ఎన్టీఆర్‌లాగే కమల్‌ ఆఫర్‌

తాను ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చేశానని ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ప్రకటించడం ఆసక్తికరమైన పరిణామం. గతంలో ఎరుపు తన అభిమానమైన రంగు అని చెప్పిన దాన్నిబట్టి కమ్యూనిస్టులతో వుంటాడని లెక్క వేసుకున్నారు. కాని ఇప్పుడున్న పార్టీలేవీ తన ప్రణాళికలకు అనుగుణంగా వుండకపోవడం వల్ల కొత్త పార్టీ అవసరమవుతున్నట్టు కమల్‌ స్పష్టంగా చెప్పేశారు. అయితే కాషాయం వైపు గాక ఎరుపు వైపు వుంటానన్నారు గనక వారితో కలసి పనిచేయొచ్చు. ఈ సందర్భంగా ఎవరో రజనీకాంత్‌ రాజకీయాల గురించి అడిగితే కావాలంటే ఆయనా నా పార్టీలో వచ్చి చేరొచ్చునని ఆఫర్‌ ఇచ్చేశారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించేప్పుడు తననుకూడా వచ్చి చేరవలసిందిగా ఆహ్వానించారని అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్‌ అభిమాని కాగా ఎన్టీఆర్‌ దాన్ని ఓడించేందుకే పార్టీ పెట్టారు. రాజకీయాలు నాకు పడవని చెప్పినట్టు అక్కినేని అంటుండేవారు. అయితే ఒక దశలో ఆయన రాజ్యసభ కోసం ప్రయత్నించి విఫలమైన మాట నిజం. నాగార్జున వైఎస్‌ రాజశేఖరరెడ్డిని బలపర్చేవారు. కమల్‌ మాటలు చూస్తుంటే ఆ ఉదంతమే గుర్తుకు వస్తుంది. బిజెపి నేతలకు దగ్గరగా వుండటమే గాక నటుడుగా కమల్‌కన్నా మాస్‌ ఇమేజి ఎక్కువగా వున్న రజని ఈయనతో వచ్చి చేరడం ఎలాగూ జరిగేది కాదు.

ఇక పవన్‌ కళ్యాణ్‌లాగానే కమల్‌ హాసన్‌ కూడా ట్విట్టర్లలో వెల్లడిస్తున్న అభిప్రాయాలు తీవ్రంగానే వున్నాయి. ఇటీవల సమ్మె చేసిన ఉద్యోగులకు సంబంధించి నో వర్క్‌ నో పే అన్న కేసు వచ్చింది. ఈ సూత్రాన్ని రాజకీయ నేతలకు వర్తింపచేయాలని కమల్‌ అపహాస్యం చేశారు. అన్నా డిఎంకె తగాడాలలో దినకరన్‌ వర్గానికి చెందిన ఎంఎల్‌ఎలు రకరకాల రిసార్టులలో తలదాచుకోవడంపై కమల్‌ ఈ వ్యాఖ్య చేశారట. అవినీతిని అసహన రాజకీయాలను కూడా ఆయన తీవ్రంగానే ఖండిస్తుంటారు. దక్షిణభారతంలో కళాకారులందరినీ కలపి ఒక కూటమి ఏర్పాటు చేస్తామని అప్పట్లో గద్దర్‌ వంటివారు చేసిన ప్రకటనకు కమల్‌ కదలికలకు ఏమైనా సంబంధం వుందా అంటే గద్దర్‌ రజనీకాంత్‌ను, పవన్‌ కళ్యాణ్‌ను ప్రస్తావించారు తప్ప కమల్‌ను కాదు. అప్పుడప్పుడు పవన్‌ దక్షిణాది వర్సెస్‌ ఉత్తరాది భాషలో మాట్లాడుతుంటారు కూడా. ఆ నేపథ్యంలో కమల్‌ కదలికలకు ఈ బృహత్‌కూటమికి ఏమైనా సంబంధం వుంటుందా అన్నది కూడా ముందు ముందు చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.