రజినీ ఏమో కానీ కమల్ రాజకీయం, భజన మాత్రం బ్రహ్మాండం

అందరూ కూడా రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి చాలా చాలా మాట్లాడేసుకుంటున్న నేపథ్యంలో తాను కూడా లైం లైట్‌లో ఉండాలని ఆలోచిస్తున్నాడో లేక కమల్ కూడా పొలిటికల్ అరంగేట్రం ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాడో తెలియదు కానీ ఆయన రాజకీయ వ్యాఖ్యలు మాత్రం సెన్సేషన్ అవుతున్నాయి. తమిళ తంబీల ఆనందం కోసం బాహుబలి సినిమాను కూడా చాలా చాలా తక్కువ చేసి మాట్లాడేశాడు కమల్. సినిమాల కంటెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే కమల్ స్థాయిని తక్కువ చేయడం కూడా పెద్ద విషయం కాదు. ఫక్తు బి గ్రేడ్ స్థాయి రొమాంటిక్ సీన్స్‌తో కమల్ తీసిన సినిమాల ప్రస్తావన తెచ్చి కమల్‌ని తక్కువ చేసి మాట్లాడితే ఎలా ఉంటుంది? అలాగే బాహుబలి లాంటి సినిమా తీయాలని ఆలోచించడానికి నేనేమీ గొర్రెను కాదు అన్న కమల్ వ్యాఖ్య కూడా ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదు. హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టిన కథలతో సినిమాలు తెరకెక్కించిన కమల్ బాహుబలి సినిమా విషయంలో మాత్రం బోలెడన్ని నీతులు వినిపించడం విడ్డూరంగా ఉంది.

జయలలిత చనిపోయిన తర్వాత నుంచీ రాజకీయ విషయాలపై కూడా తరచుగా ప్రకటనలు చేస్తున్నాడు కమల్. అలాగే తన సహచర హీరో అయిన రజినీ పొలిటికల్ అరంగేట్రంపై కూడా పరోక్షంగా సెటైర్స్ వేశాడు. రజినీకి కెమేరాలు ఎక్కడ ఉంటాయో బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. రజినీతో పాటు చాలా మంది పైన సెటైర్స్ వేస్తూ నాయకులకు కూడా ఎన్నో సుద్దులు చెప్పిన కమల్ ఇప్పుడు కరుణానిధిని ఏకంగా తమిళ గురువును చేసి పడేశాడు. తమిళనాడు శాసనసభ్యుడిగా వజ్రోత్సవ వేడుకుల జరుపుకోబోతున్న కరుణానిధిని పొగడడానికి తన పాండిత్యం మొత్తం వాడేశాడు కమల్. దశావతారం సినిమా చూసిన కరుణానిధి….చాలా బాగా చేశావంటూ తన బుగ్గగిల్లిన సంఘటనను ఇప్పటికీ తాను మర్చిపోలేనని చిన్నపిల్లాడిలా మురిసిపోవడం హైలైట్ అని చెప్పొచ్చు. కరుణానిధితో పాటు ఆయన కుటుంబ సభ్యుల అవినీతి గురించి కూడా తెలియని వాళ్ళకు మాత్రం కమల్ వ్యాఖ్యలు మా గొప్పగా అనిపిస్తాయి. అలా కాకుండా సోనియా నేతృత్వంలోని యూపిఎ ప్రభుత్వంపై తుడుచుకోలేని స్థాయి అవినీతి మరక పడడానికి కరుణానిధి కుటుంబం ఏ స్థాయిలో కారణమో తెలిసినవాళ్ళకు మాత్రం కమల్ మాటలు జుగుప్స కలిగిస్తాయి. ఈ కమల్ హాసనేనా హిందూ ధర్మాలను విమర్శించింది. అలాగే నాయకుల అవినీతి గురించి మాట్లాడింది అని ఆశ్ఛర్యం వేస్తుంది. ఈ సినిమా హీరోల జ్ఙానపరిధి ఎంత, వాళ్ళకుండే వ్యాల్యూస్ ఏంటి అనే విషయాలపై ఇలాంటి సందర్భాల్లోనే సందేహాలు వస్తూ ఉంటాయి. మాటలు మాత్రం మా గొప్పగా ఉంటాయి……ఆచరణలో మాత్రం నాయకుల భజన చేసి లౌక్యంగా లాభపడదామనుకునే జనాలకు ఏమాత్రం తీసిపోరు ఈ సినిమా హీరోలు. అలాగే ఇగో వ్యవహారాలతో కూడా వీళ్ళ రాజకీయ ప్రకటనలు ఉంటూ ఉంటాయి. కమల్ హాసన్‌లాంటి వాళ్ళు కూడా అందుకు అతీతులు ఏమీ కాదని నిరూపించాడు కమల్. కమల్‌‌ని గొప్ప మేథా సంపన్నుడుగా ఊహించుకుని అభిమానించే ఆయన అభిమానులకు కూడా కమల్‌వారి కరుణానిధి భజన ప్రోగ్రాం రుచించే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com