మాజీ మంత్రి కామినేని చేరిక లాంఛ‌నం మాత్ర‌మేనా..?

మాజీ మంత్రి, భాజ‌పా ఎమ్మెల్యే కామినేని శ్రీ‌నివాస్ త్వ‌ర‌లో పార్టీ మార‌బోతున్నారా అంటే… అవున‌నే అనిపిస్తోంది. నిజానికి, ఆయ‌న పార్టీ మార‌డం అనేది కొత్త విష‌యం కానే కాదు. ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కి వ‌చ్చిన త‌రువాత‌… కేంద్ర కేబినెట్ కి టీడీపీ మంత్రులు రాజీనామాలు చేశారు. అదే స‌మ‌యంలో, రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్న భాజ‌పా మంత్రులు కూడా రాజీనామా చేశారు. కామినేని కూడా అదే స‌మ‌యంలో రాజీనామా చేశారు! అయితే, ఆయ‌న మొద‌ట్నుంచీ భాజ‌పా నాయ‌కుడే అయినా… ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి అత్యంత స‌న్నిహితుడిగా ఉంటూ వ‌చ్చారు.

సోమ‌వారం నాడు ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు కామినేని శ్రీ‌నివాస్‌. ఈ భేటీ రాజకీయ వ‌ర్గాల్లో కొంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. త్వ‌ర‌లో ఆయ‌న తెలుగుదేశం కండువా క‌ప్పుకోవ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం ఇప్పుడు మ‌రోసారి గుప్పుమంటోంది. మంత్రిగా రాజీనామా చేసిన కామినేని, భాజ‌పా ఎమ్మెల్యేగా కూడా ఈ మ‌ధ్య ఏమంత క్రియాశీల‌కంగా ఉండ‌టం లేదు. ఆ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కావ‌డం లేదు. కేంద్రం నుంచి భాజ‌పా పెద్ద‌లు ఎవ‌రొచ్చినా కూడా ఆయ‌న దాదాపు ముఖం చాటేస్తూనే వ‌స్తున్నారు. దీంతో ఆయ‌న పార్టీ మార‌డం ఖాయ‌మ‌నేదే దాదాపు కనిపిస్తోంది. ముఖ్య‌మంత్రితో తాజా భేటీ వెన‌క కీల‌కాంశం కూడా ఇదే అయి ఉంటుంద‌నేది ప‌లువురి అభిప్రాయం.

నిజానికి, ఆయ‌న మొద‌ట టీడీపీలోనే ఉండేవారు. ఎన్టీఆర్ ఆహ్వానం మేర‌కు ఆయ‌న పార్టీలో చేరారు. త‌రువాత, కొన్నాళ్లపాటు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో భాజ‌పా అగ్ర‌నేత‌, ప్ర‌స్తుత ఉప రాష్ట్రప‌తి ఎమ్‌. వెంక‌య్య‌నాయుడు ప్రోత్సాహంతో భాజ‌పాలో చేరారు కామినేని. ఆ త‌రువాత‌, టీడీపీ క్యాబినెట్ లో మంత్రి ప‌ద‌వి ల‌భించింది. అప్ప‌ట్నుంచీ చంద్ర‌బాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వ‌చ్చారు. టీడీపీపై భాజ‌పా విమ‌ర్శ‌లు చేయాల్సిన సమ‌యంలో కూడా ఆయ‌న చంద్ర‌బాబుకు అనుకూలంగానే ఉంటూ వ‌చ్చారు. ఈ క్రమంలో సొంత పార్టీ నుంచి కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక దశ‌లో ఆయ‌న జ‌న‌సేనలోకి చేరుతార‌నే టాక్ కూడా న‌డించింది! ప్రస్తుతం, త్వ‌ర‌లో టీడీపీలో ఆయ‌న చేరిక లాంఛ‌న‌మే అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.