులు ఆత్మలను తమ బంధీలుగా చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఒక ఆత్మ తప్పించుకొని జమీందారు ప్యాలెస్‌లోకి చేరుతుంది. జమీందారు, అతని కొడుకులు, అతని డ్రైవర్‌పై పగ తీర్చుకునేందుకు ఆ ఆత్మ ప్యాలెస్‌లోకి చేరుతుంది. దానివల్ల జమీందారుకు, అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆత్మ ఆ కుంటుంబంపై ఎందుకు పగ పడుతుంది? దానికి జరిగిన అన్యాయం ఏమిటి? పగ తీర్చుకొని ఆ ఆత్మ శాంతించిందా? అనేది మిగతా కథ.

నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌:

జమీందారు చిన్న కొడుకు మురళిగా సిదార్థ, మురళికి కాబోయే భార్య అనితగా త్రిష, అనిత అన్నయ్యగా సుందర్‌ సి., కళావతిగా హన్సిక తమ తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. సిద్ధార్థ చేసిన క్యారెక్టర్‌కి అంతగా ఇంపార్టెన్స్‌ లేకపోయినా తనకున్న పరిధిలో బాగానే చేశాడని చెప్పాలి. త్రిష క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్‌ వుండడం, వాటిని పర్‌పెక్ట్‌గా చూపించడంలో ఆమె సక్సెస్‌ అయింది. ఇక ఓ స్పెషల్‌ క్యారెక్టర్‌ చేసిన సుందర్‌ సి. ఆ కుటుంబానికి వచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి ఎప్పటిలాగే సిటీ నుంచే వచ్చే రవి క్యారెక్టర్‌లో సుందర్‌ సి. చాలా డిగ్నిఫైడ్‌గా కనిపించాడు. కళావతిగా హన్సిక చాలా గ్లామర్‌గా కనిపించడమే కాకుండా పెర్‌ఫార్మెన్స్‌ పరంగా మంచి మార్కులు సంపాదించుకుంది. పూనమ్‌ బజ్వా సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. కళావతి క్యారెక్టర్‌పై అందరికీ సింపతీ ఏర్పడుతుంది. ఆ క్యారెక్టర్‌లో హన్సిక చాలా బాగా నటించింది. సీరియస్‌గా నడుస్తున్న కథలో మధ్య మధ్య వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్‌ని సూరి, కోవై సరళ బృందం చేసే కామెడీ, డైలాగ్స్‌ ఆడియన్స్‌ని బాగా నవ్విస్తాయి.

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌:

ఇలాంటి హార్రర్‌ కామెడీ చిత్రాలకు మొదట టెక్నికల్‌ సపోర్ట్‌ ఎంతో అవసరం. అలాంటి టెక్నికల్‌ సపోర్ట్‌ సుందర్‌కి బాగా కుదిరింది. సెంథిల్‌కుమార్‌ ఫోటోగ్రఫీ సినిమాకి చాలా ప్లస్‌ అయింది. ఎడిటింగ్‌ కూడా బాగానే వుంది. అయితే చాలా చోట్ల కథకు అవసరం లేని సీన్స్‌, కొన్ని రిపీటెడ్‌ సీన్స్‌ వుండడం వల్ల అక్కడక్కడ బోర్‌ కొడుతుంది. హిప్‌ హాప్‌ తమిళ అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు. ఒకవిధంగా చెప్పాలంటే పాటల్లో రణగొణ ధ్వని ఎక్కువ వినిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు అనిపించాడు. ఆడియన్స్‌ని చాలా చోట్ల భయపెట్టడంలో సౌండ్‌ ఎఫెక్ట్స్‌ బాగా ఉపయోగపడ్డాయి. ఇక డైరెక్టర్‌ గురించి చెప్పాలంటే ‘చంద్రకళ’ సినిమాలో ఏం చూపించాడో దాన్నే తిప్పి ఈ సినిమాలో చూపించాడు. కాకపోతే ఇందులో నటీనటుల్ని కొంతమందిని మార్చాడు. సింపతీని గెయిన్‌ చేసే కళావతి క్యారెక్టర్‌ని మళ్ళీ హన్సికతోనే చేయించాడు. సినిమా ప్రారంభం నుంచే భయపెట్టాలని, దాని ద్వారా ఆడియన్స్‌ని కథలో ఇన్‌వాల్వ్‌ చెయ్యాలని చూశాడు. అయితే ఆడియన్స్‌ భయపడడం కంటే ఆ సీన్స్‌కి ఎక్కువ బోర్‌గా ఫీల్‌ అవుతారు. ‘చంద్రకళ’ కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా కూడా చెయ్యడంతో ప్రతి సిట్యుయేషన్‌లోనూ మనకు చంద్రకళ సినిమా గుర్తొస్తుంది. హార్రర్‌లోగానీ, కామెడీలోగానీ ఆ సినిమానే మళ్ళీ చూస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ఎక్కడా కొత్త సినిమా చూస్తున్నామన్న భావన కలగదు.

