క‌మ‌ల్‌.. ఈ బెదిరింపులు ఎవ‌రి కోసం??

క‌మ‌ల్ హాస‌న్ మ‌రోసారి గ‌ళ‌మెత్తాడు. అయితే ఈసారి ర‌జ‌నీకాంత్ కోస‌మో, త‌మిళ రాజ‌కీయాల కోస‌మో కాదు. చిత్ర‌సీమ కోసం. జీఎస్టీ ప‌న్ను విధానంతో చిత్ర‌సీమ న‌ష్ట‌పోతోంద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప‌న్ను విష‌యంలో పున‌రాలోచింక‌పోతే.. తాను సినిమాల నుంచి త‌ప్పుకోవాల్సివ‌స్తుంద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు క‌మ‌ల్‌. అయితే…క‌మ‌ల్ ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం ఇదేం కొత్త కాదు. విశ్వ‌రూపం సినిమా స‌మ‌యంలో వివాదాలు చెల‌రేగిన‌ప్పుడు ‘దేశం విడిచిపోతా’ అన్నాడు. ఇప్పుడు ‘సినిమాలు మానేస్తా’ అంటున్నాడు. సినిమాల‌పై కేంద్రం 28 శాతం ప‌న్ను విధించ‌డం నిజంగా..విబేధించ‌ద‌గిన‌దే. అందులో ఎలాంటి అనుమానాలూ లేవు. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేకుండా, అన్ని సినిమాల్నీ ఒకే గాటిన క‌ట్టేయ‌డం, వాళ్ల నుంచి ప‌న్ను వ‌సూలు చేయాల‌నుకోవ‌డం అన్యాయ‌మే. చిన్న సినిమాల‌కు ఈ ప‌న్ను పోటు.. మ‌రింత బాధిస్తుంది. అయితే… క‌మ‌ల్ లాంటి వ్య‌క్తులు కేవ‌లం మైకు ప‌ట్టుకొని చెవులు చిల్లులు ప‌డేలా అర‌వ‌డంతోనే స‌మ‌స్య స‌మ‌సిపోదు. చిత్ర‌సీమ‌ని ముందుండి న‌డిపించే శ‌క్తి, స్థోమ‌త‌… క‌మ‌ల్‌కి ఉంది. అలాంట‌ప్పుడు ఈ ఒంట‌రి పోరు ఎందుకు కోసం ఎవ‌రి కోసం? నేను సినిమాలు మానేస్తా.. అన‌గానే కేంద్రం దిగివ‌స్తుందా?? ప‌న్ను రేటు త‌గ్గిస్తుందా?

త‌మిళ సినిమాని, వీలైతే ద‌క్షిణాదినీ క‌మ‌ల్ ఏకం చేయాలి. అందుకు తానే నాయ‌క‌త్వం వ‌హించాలి. ద‌క్షిణాది సినిమా ప‌రిశ్ర‌మ బాధ డిల్లీకి వినిపించేలా ఉద్య‌మం చేయాలి. దానికి ఏసీ గ‌దుల్లోంచి బ‌య‌ట‌కు రావాలి. కానీ.. ఇవేం చేయ‌రేం? మైకు ప‌ట్టుకొని నాలుగు ముక్క‌లు మాట్లాడేస్తే స‌రిపోతుందా?? ఇదేం త‌నొక్క‌డి స‌మ‌స్య కాదు. చిత్ర సీమ స‌మ‌స్య‌. నిర్మాత‌ల బాధ‌. ప‌రిశ్ర‌మ ఘోష‌. క‌మ‌ల్ నిజంగా లీడ‌ర్ కావాల‌నుకొంటే, క‌నీసం ప‌రిశ్ర‌మ త‌ర‌పున పోరాడ‌గ‌ల‌డు అనిపించుకోవాలంటే, ఆఖ‌రికి త‌న మ‌నస్సాక్షికైనా స‌మాధానం చెప్పుకోవాల‌నుకొంటే… ఇలాంటి మాట‌లు క‌ట్టిపెట్టి – ఏం చేస్తే కేంద్రం దిగి వ‌స్తుందో, ఏం చేస్తే ప‌రిశ్ర‌మ‌కు మేలు జ‌రుగుతుందో ఆలోచించాలి. ఆ మేధ‌స్సు, ఆలోచ‌నా శ‌క్తి క‌మ‌ల్‌కి ఉంది. కావ‌ల్సింద‌ల్లా… కొంచెం స్ఫూర్తి. క‌మ‌ల్ ఇప్ప‌టికైనా మాట‌లు వ‌దిలి చేత‌ల్లోకి దిగితే మంచిది. క‌మ‌ల్ అనే కాదు.. జీఎస్టీ గురించి ఎవ‌రు వ్య‌క్తిగ‌తంగా గొంతు చించుకొన్నా లాభం లేదు. అంతా క‌లిసి ముంద‌డుగు వేయాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.