ఉక్కుపరిశ్రమ పెడతామని అమిత్ షా చెప్పారట..! మరి సుప్రీంకోర్టు అఫిడవిటేమిటి కన్నా..?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రాన్ని సమర్ధిస్తూ మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా.. కడపలో ఉక్కు పరిశ్రమ పెడతామని తనకు గట్టిగా చెప్పారని… కన్నా లక్ష్మినారాయణ మరోసారి ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ పెట్టడం లేదంటూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రచారం మొత్తం.. తెలుగుదేశం కుట్ర అని మరోసారి .. విషయాన్ని అంతా పాలక పార్టీపై నెట్టేశారు. కానీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం కాదుగా..?. ఈ విషయాన్ని కూడా కన్నాతన సహజ రాజకీయ తెలివి తేటలతో సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అఫిడవిట్ లో ఎక్కడా ఉక్కు పరిశ్రమ పెట్టడం అసాధ్యమని ఎక్కడా చెప్పలేదంటున్నారు.

కన్నా లక్ష్మినారాయణ ఓ వైపు ఢిల్లీలో ఉండి.. విభజన హామీలపై ప్రధానికి విజ్ఞప్తులిస్తున్న సమయంలోనే కేంద్రం స్టీల్ ప్లాంట్ పెట్టడం సాధ్యం కాదని.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అది అధికారికం. విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఆరు నెలల్లోనే తేల్చేశామన్నారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల ఒత్తిడితో… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. మెకాన్ అనే సంస్థకు అధ్యయన బాధ్యతలు ఇచ్చారు. ఈ మెకాన్ సంస్థ పూర్తిగా క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి ప్లాంట్ పెట్టవచ్చని అనుకూలంగా నివేదిక ఇచ్చిన విషయాన్ని కూడా… సుప్రీంకోర్టు అఫిడవిట్ లో చెప్పలేదు. అంటే.. ప్లాంట్ పెట్టే ఉద్దేశం దాదాపుగా లేనట్లే.

ఈ విషయాలన్నీ తెలిసినా.. కన్నా మళ్లీ మీడియా ముందుకు వచ్చి.. బీజేపీని, ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని వెనకేసుకు వచ్చేందుకు ఏ మాత్రం సంకోచించలేదు. సుప్రీంకోర్టులో కేంద్రం దాఖల చేసిన అఫిడవిట్ లో కేంద్రం.. ఎక్కడా… ప్లాంట్ పెట్టబోమని చెప్పలేదని వితండవాదం ప్రారంభించారు. ఆసాధ్యం అంటే.. పెట్టబోవడం లేదని చెప్పడం కాదా..?. అమిత్ షా.. ఏపీలో కచ్చితంగా ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పారట. ఓ వైపు అధికారికంగా సుప్రీంకోట్లు అఫిడవిట్ దాఖలు అందరికీ తెలిసేలా చేశారు. కన్నాకే ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నామని అమిత్ షా చెప్పుకొచ్చారట.

తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన వెంటనే… బీజేపీ ఓ ప్రచారం ప్రారంభించింది. విభజన హామీలన్నింటినీ వరుసగా అమలు చేయబోతున్నామని… రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్ లను నెలలో ప్రకటిస్తామని.. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ప్రధాని వస్తారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి వరకూ.. అవి అలా మిగిలిపోయాయి. బీజేపీ నేతలు అదిగో.. ఇదిగో అనడం మాత్రమే చేస్తున్నారు. ఢిల్లీ నుంచి మాత్రం… తరచూ… ఏపీకి ఇక ఇచ్చేదేమీ లేదన్నట్లు సంకేతాలు పంపుతున్నారు. మళ్లీ దానికి టీడీపీ కారణం అంటూ వారే విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో బీజేపీ పొలిటికల్ గేమ్… ప్రజలను… గందరగోళానికి గురి చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.