విశ్లేషణ:

ఆ ఊరి గుడిలోని అమ్మవారి విగ్రహానికి కుంభాభిషేకం చేయించాలనుకోవడం, ఆ సమయంలోనే జమీందారు ప్యాలెస్‌లోకి ఆత్మ ప్రవేశించడం.. ఇవన్నీ 15 నిముషాల్లో జరిగిపోతాయి. ఇక ఆ ఆత్మ రకరకాలుగా అందరికీ కనిపించడం, జమీందారుని కోమాలోకి వెళ్ళేలా చెయ్యడం, చిన్న పిల్లాడిని కూడా డిస్ట్రబ్‌ చెయ్యడం వంటి సీన్స్‌ జరిగిన తర్వాత సుందర్‌ సి. క్యారెక్టర్‌ ఎంటర్‌ అయి దెయ్యాన్ని కనిపెట్టడం కోసం చేసే ప్రయత్నాలు, సిసి కెమెరాలు ఫిట్‌ చేసి దెయ్యం కదలికను గుర్తించే ప్రయత్నంలో ఆ ఆత్మ ఎవరిదో తెలుసుకొని సిద్ధార్థ్‌ షాక్‌ అవ్వడంతో ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో సినిమాని రన్‌ చెయ్యడం కోసం ఎక్కువ కామెడీ మీదే ఆధార పడ్డాడు సుందర్‌. అంతేకాకుండా ఆ ఆత్మ ఎవరిలో ప్రవేశించిందో తెలుసుకోవడం, దాన్ని బయటికి పంపడానికి రకరకాల ప్రయత్నాలు చెయ్యడం వంటి సీన్స్‌తో క్లైమాక్స్‌ వరకు లాక్కొచ్చి అందరూ ఊహించిన విధంగానే వుండే ఓ క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే హార్రర్‌, కామెడీ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాలో భయపెట్టిన సీన్స్‌ కంటే ఆడియన్స్‌ని నవ్వించిన సీన్సే ఎక్కువ అని చెప్పాలి. కాబట్టి ఈ చిత్రం కామెడీ డైలాగ్స్‌ పరంగా బి, సి సెంటర్‌ ఆడియన్స్‌ని ఎక్కువగా ఆకట్టుకునే అవకాశాలు వున్నాయి. అయితే మనం చూసేసిన ‘చంద్రకళ’ సినిమాని ఆర్టిస్టుల మార్పుతో ‘కళావతి’గా చూస్తున్న ఫీలింగ్‌ మాత్రం కలుగుతుంది.

బ్యానర్ : గుడ్‌ సినిమా గ్రూప్‌
నటీనటులు: సిద్ధార్థ్‌, త్రిష, హన్సిక, పూనమ్‌ బజ్వా,
సుందర్‌ సి., రాధారవి, సూరి, కోవై సరళ తదితరులు
సినిమాటోగ్రఫీ: యు.కె.సెంథిల్‌కుమార్‌
సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ
మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి
ఎడిటింగ్‌: ఎన్‌.బి.శ్రీకాంత్‌
సమర్పణ: జవ్వాజి రామాంజనేయులు
నిర్మాతలు: గుడ్‌ ఫ్రెండ్స్‌
రచన, దర్శకత్వం: సుందర్‌ సి.
విడుదల తేదీ: 29.01.2016

రేటింగ్: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com