కాళేశ్వరం ప్రాజెక్టు, ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత క్లిష్టమైన మలుపు తిరుగుతోంది. ఒకవైపు ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు సిఫారసు చేయడం, హైకోర్టులో దీనిపై కీలక తీర్పు వెలువడనున్న తరుణంలో బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రేవంత్ వ్యూహాత్మకంగా బీజేపీనే విచారణ చేయించడం లేదని ఆరోపిస్తున్నారు.
హరీష్ రావు ఢిల్లీ పర్యటన
జగిత్యాల వేదికగా కేసీఆర్ ఏడాది తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో, పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావు ఆ సభకు హాజరుకాకుండా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశమైంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం పాపాలు బయటపడతాయనే భయంతో, కేంద్రంలోని బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికే హరీష్ రావు ఆర్ఎస్ఎస్ పెద్దల ద్వారా లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. లాయర్ల సలహా కోసమే వెళ్లారన్న బీఆర్ఎస్ వాదనను తోసిపుచ్చుతూ, తీర్పు రిజర్వ్ అయిన తర్వాత చేసే న్యాయపరమైన మంతనాలు ఏముంటాయని రేవంత్ ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ ఇరకాటం – కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడి
కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సిఫారసు చేసింది. దానిపై ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి లేదు. గతంలో మోదీ, అమిత్ షా వంటి నేతలు కాళేశ్వరాన్ని కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా అభివర్ణించినప్పటికీ, అధికారికంగా విచారణ ప్రారంభించకపోవడంపై రేవంత్ సర్కార్ కేంద్రాన్ని దోషిగా నిలబెడుతోంది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీని స్వయంగా సందర్శించిన సీఎం రేవంత్, టెక్నికల్ రిపోర్టులు వచ్చిన తర్వాత ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం చేయడంతో.. కేంద్రంలోని బీజేపీ ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
కోర్టు తీర్పు తర్వాత కీలక పరిణామాలు
ఏప్రిల్ 22న బుధవారం పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు వెలువడనుంది. ఈ నివేదికలో మాజీ సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులను బాధ్యులుగా పేర్కొన్నారు. ఒకవేళ కోర్టు ఈ నివేదికను సమర్థించి సీబీఐ విచారణకు ఓకే అంటే .. ఆ సంస్థ రంగంలోకి దిగాల్సిందే.
కాళేశ్వరంపై విచారణ చేయిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, ఇప్పుడు తన మాట నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ అంటోంది. అటు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో చేస్తున్న ప్రయత్నాలు, ఇటు రేవంత్ రెడ్డి చేస్తున్న అటాకింగ్ పాలిటిక్స్ మధ్య బీజేపీ ఏ వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
