తెలుగంటే కన్నడ కుర్రాళ్లకు ఎందుకంత ప్రేమ?

‘జాగ్వార్‌’ సినిమా గుర్తుందా? సుమారు రెండేళ్ల క్రితం విడుదలైంది. ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌గౌడ ఆ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిన ఆ చిత్రానికి రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి. విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. దర్శకుడు మహదేవ్‌ కూడా రాజమౌళి శిష్యుడే. భారీ తారాగణంతో, భారీ హంగులతో చేసిన ఆ చిత్రం విజయవంతం కాలేదు.

నిఖిల్‌గౌడని వదిలేస్తే… గతేడాది మరో కన్నడ కుర్రాడు ఇషాన్‌ తెలుగు తెరపైకి వచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్‌ కథానాయకుడిగా ‘మహాత్మ’ చిత్రాన్ని నిర్మించిన సీఆర్‌ మనోహర్‌ తమ్ముడు అతను. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘రోగ్‌’తో తెలుగు చిత్ర పరిశ్రమకి కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. విడుదలకు ముందు ప్రచార చిత్రాలతో ప్రేక్షకులను ఆకర్షించిన ఆ చిత్రం, విడుదల తరవాత ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. నిఖిల్‌గౌడ, ఇషాన్‌ బాటలో మరో కన్నడ కుర్రాడు సుమంత్‌ శైలేంద్ర ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. రాజ్‌తరుణ్‌ ‘సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు’ నిర్మాత శైలేంద్ర తనయుడు ఇతను. ‘బ్రాండ్‌ బాబు’తో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కర్త, కర్మ, క్రియ అన్నీ తానై మారుతి తీసిన ఈ చిత్రం కూడా విజయపు తీరాలు చేరలేదు.

తాజాగా శుక్రవారం తెలుగులో ‘వైరం’ అనే సినిమా ప్రారంభమైంది. ఇందులో కథానాయకుడు కన్నడ నటుడు దేవరాజ్‌ కుమారుడు. మొన్న మహేశ్‌బాబు ‘భరత్‌ అనే నేను’లో ప్రతిపక్ష నాయకునిగా దేవరాజ్‌ నటించాడు. ఆయన తనయుడు ప్రణమ్‌ దేవరాజ్‌ ‘వైరం’తో తెలుగులోకి వస్తున్నాడు. ఇటీవలే కన్నడలో ‘కుమారి 21ఎఫ్‌’ రీమేక్‌తో విజయం అందుకున్నారు. అయితే… తెలుగులో విజయం సాధిస్తే వచ్చినంత పేరు, అభిమానులు కన్నడలో విజయాలు సాధిస్తే రావు. అందుకని ఇటీవల తెలుగులో కథానాయకులుగా ఎదగాలి కలలు కనే కన్నడ కుర్రాళ్ల సంఖ్య ఎక్కువైంది. మన దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలుగుపై కన్నడ కుర్రాళ్లకు ఎందుకంత ప్రేమ!? పేరు ప్రఖ్యాతలు, అభిమానులే కారణమా? అంటే… మరో కారణం కూడా వుంది. కన్నడతో పోలిస్తే తెలుగు మార్కెట్‌ పెద్దది. ఇక్కడ హిట్‌ కొడితే… ఎక్కువ పారితోషకాలు లభిస్తాయి. అందుకని, వరుసపెట్టి వస్తున్నారు. అయితే… వచ్చినవాళ్లలో విజయాలు సాధిస్తున్న వారి సంఖ్య తక్కువ. ఉపేంద్ర, సుదీప్‌ తప్ప తెలుగులో సక్సెస్‌ అయిన కన్నడ కథానాయకులు తక్కువ మంది వున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com