వైకాపా వ్యూహంలో చిక్కుకున్న‌ది వారేనేమో..!

ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీకి బ‌య‌ట‌కి వ‌చ్చేయ‌డం, వెంట‌నే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌డంపై ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు స్పందించారు. ఇదంతా ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహమ‌నీ, దానిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చిక్కుకున్నార‌ని హ‌రిబాబు వ్యాఖ్యానించ‌డం విచిత్రం..! టీడీపీ, భాజ‌పా విడిపోతే త‌న‌కు ఏదో ల‌బ్ధి ఉంటుంద‌ని జ‌గ‌న్ అనుకున్నార‌నీ, అనుకున్న‌ట్టుగా ఆయ‌న ప‌న్నిన ఉచ్చులో చంద్ర‌బాబు ఇరుక్కుపోయార‌న్నారు. ఆయన రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్ల‌నే ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేశార‌న్నారు. రాష్ట్ర స్థాయిలో టీడీపీ, వైకాపాలు ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించాల‌నే రాజ‌కీయ క్రీడ‌లో భాగంగానే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టార‌ని హరిబాబు అన్నారు. ఒక ప‌థ‌కం ప్ర‌కారం టీడీపీని రెచ్చ‌గొట్టి, ఆ మేర‌కు జ‌గ‌న్ విజ‌యం సాధించార‌న్నారు.

టీడీపీని భాజ‌పా నుంచి విడ‌గొట్ట‌డం ద్వారా జ‌గ‌న్ పొంద‌బోయే ల‌బ్ధి ఏంట‌నే ప్ర‌శ్న‌కు కూడా హ‌రిబాబు స‌మాధానం చెప్పారండోయ్‌..! కేంద్రంలో మోడీ లాంటి బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉన్న‌ప్పుడు, అంద‌రూ ఆ నాయ‌క‌త్వం అండ కోరుకునే ప్ర‌య‌త్నం చేస్తార‌న్న‌ట్టుగా చెప్పారు. రెండు పార్టీలూ విడిపోతే త‌మకు ఆస‌రాగా ఉంటుంద‌ని వైకాపా నేత‌లు భావించి ఉంటార‌న్నారు. గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో ఆంధ్రాకీ, టీడీపీకి భాజ‌పా అన్ని ర‌కాలుగా మ‌ద్ద‌తు ఇచ్చింద‌నీ, దేశానికి స్వ‌తంత్రం వచ్చిన త‌రువాత‌, ఏ కేంద్ర ప్ర‌భుత్వ‌మూ ఏ రాష్ట్రానికి ఇంత సాయం చేసింది లేద‌ని మ‌రోసారి హ‌రిబాబు చెప్పారు.

ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కి రావ‌డానికి అస‌లు కార‌ణ‌మేంటీ… రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రం నెర‌వేర్చలేదు కాబ‌ట్టి..! విభ‌జ‌న చ‌ట్ట ప్ర‌కారం చేయాల్సిన‌వి చేయ‌లేదు కాబ‌ట్టి. ఏపీ విష‌యంలో మోడీ స‌ర్కారు ఇప్ప‌టికీ మొండి వైఖ‌రే అనుస‌రిస్తోంది కాబట్టి. అందుకే క‌దా… మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ కేంద్రంపై పోరాటం ప్రారంభించింది. లేదంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దూర‌మవ్వాల్సిన అవ‌స‌రం చంద్ర‌బాబు నాయుడుకు ఏముంటుంది..? కేంద్రంపై ఒత్తిడి పెంచి, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు రాబ‌ట్టుకునే తొలి ప్ర‌య‌త్నంగా టీడీపీ కేంద్ర‌మంత్రుల‌తో రాజీనామా చేయించారు. అయినాస‌రే, వారి వైఖ‌రిలో ఎలాంటి మార్పూ రాలేదు. దీంతో ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కి వ‌చ్చింది. జాతీయ స్థాయిలో ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని తెలియ‌జెప్పాల‌న్న ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. ఇందులో వైకాపా వ్యూహానికి టీడీపీ చిక్కుకోవ‌డం అనేది ఎక్క‌డుంది..? ‘నాలుగేళ్లుగా మేం హోదా కోసం పోరాడితే… ఇప్పుడు టీడీపీ మా దారికి వ‌చ్చింద‌నీ, అవిశ్వాసం ముందుగా మేం పెడితే… ఇప్పుడు మాదారిలో టీడీపీ పెడుతోంద‌’ని జ‌గ‌న్ అన్నారు క‌దా! బ‌హుశా ఆ ఉచ్చులో హ‌రిబాబు చిక్కుకున్నారేమో..! పార్ల‌మెంటులో భాజ‌పాపై టీడీపీ ఎదురు తిరిగాక‌నే.. ఆంధ్రాలో ప్ర‌త్యేక హోదా వేడి తీవ్ర‌మైంది. ఆ త‌రువాతే క‌దా జ‌గ‌న్ స్పందించిందీ, అవిశ్వాసం అంటూ మాట్లాడింది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.