క‌న్నాకి ఇదంతా కుక్క‌ల హ‌డావుడిగా క‌నిపిస్తోంద‌ట‌..!

సీఎం చంద్ర‌బాబు నాయుడుపై భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మ‌రోసారి ఆరోప‌ణ‌ల‌కు దిగారు. ముఖ్య‌మంత్రి ప‌రిస్థితి ‘ఊళ్లో పెళ్లికి కుక్క‌ల హ‌డావుడి’లా ఉంద‌ని పోల్చారు. బెంగ‌ళూరులో ప్ర‌భుత్వ ఏర్పాటైతే అక్క‌డి వెళ్లార‌నీ, ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ఏదో చేస్తుంటే అక్క‌డి వెళ్ల‌డం చూస్తుంటే అలానే అనిపిస్తోంద‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని గాలికి వ‌దిలేశార‌నీ, ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప‌ట్ట‌కుండా తిరుగుతున్నార‌న్నారు. రాష్ట్ర సమ‌స్య‌ల్ని నీతీ ఆయోగ్ స‌మావేశం ప్ర‌స్థావిస్తాన‌ని ఢిల్లీ బ‌య‌లుదేరి, కేజ్రీవాల్ సమ‌స్య గురించి పోరాడ‌తా అన‌డంలోనే చంద్ర‌బాబు చిత్త‌శుద్ధి బ‌య‌ట‌ప‌డుతోంద‌న్నారు.

రాష్ట్రంలో చెబుతున్న‌వ‌న్నీ అవాస్థ‌వాలు కాబ‌ట్టి, ఢిల్లీ వెళ్లి వాటి గురించి మాట్లాడేందుకు ధైర్యం చాక‌ల‌, దారిన‌పోయిన స‌మ‌స్య‌ల్ని భుజాన వేసుకుంటున్నార‌ని క‌న్నా విమ‌ర్శించారు. అక్క‌డి నుంచి గ‌త చ‌రిత్ర అంటూ క‌న్నా మాట్లాడుతూ.. చంద్రబాబు ప్ర‌తిప‌క్షంలో ఉన్నంత కాలం స‌భ‌లో స‌రైన చ‌ర్చ చేసేవారు కాద‌నీ, అధికారంలో ఉండ‌గా ఏదైనా చేస్తేనే క‌దా ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చాక మాట్లాడ‌గ‌లిగేద‌న్నారు. ఆంధ్రా స‌మ‌స్య‌ల్ని జెన్యూన్ గా లేవ‌నెత్తితే స‌మాధానం చెప్ప‌డానికి ప్ర‌ధాన‌మంత్రి సిద్ధంగా ఉన్నార‌ని క‌న్నా చెప్పారు! కేంద్రం ప్యాకేజీ ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నా, ముఖ్య‌మంత్రికి అది ప‌ట్ట‌ద‌ని విమ‌ర్శించారు.

నీతీ ఆయోగ్ స‌మావేశంలో క‌న్నాకు ఎంట్రీ లేదు కాబ‌ట్టి, సీఎం చంద్ర‌బాబు ఏం మాట్లాడారో ఆయ‌న‌కి తెలిసే అవ‌కాశం లేదు. క‌నీసం మీడియా ద్వారా కూడా తెలుసుకునే ప్ర‌య‌త్నం ఆయ‌నా చెయ్య‌లేద‌ని అర్థ‌మౌతోంది. నీతీ ఆయోగ్ స‌మావేశంలో ముఖ్య‌మంత్రులంద‌రికీ ఏడు నిమిషాలు చొప్పున స‌మ‌యం కేటాయించినా, ఏపీ సీఎం 20 నిమిషాల‌కుపైగానే మాట్లాడి రాష్ట్ర స‌మ‌స్య‌ల్ని ప్ర‌ధానికి విన్న‌వించారు. జీవీఎల్ ను అడిగినా విష‌యం చెప్తారు క‌దా! ఎందుకంటే, తన రాష్ట్రం గురించి వినడానికి ప్రధాని 20 నిమిషాలు సమయం ఇచ్చారని ఆయన మురిసిపోయారు కదా. ఇది తెలుసుకోకుండా… ఢిల్లీ వ‌చ్చి రాష్ట్ర స‌మ‌స్య‌ల్ని ముఖ్య‌మంత్రి ప్ర‌స్థావించ‌లేదంటే కన్నా అనేస్తే ఎలా..?

కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటు, ఢిల్లీ స‌మ‌స్య‌… ఇవి దారిన పోయే స‌మ‌స్యలని ఈజీగా చెప్పేస్తున్నారు! కన్నాకి ఇవి దారినపోయే సమస్యలే.. కానీ, భాజపాకి దారిలేకుండా చేయబోతున్న సమస్యలుగా అర్థం కావడం లేదు. కర్ణాటకలో ప్రతిపక్షాలన్నీ భాజపాకి వ్యతిరేకంగా ఒకటయ్యాయి. కేజ్రీవాల్ పోరాటం చేస్తోంది కేంద్ర వైఖ‌రికి నిర‌స‌న‌గా.. ఇప్ప‌టికే నాలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఇత‌ర పార్టీల నేత‌లు ఆయ‌న‌కి అండ‌గా నిలుస్తున్నారు. ఈ క్ష‌ణానికి ఇది కుక్క‌ల హ‌డావుడిగానే క‌న్నాకు అర్థం కావొచ్చు. కానీ, 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భాజ‌పా వ్య‌తిరేకంగా ఏర్పాటు కాబోతున్న మ‌హా కూట‌మి ఐక్య‌త‌కు ప‌డుతున్న పునాదులివి అనేది ఆయ‌న హ్ర‌స్వ‌దృష్టికి ఇప్పుడు క‌నిపించ‌క‌పోవ‌చ్చు..! మ‌రో అంశం… ఏపీ స‌మ‌స్య‌లు జెన్యూన్ గా చెబితే ప్ర‌ధాని సిద్ధంగా ఉన్నార‌ట‌. ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌ల ముందు కూడా ఇంకా సిద్ధంగా ఉన్నారు, క‌ట్టుబ‌డి ఉన్నారు అంటే ప్రజలు నమ్ముతారా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com